-
-
Home » Andhra Pradesh » 14030 PEOPLE CAME FROM FOREIGN COUNTRIES
-
విదేశాల నుంచి రాష్ర్టానికి 14,030 మంది రాక
ABN , First Publish Date - 2020-03-25T09:12:40+05:30 IST
కరోనాకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...

- ప్రతి పంచాయతీలో ప్రత్యేకాధికారి
- విశాఖలో లాక్‌డౌన్ సరిగా పాటించట్లేదు: ఆళ్ల నాని
విశాఖపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనాకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మరో 40 మంది నమూనాలను పరీక్షలకు పంపారని, వాటి నివేదికలు రావాల్సి ఉందన్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబులతో కలసి మంగళవారం ఆయన విశాఖపట్నంలో జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడుతూ విదేశాల నుంచి 14,030 మంది రాష్ట్రంలోకి రాగా, వారిలో 2,426 మందికి 28 రోజుల క్వారంటైన్ పూర్తయిందన్నారు. మరో 11,526 మంది ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని, 86 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. జ్వరం, దగ్గు తదితర లక్షణాలున్న 220 మంది నుంచి నమూనాలు సేకరించగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, వారిలో ముగ్గురు విశాఖపట్నం వాసులు ఉన్నారన్నారు. 168 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి మరింత సహకారం అవసరమన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి రవాణా వ్యవస్థను నిలిపివేశామని, పదో తరగతి పరీక్షలూ వాయిదా వేశామని, రాజధాని మార్పు కూడా కొంత వాయిదా పడిందని వివరించారు. ఎవరికి ఎన్ని పనులున్నా 31వరకు వాటిని వాయిదా వేసుకోవాలని కోరారు. విశాఖలో లాక్‌డౌన్‌ను ప్రజలు పాటించడం లేదని, అది సరైన విధానం కాదన్నారు. విశాఖకు సోమవారం వరకు 1,470 మంది విదేశాల నుంచి వచ్చారని, వారందరినీ గుర్తించామన్నారు. మరో 2,400 మంది కొత్తగా వచ్చారని ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు, వారిని కూడా గుర్తించి హౌస్ క్వారంటైన్ చేస్తామని చెప్పారు. కరోనా కట్టడికి విశాఖ అధికారులు 20కమిటీలను వేసి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వి్‌పమెంట్(పీపీఈ), ఎన్-95 మాస్క్‌లు, ఇతర పరికరాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఐసొలేషన్ పరికరాలు, వెంటిలేటర్లు సమకూరుస్తామన్నారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు 581 కాల్స్ వచ్చాయని, వాటిలో 95 శాతం కాల్స్ విదేశీయుల సంచారం గురించేనని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వీలైతే కరోనా సహాయక చర్యల్లో పాల్గొనాలే తప్ప విమర్శలు చేయడం తగదన్నారు. బాధితులను గుర్తించేందుకు ప్రతి పంచాయతీలో కార్యదర్శిని ప్రత్యేక అధికారిగా నియమించామని, విదేశాల నుంచి వచ్చిన ప్రతి పది మందిని పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక అధికారి బాధ్యత అప్పగించామన్నారు.