తూర్పులో దూకుడు
ABN , First Publish Date - 2020-08-11T09:08:54+05:30 IST
నాలుగైదు రోజులుగా పది వేలకుపైగా నమోదవుతున్న కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా..

- వైరస్ విజృంభణ.. ఒక్కరోజులో 1235 కేసులు
- రాష్ట్రంలో 24 గంటల్లో 7,665 కేసులు
- 2,35,525కి చేరిన కరోనా పాజిటివ్‌లు
- రాష్ట్రవ్యాప్తంగా మరో 80 మంది మృతి
- 2,116కి చేరిన మొత్తం మరణాలు
- ప్రతి వంద మంది బాధితుల్లో ఒకరు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నాలుగైదు రోజులుగా పది వేలకుపైగా నమోదవుతున్న కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,665 మందికి పాజటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,35,525కు చేరింది. కేసులు తగ్గినా కరోనా మరణాలు మాత్రం అధికంగానే నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 కొవిడ్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీలోనే రెండు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఏపీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా సోకిన ప్రతి వంద మందిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.35 లక్షల మందికి కరోనా సోకగా వారిలో 2,116 మంది మృత్యువాత పడ్డారు. ఇది ఆరోగ్యశాఖ లెక్క మాత్రమే. అనధికారికంగా ప్రతి వంద మంది బాధితుల్లో ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వైద్యలు అంచనా వేస్తున్నారు. కొత్తగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 1235, కర్నూలులో 883 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 6,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,45,636కి పెరిగింది. తాజాగా నమోదైన మరణాల్లో ప్రకాశంలో 11, గుంటూరులో 10, పశ్చిమ గోదావరిలో 9, కడపలో 7, శ్రీకాకుళంలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, అనంతపురంలో 5, నెల్లూరులో 5, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, తూర్పుగోదావరిలో నలుగురు చొప్పున మరణించారు.
తూర్పులో తగ్గని ఉధృతి
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉధృతికి బ్రేక్ పడడం లేదు. రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న ఈ జిల్లాలో సోమవారం కూడా 1235 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 32,938కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో కొత్తగా 883 పాజిటివ్ కేసులు నమోదవగా మొత్తం బాధితుల సంఖ్య 28314కు చేరింది. 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. గుంటూరు జిల్లాలో మరో 621 కేసులు బయటపడ్డాయి. గుంటూరు నగరంలో అత్యధికంగా 122, సత్తెనపల్లిలో 153, తెనాలిలో 46 కేసులు వెలుగుచూశాయి.
అనంతపురం జిల్లాలో 631 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 24,738కి చేరింది. వారిలో 17,597 మంది డిశ్చార్జ్ కాగా 175 మంది మృతిచెందారు. కృష్ణా జిల్లాలో మరో 146 మందికి వైరస్ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 10,438కి చేరింది. పశ్చిమగోదావరిలో 722 మందికి వైరస్ సోకగా.. నెల్లూరులో 511, చిత్తూరులో 479, విశాఖలో 620, ప్రకాశంలో 450, కడపలో 439, శ్రీకాకుళంలో 354, విజయనగరంలో 574 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.