Share News

వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం

ABN , Publish Date - May 08 , 2024 | 10:53 PM

జిల్లాలోని పలు మండలాల్లో మంగళ వారం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, గాలి దుమారంతో కూడిన వర్షం పడటంతో చేతి కొచ్చిన వరి, మామిడి నీటిపాలైంది.

వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం

మంచిర్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో మంగళ వారం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, గాలి దుమారంతో కూడిన వర్షం పడటంతో చేతి కొచ్చిన వరి, మామిడి నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దకాగా, రైస్‌ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. జిల్లాలోని భీమిని, నెన్నెల, భీమారం, తది తర మండలాల్లో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి.

వేల ఎకరాల్లో పంటకు నష్టం

జిల్లాలో వేల ఎకరాల్లో వరి, మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవ సాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు.

ఫ 1525 మంది రైతులకు చెందిన 2308 ఎకరాల్లో నష్టం వరి పంటకు నష్టం వాటిల్లింది. నష్టం విలువ సుమారు రూ. 28 లక్షల 99వేల 800 ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

ఫ మామిడి పంటకు 112 మంది రైతులకు చెందిన 247.20 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే చాలా మంది రైతులు మామిడికాయలు కోసినందున తక్కువ నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం రెండు టన్నుల మేర నష్టం వాటిల్లినా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే తుది అంచనా రిపోర్టు తయారు చేసి, త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుకు అదేశాలు

అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అద నపు కలెక్టర్‌ మోతీలాల్‌ తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం పూర్తిగా తడిసినందున మళ్లీ ఆరబెట్టాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు రోజుల తరబడి కళ్లాల్లో పడిగాపులు కాసి ఆరబెట్టిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాలనడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. ఆరబెట్టిన ధాన్యా న్ని వెంట వెంటనే తూకం వేసి, మిల్లులకు తరలించాల్సి ఉండగా మిల్లర్ల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల జాప్యం కారణంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పంట చేతికొచ్చే దశలో నష్టపోయినందున ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నష్టపరిహారం చెల్లించాలని రైతుల రాస్తారోకో

వేమనపల్లి, మే 8 : వేమనపల్లి మండలంలో మంగళవారం కురిసిన వర్షానికి వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని బుధవారం వేమనపల్లి గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వరి కర్రలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట నేలపాలైనప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సర్వే చేయించి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, రైతులు రవి, అశోక్‌, శ్రీనివాస్‌, శేఖర్‌రెడ్డి, కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:53 PM