Share News

సరిహద్దు వైపు ఏనుగుల గుంపు

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:12 PM

జిల్లా సరిహద్దులోకి ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉండడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏనుగు ఇద్దరిని హతమార్చింది. అప్రమత్తమైన అధికారులు ప్రాణహిత, గోదావరి తీర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఏనుగులు అగుపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

సరిహద్దు వైపు   ఏనుగుల గుంపు

కోటపల్లి, ఏప్రిల్‌ 28: ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏనుగుల గుంపు నీటి వనరులు ఉండే తెలంగాణ సరిహద్దులోని ప్రాణ హిత, గోదావరి తీరాల వైపు వస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరిం చడంతో ఇక్కడి అటవీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల కుమరంభీం జిల్లాలోకి మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ప్రవేశించిన ఓ ఏనుగు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులను చంపిన విషయం తెలిసిందే. అటవీ అధికారులు నానా తంటాలు పడి ఏనుగును దారి మళ్లించడంతో అది తిరిగి మహారాష్ట్రలోని ఏనుగుల మందలో చేరింది. మందను చేరిన ఏనుగు గుంపుతో కలిసి తిరిగి తెలంగాణ వైపు కదులుతున్నట్లు మహారాష్ట్ర అటవీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆళ్లపల్లి నుంచి గడ్చిరోలి వైపు సంచరిస్తున్న ఏనుగుల గుంపు ప్రాణహిత, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. ఈ రెండు జిల్లాల అటవీ అధికారులతో పాటు వ్యవసాయ, పశువైద్య, విద్యుత్‌ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఏనుగుల ప్రవర్తనను అధ్యయనం చేసేం దుకు ఇక్కడి యంత్రాంగం ఛత్తీస్‌గఢ్‌ అటవీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల అటవీ అధికా రులు గడ్చిరోలి జిల్లా అటవీ అధికారులతో సమావేశమయ్యారు. ఆసిఫా బాద్‌ జిల్లాలో సంచరించిన ఏనుగు ఆహారం, నీటి వనరులను కనుగొనేం దుకే ఇక్కడకు వచ్చి ఉంటుందని తిరిగి మందను చేరిన ఏనుగు గుంపును తీసుకుని ఈ ప్రాంతానికి వస్తున్నట్లు అధికారులు విశ్వసిస్తు న్నారు. పంట పొలాలు, చెరుకు, పుచ్చకాయ తోటలు, నీరు ఉండడంతో ఏనుగుల మంద ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

-అప్రమత్తం.... అవగాహన

ఏనుగుల గుంపు తెలంగాణ వైపు కదులుతుందనే సమాచారం మేరకు జిల్లా అటవీ యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి, ప్రాణహిత నది తీర ప్రాంతాల వైపు నిఘా పెట్టిన అధికారులు సరిహద్దు గ్రామాల ప్రజలను అలర్ట్‌ చేస్తున్నారు. ప్రాణహిత నదిలో నీరు ఉండడంతో ఏను గుల గుంపు వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాంత అడవులు ఏనుగుల సంచారానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. పెద్ద పులులకు కారిడార్‌ ఉన్నట్లే ఏనుగులు సైతం ఆహారం, నీటి వనరుల కోసం కారిడార్‌ ఏర్పాటు చేసుకుంటాయని, ఈ దశలో భాగంగానే తెలం గాణ వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతు న్నారు. ఏనుగుల సంచారం రాత్రిపూట ఎక్కువగా ఉంటుందని, నైట్‌ విజన్‌ డ్రోన్‌ కెమెరాలను వినియోగించాలని అటవీ శాఖ భావిస్తోంది. కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు తదితర మండలాల్లో ఇప్పటికే అటవీ అధికారులు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు చేపట్టారు. ఏనుగుల సంచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని, ఏనుగులకు కంటి చూపు తక్కువని, వినికిడి ఎక్కువగా ఉంటుందని, దూరం నుంచే వాసన పసిగడుతుందని, తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- ఏనుగుల గుంపు గ్రామాల్లోకి వస్తే ప్రజలు సిమెంటుతో నిర్మించిన పక్కా ఇండ్లలోకి వెళ్లాలి.

- ఏనుగుల గుంపు గ్రామంలోకి వస్తుందని తెలిస్తే గ్రామ సరిహద్దులో కాగడాలు వెలిగించడంతోపాటు మిర్చి పొడి స్ర్పే చేస్తే ఏనుగులు దారి మళ్లుతాయి.

- వాహనాల్లో వెళ్తున్న సమయంలో ఏనుగు రోడ్డు క్రాస్‌ చేస్తుంటే దూరంలోనే వాహనాలు నిలిపివేయాలి. దగ్గరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయకూడదు. రాత్రివేళల్లో అయితే వాహనాల లైట్లు ఆర్పివేయాలి.

- ఏనుగు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒంటరిగా ఉన్న ఏనుగుతోనే ఎక్కువగా ప్రమాదం ఉంటుంది.

- ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఏనుగులపై రాళ్లు, బాటిళ్లు విసరవద్దు. వాటిని రెచ్చగొట్టవద్దు.

- అటవీ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఫర్‌ఫ్యూమ్‌, సువాసనలు వెదజల్లే వాటిని ఉపయోగించవద్దు. ఏనుగు వాసనను దూరం నుంచే పసిగడుతుంది.

- ఏనుగు గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు వెంబడించవద్దు. దానిని ఆందోళనకు గురి చేస్తే అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

అప్రమత్తంగా ఉండాలి

- రవి, అటవీ శాఖ రేంజర్‌, కోటపల్లి,

ఏనుగుల సంచారం, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఏనుగుల సంచారం తెలిస్తే సమాచారం అందించాలి. నదుల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుపై ఏనుగు కనిపిస్తే రెచ్చగొట్టద్దు. దగ్గరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయవద్దు. వాహనాలను నిలిపివేయాలి. ఏనుగు రోడ్డు దాటాకే ముందుకు కదలాలి. ఏనుగులను వెంబడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated Date - Apr 28 , 2024 | 10:12 PM