కరోనా కేక!

ABN , First Publish Date - 2020-04-26T09:10:33+05:30 IST

75, 35, 56, 80, 62... వరుసగా ఐదు రోజులు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇది. శనివారం మరో 61 మందికి వైరస్‌

కరోనా కేక!

రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన సీన్‌.. తెలంగాణను దాటేసి ముందుకు

సిక్కోలులో తొలిసారి 3 పాజిటివ్‌లు.. కృష్ణాలో వైరస్‌ స్వైరవిహారం

జిల్లాలో ఒకేరోజు 25 కేసులు.. ప్రకటించాల్సినవి మరో 50?

రాష్ట్రంలో కొత్తగా 61 మందికి పాజిటివ్‌

కర్నూలులో ప్రజాప్రతినిధి ఇంట్లో కలకలం 

ఆరుగురికి వైరస్‌.. వారిలో నలుగురు వైద్యులు

నెల్లూరులో వలంటీర్‌, కిరాణా వ్యాపారికి 

కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరి మృతి 

మరణాలకు బ్రేక్‌ పడేదెలా!

ఎక్కువ కేసులున్న రాష్ట్రాల్లో మృతులు తక్కువ

ఏపీలో మాత్రం 1016 కేసులకే 31 మరణాలు


అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ... మన రాష్ట్రం మాత్రం మున్ముందుకు పోతోంది. కొత్తగా శ్రీకాకుళం జిల్లా కూడా ‘కరోనా’ జాబితాలో చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. పొరుగునే ఉన్న తెలంగాణనూ మించిపోయింది.  కేసుల్లో దక్షిణాదిలో రెండో స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మృతుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తర్వాత కొవిడ్‌-19 మృతులు ఎక్కువగా ఉన్నది ఏపీలోనే!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

75, 35, 56, 80, 62... వరుసగా ఐదు రోజులు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇది. శనివారం మరో 61 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటి 1016కు చేరింది. దేశంలో వెయ్యికిపైగా  కేసులు నమోదైన 8వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. తాజాగా కృష్ణా జిల్లాలో 25, కర్నూలులో 14, అనంతపురంలో 5, కడప, నెల్లూరులో 4, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. గ్రీన్‌జోన్‌లో ఉందనుకున్న శ్రీకాకుళం జిల్లాకు కూడా కరోనా ఎఫెక్ట్‌ తాకింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయిన 42 రోజుల తర్వాత ఈ జిల్లాలో తొలిసారిగా ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్‌  సోకింది. కృష్ణా జిల్లా విజయవాడలో 20మందికి, జగ్గయ్యపేట, నూజివీడులో ఇద్దరు చొప్పున, ముసునూరు మండలంలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.


కరోనా లక్షణాలున్న విజయవాడకు చెందిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకురాగా అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యపరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలింది. శనివారం సాయంత్రం వరకు విజయవాడ నగరానికి చెందిన మరో 50మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. వీరిలో ఆ ఆస్పత్రి అధినేత కూడా ఉన్నారు. శనివారం గుంటూరు నగరానికి చెందిన ఓ హోటల్‌ యజమాని అనారోగ్యంతో మృతి చెందగా అతని నమూనాలను పరీక్షలకు పంపారు. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలో మరో 5కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. ప్రొద్దుటూరులో పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. 


ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి... 

ర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఆయన ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, వీరిలో ఒకరి కుమారుడు(14) ఉండగా, 83ఏళ్ల తండ్రికీ సోకినట్లు నిర్ధారణ అయింది. తండ్రి పరిస్థితి సీరియ్‌సగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఆ ఇద్దరికీ ఎలా...? 

నెల్లూరుజిల్లా తడ మండలానికి చెందిన వార్డు వలంటీరుకు పాజిటివ్‌ వచ్చింది. ఆమె మూడురోజుల క్రితం తన పరిధిలోని 50కుటుంబాలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇచ్చిన నిత్యావసరాలు అందజేసింది. మరో 30మంది వలంటీర్లతో కలిసి సరుకుల ప్యాకెట్లు కట్టింది. అంతకు రెండురోజల క్రితం సూళ్లూరుపేట పరిఽధిలో తన అన్న అంతిమయాత్రలో పాల్గొంది. నాలుగు రోజుల పాటు ఆ ఊళ్లోనే బస చేసింది. ఈమెకు పాజిటివ్‌ రావడంతో అధికారులు వందలాది మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక ముత్తూరుకూరు చెందిన కిరాణా వ్యాపారికీ కరోనా నిర్ధారణ అయింది. అయన రోజూ నెల్లూరులో స్టోన్‌హౌ్‌సపేటకు వచ్చి తన దుకాణానికి అవసరమైన సరుకులు తీసుకెళ్లేవాడు. ఆయన వద్ద సరుకులు కొనుగోలు చేసిన 80మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ ఇద్దరికి ఎలా వైరస్‌ సోకిందో తెలియడం లేదు. 


31కి పెరిగిన మరణాలు 

శనివారం కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 31కి పెరిగింది. మరోవైపు వేర్వేరు జిల్లాల్లో 26మంది వైరస్‌ బారినుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రకాశంలో 11మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 171కు చేరింది. 


ఆ ఏడాదిన్నర బాబు సేఫ్‌!  

చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఇద్దరు మహిళలు కరోనా మహమ్మారిని జయించి శనివారం చిత్తూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఒకరికి ఏడాదిన్నర వయసున్న బాబున్నాడు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండడంతో ఆమె బాబును తన వెంటే తెచ్చుకుంది.  అదృష్టవశాత్తూ ఆ బాబు కరోనా బారిన పడలేదు. డిశ్చార్జి సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లోనే బాబును తన వద్ద ఉంచుకున్నానని తెలిపింది. రోజూ ఆవు పాలు పట్టినట్లు పేర్కొంది. 



Updated Date - 2020-04-26T09:10:33+05:30 IST