Share News

టైటిల్‌ నిలబెట్టుకునేనా?

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:22 AM

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆసియా జట్ల మధ్య సమరమైన థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌లకు రంగం సిద్ధమైంది. పురుష జట్లు పోటీపడే థామస్‌ కప్‌, మహిళల జట్ల మధ్య జరిగే ఉబెర్‌ కప్‌ శనివారం మొదలవనుంది. ఇక, రెండేళ్ల క్రితం థామస్‌ కప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత

టైటిల్‌ నిలబెట్టుకునేనా?

భారీ అంచనాలతో భారత పురుషుల జట్టు

సీనియర్లు లేకుండానే మహిళల బృందం

నేటినుంచే థామస్‌, ఉబెర్‌ కప్‌ చాంపియన్‌షిప్‌

చెంగ్డూ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆసియా జట్ల మధ్య సమరమైన థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌లకు రంగం సిద్ధమైంది. పురుష జట్లు పోటీపడే థామస్‌ కప్‌, మహిళల జట్ల మధ్య జరిగే ఉబెర్‌ కప్‌ శనివారం మొదలవనుంది. ఇక, రెండేళ్ల క్రితం థామస్‌ కప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు మరోసారి ఆ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకోవాలనుకుంటోంది. నాడు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్లు కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌, లక్ష్యసేన్‌తో పాటు ప్రియాన్షు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి, ధ్రువ్‌ కపిల/అర్జున్‌ జంట ఈసారీ బరిలోకి దిగుతున్నారు. అయితే, సాత్విక్‌ జోడీని మినహాయిస్తే సింగిల్స్‌ స్టార్లు శ్రీకాంత్‌, ప్రణయ్‌, లక్ష్య ఫామ్‌లేమితో తంటాలు పడుతుండడం భారత్‌ను ఆందోళనపరుస్తోంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో పోటీపడుతున్న భారత జట్టు.. తమ గ్రూప్‌-సిలోని మాజీ విజేత ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లను ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. భారత పురుషుల బృందం తన తొలి పోరులో భాగంగా శనివారం థాయ్‌లాండ్‌తో తలపడనుంది. సోమవారం ఇంగ్లండ్‌తో, బుధవారం ఇండోనేసియాతో భారత్‌ మిగతా రెండు మ్యాచ్‌లను ఆడనుంది.


అస్మిత సారథ్యంలో మహిళల బృందం: మహిళల ఈవెంట్‌ ఉబెర్‌ కప్‌కు ఈసారి భారత్‌ నుంచి సీనియర్లు సింధు, డబుల్స్‌ స్టార్‌ జోడీలు పుల్లెల గాయత్రి/ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప/తనీషా క్యాస్ట్రో దూరమయ్యారు. వీరంతా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో భాగంగా వరుస టోర్నీల్లో పోటీపడాల్సి ఉండడంతో ఉబెర్‌ కప్‌ నుంచి తప్పుకొన్నారు. దీంతో అస్మితా చాలిహా సారథ్యంలో అన్మోల్‌ ఖర్బ్‌, ఇషారాణి, తన్వీ శర్మ, డబుల్స్‌ జోడీలు శ్రుతి మిశ్రా/ప్రియ, సిమ్రన్‌/రితికలతో కూడిన బృందం భారత్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. చైనా, కెనడా, సింగపూర్‌ జట్లతో పాటు భారత్‌ గ్రూప్‌-ఎ నుంచి తలపడనుంది. తొలిపోరులో భాగంగా శనివారం కెనడాతో అస్మిత బృందం అమీతుమీ తేల్చుకోనుంది.

ఫార్మాట్‌ ఇలా..

థామస్‌, ఉబెర్‌ కప్‌లో జట్లన్నీ నాలుగు గ్రూపులు (ఎ, బి, సి, డి)గా విడిపోయి పోటీపడతాయి. ప్రతి గ్రూపులో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మే 2న క్వార్టర్స్‌, 3న సెమీఫైనల్స్‌ జరుగుతాయి. మే 5న ఫైనల్‌ జరుగుతుంది.

Updated Date - Apr 27 , 2024 | 05:22 AM