ఒకే కుటుంబంలో 11మందికి
ABN , First Publish Date - 2020-04-12T08:39:12+05:30 IST
కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. శనివారం ఒక్కరోజే 24 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూలులో 5...

- వీరిలో పదేళ్లలోపు చిన్నారులు ఆరుగురు
- గుంటూరులో మరో 17 కరోనా కేసులు
- కర్నూలులోనూ ఐదుగురికి పాజిటివ్
- ప్రకాశం, కడపల్లో ఒక్కొక్కరు చొప్పున
- ఒకేరోజు 24 మందికి వైరస్ నిర్ధారణ
- రాష్ట్రంలో 400 దాటిన పాజిటివ్ కేసులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. శనివారం ఒక్కరోజే 24 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ మహమ్మారి తీవ్రతకు గుంటూరు జిల్లా విలవిల్లాడుతోంది. కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో 17మంది గుంటూరు నగరానికి చెందినవారే. వీరిలో 11మంది ఒకే కుటుంబానికి చెందినవారు. ఇందులో పదేళ్ల లోపు చిన్నారులు ఆరుగురు (ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురు) ఉన్నారు. ఇదే కుటుంబంలో ఇద్దరు మహిళలకు కూడా ఈ వ్యాధి సోకింది. నగరంలో రెడ్‌జోన్ ప్రాంతంగా గుర్తించిన ఓ వీధిలో ఇప్పటికే 22మందికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడ నివసించేవారు బెంబేలెత్తుతున్నారు. గుంటూరులో వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురికి కూడా వైరస్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 75కు పెరిగింది.
వీరిలో ఇప్పటికే ఒకరు మరణించిన విషయం తెలిసిందే. దాచేపల్లికి చెందిన వ్యక్తి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. వైద్యపరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారితో సంబంధం ఉన్నవారే. దీంతో ఈ జిల్లాలో కేసుల సంఖ్య 82కు చేరుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి(40)కి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ కనెక్షన్‌తో కరోనా సోకిన వ్యక్తి ఇంటికి ఇతని ఇల్లు 400మీటర్ల దూరంలోనే ఉండటంతో ఈయనకూ వైరస్ సోకిందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ మరో పాజిటివ్ కేసు నమోదైంది. కాగా, గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం వాసి(22) కరోనా లక్షణాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతను మూడురోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యుల వద్ద చూపించుకున్నా పరిస్థితి విషమించటంతో శుక్రవారం రిమ్స్‌కు తరలించగా, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెమ్ము లక్షణాలతో బాధపడుతున్న ఆ యువకుడు శనివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇతని నమూనాలను పరీక్షల కోసం పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది.
గుంటూరులో ఒకరు డిశ్చార్జ్
గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మొదటి వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ ప్రజాప్రతినిధి బంధువు కూడా అయిన ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత గత నెల 23న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో వైద్యాధికారులు ఆయన్ను శనివారం డిశ్చార్జి చేశారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు...
జిల్లా పాజిటివ్ డిశ్చార్జి
అనంతపురం 15 -
చిత్తూరు 20 1
తూర్పుగోదావరి 17 1
గుంటూరు 75 1
కడప 30 -
కృష్ణా 35 3
కర్నూలు 82 -
నెల్లూరు 48 1
ప్రకాశం 41 1
విశాఖపట్నం 20 4
పశ్చిమగోదావరి 22 -
మొత్తం 405 12