Share News

ప్రభాకర్‌రావు ఆదేశించారు రాధాకిషన్‌ అమలు చేశారు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:40 AM

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఓఎస్డీ హోదాలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్‌రావును దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు.. ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా

ప్రభాకర్‌రావు ఆదేశించారు  రాధాకిషన్‌ అమలు చేశారు

రాధాకిషన్‌, డీఎస్పీ గట్టుమల్లు అరెస్టు!!

హవాలా, వ్యాపారులకు బెదిరింపుల కోణంలో దర్యాప్తు

విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐబీ

ఎస్‌ఐబీలో రిటైర్డ్‌ అధికారుల పాత్రపైనా ఆరా

సర్వీసులో ఉన్న కొందరికి బిగుస్తున్న ఉచ్చు?

భుజంగరావు, తిరుపతన్నకు ఐదు రోజుల కస్టడీ

ప్రణీత్‌రావు కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఓఎస్డీ హోదాలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్‌రావును దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు.. ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లు(ప్రస్తుతం డీఎస్పీ)ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్టయిన విషయం తెలిసిందే..! వీరిని విచారించిన సమయంలో రాధాకిషన్‌, గట్టుమల్లు పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే వీరిద్దరినీ బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచి విచారించగా.. రాధాకిషన్‌ పాత్ర నిర్ధారణ అయ్యాకే.. ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారని తెలిసింది. ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు జారీ చేసిన ఆదేశాలను రాధాకిషన్‌ తూ.చ. తప్పకుండా పాటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ఫోన్‌ట్యాపింగ్‌ అనేది విపక్ష నేతలు, అధికారులకే పరిమితం కాకుండా.. నగల వ్యాపారులు, హవాలా ముఠాలకూ విస్తరించినట్లు ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు చెప్పే నగల వ్యాపారులు, హవాలా ఆపరేటర్లను రాధాకిషన్‌రావు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రప్పించి, మాట్లాడినట్లు సమాచారం. ఆ కోణంపై దర్యాప్తు అధికారులు దృష్టిసారించారు. ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు కూడా రాధాకిషన్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశారు. వీరిద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించి, వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అరెస్టయిన తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాధాకిషన్‌రావును విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందాలు దర్యాప్తు చేస్తుండగా.. పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌ఐబీ అధికారులు ఎప్పటికప్పుడు దర్యాప్తు పురోగతిని తెలుసుకుంటున్నారు.

అంటకాగిన వారిపై నజర్‌

రాధాకిషన్‌, గట్టుమల్లుతో అంటకాగిన కానిస్టేబుల్‌ మొదలు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులపై బంజారాహిల్స్‌ పోలీసులు దృష్టిసారించారు. ఇప్పటికే కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. ఈ కోవలో రాధాకిషన్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌లోని వేర్వేరు జోన్ల బృందాల్లో ఎస్సైలుగా పనిచేసిన ప్రస్తుత ఇన్‌స్పెక్టర్లు ముగ్గురు, మరో ఇద్దరు ఎస్సైలను పలుమార్లు విచారించినట్లు సమాచారం. వీరిలో ఒకరు నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లోనే ఉన్నారని, అక్కడే ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందగా.. ఆయన ఉన్న పోస్టును అప్‌గ్రేడ్‌ చేయించినట్లు తెలుస్తోంది. మరో ఎస్సై కూడా ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి రాగానే.. రాధాకిషన్‌కు సహకరించేందుకు ఎస్‌ఐబీకి బదిలీ అయినట్లు సమాచారం. రాధాకిషన్‌కు చిక్కడపల్లిలో ఓ హాస్టల్‌ ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు.. అక్కడే సెటిల్మెంట్లు జరిపినట్లు భావిస్తున్నారు.

రిటైర్డ్‌ అధికారుల పాత్రపె దృష్టి

గత ప్రభుత్వం అత్యంత కీలకమైన ఎస్‌ఐబీలో ఓ క్రమపద్ధతిలో రిటైర్డ్‌ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ప్రభాకర్‌రావు ఫోన్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ కాల్‌లో.. ‘‘రిటైర్‌ అయిన మమ్మల్ని ప్రభుత్వం విధుల్లో నియమించింది. మీరు ఇప్పుడు ఏవిధంగానైతే ప్రభుత్వం చెప్పిన పని చేస్తున్నారో.. మేము కూడా అప్పట్లో అదే చేశాం’’ అని చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి.. విశ్రాంత పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి, చెప్పుచేతల్లో పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా రిటైర్డ్‌ అధికారులను ఓఎస్డీలుగా నియమించుకునే వ్యవహారమంతా ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోవలో ఒక డీఐజీ, ముగ్గురు ఎస్పీలు, నలుగురు అదనపు ఎస్పీలు, పలువురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు.. ఇలా మొత్తం 15 మందిని పదవీ విరమణ తర్వాత ఎస్‌ఐబీలో నియమించారని, ట్యాపింగ్‌ వ్యవహారంలో వీరే కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే.. ఇలా ఓఎస్డీలుగా నియమించినవారిలో ఒకరిద్దరు ఈ వ్యవహారం నచ్చక ‘గుడ్‌బై’ చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం మారగానే.. మిగతావారు కూడా రాజీనామా చేశారు. ట్యాపింగ్‌ కేసులో వీరందరినీ విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉండి.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారులను కూడా అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణీత్‌రావు ఎన్నికల ఫలితాల తర్వాతి రోజు హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేయడానికి ముందు సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించిన విషయం తెలిసిందే. అందుకు సహకరించిన ఎలక్ట్రీషియన్‌ తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌(టీఎ్‌సఎ్‌సపీ) కానిస్టేబుల్‌ అని తెలిసింది. ఆయనను కూడా దర్యాప్తు బృందాలు విచారించినట్లు సమాచారం.

పోలీసు కస్టడీకి భుజంగరావు, తిరుపతన్న

చంచల్‌గూడ జైలులో ఉన్న భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. పోలీసులు వారంపాటు కస్టడీ కోరగా.. న్యాయమూర్తి ఐదు రోజులకు అనుమతించారు. వీరిని శుక్రవారం నుంచి మంగళవారం వరకు పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. ప్రణీత్‌రావు కస్టడీకి పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Mar 29 , 2024 | 06:41 AM