Share News

తనఖా భూముల పాస్‌బుక్‌లకు విముక్తి

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:42 AM

ధరణి కారణంగా తనఖా భూముల పాస్‌బుక్‌లకు దూరమైన వేలాదిమంది రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సదరు పాస్‌బుక్‌లను రిలీజ్‌ చేసే బాధ్యతలను రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంట్‌కు

తనఖా భూముల పాస్‌బుక్‌లకు విముక్తి

విడుదలకు అనుమతిస్తూ ప్రభుత్వ నిర్ణయం .. సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు

ఉత్తర్వులు జారీచేసిన సీసీఎల్‌ఏ

ధరణి కారణంగా నిలిచిపోయిన మార్టిగేజ్‌ భూముల పాస్‌బుక్‌లు

అప్పులు చెల్లించిన తర్వాత కూడా వేలాదిమంది రైతులకు తిప్పలు

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉపశమనం

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ధరణి కారణంగా తనఖా భూముల పాస్‌బుక్‌లకు దూరమైన వేలాదిమంది రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సదరు పాస్‌బుక్‌లను రిలీజ్‌ చేసే బాధ్యతలను రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో తనఖా (మార్టిగేజ్‌) చేసిన డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌ (పట్టాదార్‌ పాస్‌బుక్‌) లను రిలీజ్‌ చేసేందుకు భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ ఈ నెల 13న సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. పాస్‌బుక్‌ల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది రైతుల కష్టాలు ఇక తీరనున్నాయి.

ఇదీ నేపథ్యం..

ధరణి రాక ముందు.. భూమిని తనఖా పెట్టి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్ధల నుంచి అప్పులు తీసుకున్న రైతులు.. రుణం చెల్లించిన తర్వాత తమ భూముల పాస్‌బుక్‌లను సబ్‌ రిజిస్ట్రార్‌ల నుంచి తిరిగి తీసుకునేవారు. అయితే, ధరణి పోర్టల్‌ 2020 నవంబర్‌ 1న వచ్చినప్పటి నుంచి మార్టిగేజ్‌ చేసిన భూముల పట్టాదార్‌ పాస్‌బుక్‌ల రిలీజ్‌ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది. వీటిని రిలీజ్‌ చేసే అవకాశం ఇటు ధరణి పోర్టల్‌లో లేదు. అటు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సాఫ్ట్‌వేర్‌లోనూ లేదు. దీంతో తీసుకున్న అప్పులు చెల్లించిన తర్వాత కూడా తమ పాస్‌బుక్‌ల కోసం కొన్ని వేల మంది రైతులు గత మూడేళ్లుకుపైగా వేచి చూస్తున్నారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత రెవెన్యూశాఖ.. వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములను, ఇతర స్థిరాస్తులను వేరు చేసింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మార్టిగేజ్‌, పాస్‌పుస్తకాల రిలీజ్‌ అధికారాలను తహశీల్దార్లకు అప్పగించింది. వ్యవసాయేతర భూములు, ఇతర స్థిరాస్తులపై అధికారాన్ని సబ్‌ రిజిస్ట్రార్లకు ఇచ్చింది. అయితే, ధరణి కంటే ముందు అప్పుల కోసం తనఖా పెట్టిన భూముల పాస్‌బుక్‌లను రిలీజ్‌ చేసే అప్షన్‌ ధరణిలో లేదు. దీంతో పాస్‌బుక్‌లను రిలీజ్‌ చేసే అధికారం తమకు లేదని తహశీల్దారులు చేతులెత్తేశారు. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యవహారం తమ పరిధిలోనిది కాదంటూ సబ్‌ రిజిస్ట్రార్లు చేతులు దులుపుకున్నారు. ఫలితంగా 2020 నవంబరు 1 నుంచి ఇప్పటి వరకు పట్టాదార్‌ పాస్‌బుక్‌లను రిలీజ్‌ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. తీసుకున్న అప్పులు చెల్లించినప్పటికీ టైటిల్‌ డీడ్‌ పొందని రైతులు రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 06:42 AM