వాగులోకి కారు.. క్వారీలోకి లారీ!

ABN , First Publish Date - 2020-03-02T08:42:49+05:30 IST

గుంటూరు జిల్లాలో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాగులోకి కారు దూసుకుపోయి ఆరుగురు మరణించగా, మరో ప్రమాదంలో క్వారీలోకి లారీ బోల్తాకొట్టి నలుగురు దుర్మరణం...

వాగులోకి కారు..  క్వారీలోకి లారీ!

  • గుంటూరు జిల్లాలో 2 ఘోర ప్రమాదాలు
  • 10 మంది దుర్మరణం.. 13 మందికి గాయాలు


ప్రత్తిపాడు, వెల్దుర్తి, మార్చి 1: గుంటూరు జిల్లాలో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాగులోకి కారు దూసుకుపోయి ఆరుగురు మరణించగా, మరో ప్రమాదంలో క్వారీలోకి లారీ బోల్తాకొట్టి నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకుమానుకు చెందిన 11 మంది గుంటూరు రూరల్‌ మండలం ఏటుకూరులోని బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ డ్రైవర్‌తో పాటు పలువురు మద్యం తాగారు.


అనంతరం స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, కర్నూతల వద్ద ఎదురుగా ఉన్న వాహనాన్ని క్రాస్‌ చేయబోతూ అదుపుతప్పింది. అమితవేగంతో ఉండటంతో ప్రధాన రహదారి నుంచి పది అడుగుల ఎత్తు లేచిన కారు పల్టీలు కొడుతూ పదిహేను అడుగుల లోతున ఉన్న నీరు లేని వాగులో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వన్నూరు ప్రసాదం (70), పోగర్తి రమణ (50), పోగర్తి సీతమ్మ (60), పోగర్తి వరలక్ష్మి (50), డ్రైవర్‌ కమాదుల శ్రీను (50) వజ్జా సుబ్బులు(50) మరణించారు. ఆరుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  


లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నలుగురి బలి

మరో ప్రమాదంలో.. ఇదే జిల్లా వెల్దుర్తి మండలంలోని బోదలవీడు గ్రామానికి చెందిన ముఠా కూలీలు అదే మండలానికి చెందిన శ్రీరాంపురంతండాలో మిర్చిని లారీలో లోడు చేసేందుకు వెళ్లారు. లోడు అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులో లారీ అదుపుతప్పి 40 అడుగుల లోతులో ఉన్న క్వారీలో పడిపోయింది. లారీలో ఉన్న సాధనాల హరికృష్ణ (30), సాధనాల శ్రీను (35), నాయుడు సాంబయ్య (60)తోపాటు లారీ డ్రైవర్‌ అమీర్‌ (20) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మాచర్ల రూరల్‌, టౌన్‌ సీఐలు భక్తవత్సలరెడ్డి, రాజేశ్వరరావు సిబ్బంది స్పందించి, మృతులను, క్షతగాత్రులను 108లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


Updated Date - 2020-03-02T08:42:49+05:30 IST