కరోనా రోగిని నడిరోడ్డుపై వదిలివెళ్లిన 108 సిబ్బంది
ABN , First Publish Date - 2020-08-01T22:10:34+05:30 IST
మనుషుల ప్రాణాలంటే వారికి లెక్కలేదు. ఎవరు మారిన వాళ్లు మాత్రం మారలేదు. అదే నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం కంటే పెద్దమాట ఉంటే అక్షరాలా

అనంతపురం: మనుషుల ప్రాణాలంటే వారికి లెక్కలేదు. ఎవరు మారిన వాళ్లు మాత్రం మారలేదు. అదే నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం కంటే పెద్దమాట ఉంటే అక్షరాలా వారికి ఆ మాట సరిపోతుంది. ప్రపంచం మారుతున్నా ప్రభుత్వ వైద్యుల తీరు మారడం లేదు. ఒకవైపు కరోనా రోగులను ప్రేమతో చూడాలని, వారిపట్ల వివక్షతగదని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. ఈ మాటలు ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి చెవికెక్కడం లేదు. ప్రభుత్వం చెప్పే నీతివాక్యాలు, ప్రకటనలు తమకు మాత్రం కాదని అనుకుంటున్నారు ప్రభుత్వ వైద్యులు. అనంతపురం జిల్లా పెనుగొండలో దారుణం జరిగింది. మానవత్వం మంటకలిసింది. కరోనా రోగిని నడిరోడ్డుపై 108 సిబ్బంది వదిలి వెళ్లింది.
మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన గోపినాయక్ (60) కరోనా పాజిటివ్ రావడంతో జూలై 16న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే 15 రోజులుగా కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో అర్ధరాత్రి అంబులెన్స్‌లో తీసుకువచ్చి నడిరోడ్డుపై వదిలి వెళ్లారని బాధితుడు గోపినాయక్ వాపోయాడు. అచేతనస్థితిలో పడిఉన్న బాధితుడిని స్థానికులు చూసి చలించిపోయారు. గోపినాయక్ నుంచి వివరాలు తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో చేసేదేమీలేక గోపినాయక్‌ను స్వగ్రామానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కరోనా రోగలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామనే ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోందని, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని కుటుంబసభ్యులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.