Share News

మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తారా?

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:54 AM

ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం.. అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొక్కడమా..?’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. చెంగిచర్ల ఘటనలో

మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తారా?

అక్రమ అరెస్టులతో గొంతు నొక్కడమా?

ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?

చెంగిచర్ల బాధితులను పరామర్శిస్తే కేసులా?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/సిటీ/పీర్జాదిగూడ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం.. అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొక్కడమా..?’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. చెంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులు పెట్టడం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్‌ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చెంగిచర్ల ఘటనలో దెబ్బలు తిన్నవారిపైనే కేసులు నమోదు చేయడం సబబు కాదని అన్నారు. అక్కడికి ఇతర పార్టీల నేతలు పోవచ్చు కానీ బీజేపీ నాయకులపై ఆంక్షలు విధించడం ఏంటని నిలదీశారు. ‘‘హోళీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగింది. చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారు. దాడి చేసిన వాళ్లను వదిలి.. ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా..? చెంగిచర్ల ఏమైనా నిషేధిత ప్రాంతమా..? కబేళా నడుపుతున్న మాఫియాకు బారికేడ్లు పెట్టి మరీ వంతపాడటం ఎంతవరకు సమంజసం..?’’ అని కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. చెంగిచర్లలో అక్రమ కబేళాను తొలగించాలని.. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని, బాధితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

బండి సంజయ్‌పై కేసు..

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి ఠాణాలో కేసు నమోదైంది. హోలీ పండుగ సందర్భంగా చెంగిచర్ల పిట్టల బస్తీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ర్యాలీగా వచ్చిన బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో నాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ నందీశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదైంది. కాగా, హోళీ పండగ రోజు చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసులు ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. దాడులు చేసిన వారిలో ఏడుగురిపై మాత్రమే కేసులు నమోదు చేసి మిగతా వారిని వదిలేశారని మండిపడ్డారు. మరోవైపు బాధితులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తనను హౌస్‌ అరెస్టు చేయడం సరికాదని అన్నారు.

ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలి: లక్ష్మణ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులెవరో తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. తన ఫోన్‌ కూడా ట్యాప్‌ అయిందో లేదో తేల్చాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేతలు చెబితేనే ట్యాపింగ్‌ చేశామని నిందితులు చెబుతున్నారు. ఒకరిద్దరి ఫోన్‌లు ట్యాప్‌ అయి ఉండొచ్చని కేటీఆర్‌ అంటున్నారు. మీ ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్‌లు ట్యాప్‌ చేశారా?’’ అని కేటీఆర్‌ను నిలదీశారు. ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సర్కారు ఫోన్‌ ట్యాపింగ్‌ను తెరపైకి తెచ్చిందనే అనుమానం కలుగుతోందని లక్ష్మణ్‌ అన్నారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ భేటీలు

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బీజేపీ మేనిఫెస్టో సమావేశాలునిర్వహించనుంది. వచ్చే నెల 5లోగా ఈ సమావేశాలు పూర్తిచేయనుంది. ఈ సందర్భంగా ఆయా సెగ్మెంట్ల పరిధిలో రైతులు, మహిళలు, దళితులు, కార్మికులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకొని, జాతీయ నాయకత్వానికి నివేదించనుంది. గురువారం పార్టీ కార్యాలయంలో సమావేశమైన మేనిఫెస్టో కమిటీ పలు అంశాలపై చర్చించింది. కాగా, ఖమ్మం మాజీ అదనపు డీసీపీ అత్తలూరి సుభాష్‌ చంద్రబోస్‌ కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Updated Date - Mar 29 , 2024 | 05:54 AM