Share News

జోరుగా నకిలీ విత్తనాల దందా

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:10 PM

పత్తి సీజన్‌ ప్రారం భానికి ముందే నకిలీ పత్తి విత్తనాలను (నిషేధిత బీటీ3) అమ్మేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. జిల్లాలో కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా నకిలీ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుం టున్నారు.

జోరుగా నకిలీ విత్తనాల దందా

మంచిర్యాల/బెల్లంపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పత్తి సీజన్‌ ప్రారం భానికి ముందే నకిలీ పత్తి విత్తనాలను (నిషేధిత బీటీ3) అమ్మేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. జిల్లాలో కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా నకిలీ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుం టున్నారు. వాటిని ఎవరికి అనుమానం రాకుండా మామిడితోటల్లో, ఇండ్లలో, రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. పత్తి సీజన్‌లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల నిఘా ఉంటుందని ముందుగానే తరలించి రైతులకు విక్రయిస్తున్నారు. యేటా నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వ్యాపా రులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నా నకిలీ పత్తి విక్రయాల దందా ఆగడం లేదు. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యవసాయం నిమిత్తం మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాలతోపాటు గుజరాత్‌ నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు.

-సీజన్‌కు ముందే జోరుగా దందా

జిల్లాలో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత ఏడాది సీజన్‌లో లక్షా 90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాకాలం (జూన్‌, జులై నెలల్లో)లో పత్తి పంట వేయడానికి రైతులు సిద్ధమవుతారు. సాగు చేసే సమయంలో వ్యవసాయ, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిఘా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వాహనాలను, ఎరువులు, విత్తనాలు విక్రయించే షాపులను తనిఖీ చేస్తుంటారు. ఆ సమయంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మాలంటే అక్రమార్కులకు కష్టంగా ఉంటుంది. దీంతో మూడు నెలల ముందే నకిలీ విత్త విత్తనాల దందాకు అక్రమార్కులు తెర లేపారు.

- ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి

జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించే వారు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌, మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వాహనాల్లో జిల్లాకు తీసుకువస్తున్నారు. ఈ విత్తనాలను ఆయా గ్రామాల్లోని స్ధానిక వ్యాపారులతో కలిసి రైతులకు అంటగడుతున్నారు. కిలో విత్తనాలను రూ.2 వేల నుంచి 2500ల వరకు విక్రయిస్తున్నారు. రైతులు సైతం బీటీ3 విత్తనాలను కొనుగోలు చేయడా నికి ఆసక్తి చూపుతుండడంతో అక్రమ వ్యాపారులకు వరంగా మారుతోంది.

- ఈ ప్రాంతాల్లోనే అధిక విక్రయాలు

జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూర్‌, నెన్నెల, చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, భీమారం, చెన్నూరులతోపాటు మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ఎక్కువ శాతం నకిలీ పత్తి విత్తనాలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. యేటా ఈ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు విక్రయించే అక్రమార్కులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఈ ప్రాంతాల్లో సీజన్‌కు ముందే ఇప్పటికే పలువురు వ్యాపారులు బీటీ 3 విత్తనాలను దిగుమతి చేసుకుని కోట్ల రూపాయల విలువ చేసే విత్తనాలను నిల్వ ఉంచినట్లు సమాచారం.

ఫ ఇటీవల పట్టుబడిన విత్తనాలు

ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాల సరఫరా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా నుంచి మందమర్రికి తరలిస్తుండగా మేడ్చల్‌ పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌లో ఉల్లిగడ్డ బస్తాల మాటున నకిలీ విత్తనాలను తరలిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన 1.2 టన్నుల బీటీ-3 పత్తి విత్తనాలతోపాటు ఉల్లిగడ్డ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందమర్రికి చెందిన శివయ్య, పిండి సురేష్‌ రాష్ట్రానికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో రైతులకు అమ్ముతుంటారు. కర్ణాటక నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గోషిక నవీన్‌కుమార్‌, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన గడ్డం శ్రీకాంత్‌ల సహాయం తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు డ్రైవర్లు కావడంతో ట్రిప్పు ఒక్కంటికి 5వేల రూపాయల చొప్పున కమీషన్‌ ఇచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. నిషేధిత విత్తనాలు తరలిస్తుండగా సమాచారం అందుకున్న మేడ్చల్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరమైన గ్లైఫోసేట్‌ గడ్డి మందును తట్టుకునే శక్తి బీటీ-3 విత్తనాలకు ఉండడంతో ప్రభుత్వం నిషేధించింది. అక్రమా ర్కులు గుట్టు చప్పుడు కాకుండా బీటీ-3 విత్తనాలు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఫ కన్నెపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌ శివారులో గురువారం నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి.

నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాం - రామగుండం సీపీ శ్రీనివాస్‌

నకిలీ పత్తి విత్తనాలపై నిఘా పెట్టాం. నకిలీ విత్తనాలు అమ్ముతు రైతులను మోసం చేసే వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను ఎవరైనా అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు పీడీయాక్టు నమోదు చేస్తాం.

Updated Date - Apr 26 , 2024 | 10:10 PM