Share News

లోక్‌సభ నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:42 AM

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది.

లోక్‌సభ నామినేషన్ల పరిశీలన పూర్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది.

ఆయా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాల పరిశీలన చేపట్టారు. అన్ని పత్రాలు, అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు సక్రమంగా ఉన్నవారి నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి? ఎన్ని తిరస్కరణకు? గురయ్యాయనే దానిపై ఎన్నికల అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

అయితే, ప్రస్తుతమున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

పార్టీ బీఫామ్‌ సమర్పించకపోవడం, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నప్పుడు వివిధ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. నాగర్‌కర్నూల్‌ స్థానానికి సంబంధించి మంద జగన్నాథం సహా 13 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వరంగల్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మాజీ మంత్రి, సినీ నటుడు పల్లి బాబుమోహన్‌కు కూడా చేదు అనుభవం ఎదురైంది. బాబూమోహన్‌ అందజేసిన నామినేషన్‌లో ప్రతిపాదకుల సంతకాలు సక్రమంగా లేకపోవడం, అఫిడవిట్‌లో సరైన వివరాలు ఇవ్వకపోవడంతో తిరస్కరించారు. తాను ప్రజాశాంతి పార్టీలో చేరలేదని, తనకు అందిన ఆహ్వానం మేరకు కేఎల్‌ పాల్‌ను కలిస్తే ఆయన మెడలో పార్టీ కండువా వేశారని నామినేషన్‌ దాఖలు సందర్భంగా బాబూమోహన్‌ గురువారం విలేకరులతో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక, చేవెళ్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ అంశంలో కొంత ఉత్కంఠ రేగినప్పటికీ చివరి నిమిషంలో ఆమోదం లభించింది.


టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని రాజీనామా చేసిన రోజు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తనపై జరిగిన దాడికి సంబంధించిన కేసు వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఏఎ్‌సరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో కాసాని పేరు ఉండగా చార్జీషీట్‌లో మాత్రం లేదు.

దీనిపై రిటర్నింగ్‌ అధికారి వద్ద సుదీర్ఘవాదనల అనంతరం కాసాని నామినేషన్‌కు ఆమోదం లభించింది.

కాగా, నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 56 మంది 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా 25 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. భువనగిరి స్థానానికి 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా 10 మంది నామినేషన్లు తిరస్కరించారు. వరంగల్‌ స్థానానికి 58 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 10 మందివి, మహబూబాబాద్‌లో 30 మంది అభ్యర్థుల్లో ఐదుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి 64 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి 42 మంది నామినేషన్లు వేయగా ఏడుగురి నామినేషన్లకు ఆమోదం లభించలేదు.

మల్కాజిగిరి స్థానానికి 114 మంది నామినేషన్లు వేయగా అందులో 77 తిరస్కరణకు గురయ్యాయి.

కాగా, తిరస్కరణకు గురైన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును వెనక్కి ఇస్తామని, నామినేషన్‌ తిరస్కరణకు కారణాలను అభ్యర్థులకు తెలియజేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29, సోమవారం తుది గడువు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో అభ్యర్థుల నుంచి ఉపసంహరణ దరఖాస్తులు స్వీకరించరు.

దీంతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ గడువు పూర్తి అయిన తర్వాతే ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే అంశంపై స్పష్టత వస్తుంది.

Updated Date - Apr 27 , 2024 | 05:42 AM