Share News

పంజాబ్‌ కథ ముగిసె..

ABN , Publish Date - May 10 , 2024 | 02:00 AM

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పంజాబ్‌ కింగ్స్‌ నిష్క్రమించింది. అటు విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92) మెరుపు ఇన్నింగ్స్‌కు, బౌలర్ల అద్భుత ప్రదర్శన తోడవ్వడంతో...

పంజాబ్‌ కథ ముగిసె..

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X చెన్నై, రాత్రి 7.30 గం. వేదిక: అహ్మదాబాద్‌

బెంగళూరు ఘన విజయం

అదరగొట్టిన కోహ్లీ, పటీదార్‌

ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

ధర్మశాల: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పంజాబ్‌ కింగ్స్‌ నిష్క్రమించింది. అటు విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92) మెరుపు ఇన్నింగ్స్‌కు, బౌలర్ల అద్భుత ప్రదర్శన తోడవ్వడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 60 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగో విజయాన్నందుకున్న ఆర్‌సీబీ 10 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతోనే ఉంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55), గ్రీన్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) వేగంగా ఆడారు. హర్షల్‌కు మూడు, కావేరప్పకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రొసో (27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), శశాంక్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) మాత్రమే రాణించారు. సిరాజ్‌కు మూడు.. స్వప్నిల్‌, ఫెర్గూసన్‌, కర్ణ్‌ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు.


మధ్యలో వదిలేశారు: 242 పరుగుల భారీ ఛేదనలో రొసో ధాటికి పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మెరుపు వేగంతో ఆరంభమైంది. కానీ అతడు క్రీజులో ఉన్నంత సేపు ఓవర్‌కు 12 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లిన పంజాబ్‌.. ఆ తర్వాత శశాంక్‌ దూకుడుకు 14 ఓవర్ల వరకు పోటీలోనే ఉంది. కానీ ఆ తర్వాత మిడిలార్డర్‌ వైఫల్యంతో పోటీలో లేకుండా పోయింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (6) తొలి ఓవర్‌లోనే అవుటైనా.. బెయిర్‌స్టో (27)తో కలిసి రెండో వికెట్‌కు రొసో 65 పరుగులు అందించాడు. నాలుగో ఓవర్‌లో రొసో 4,4,4,6తో 18 రన్స్‌ రాబట్టగా, బెయిర్‌స్టో 6,4తో చెలరేగాడు. తర్వాతి ఓవర్‌లోనూ బెయిర్‌స్టో రెండు ఫోర్లు బాదినా.. ఫెర్గూసన్‌కు చిక్కాడు. అటు రొసో మాత్రం తన జోరును ఆపకపోవడంతో 8.2 ఓవర్లలోనే జట్టు స్కోరు వందకి చేరింది. అతను కూడా 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ తొమ్మిదో ఓవర్‌లో 4,6 బాదాక రొసో ఇన్నింగ్స్‌కు కర్ణ్‌ శర్మ బ్రేక్‌ వేశాడు. జితేశ్‌ (5), లివింగ్‌స్టోన్‌ (0) నిరాశపర్చినా.. శశాంక్‌ రన్‌రేట్‌ తగ్గకుండా బ్యాట్‌కు పనిజెప్పాడు. అతడి వేగానికి 14 ఓవర్లలోనే స్కోరు 150కి చేరింది. కానీ కోహ్లీ సూపర్‌త్రోతో శశాంక్‌ రనౌటవడంతో పంజాబ్‌ వెనుకబడింది. మిగిలిన వికెట్లన్నీ చకచకా పడడంతో 17 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసింది.


విరాట్‌-పటీదార్‌ మెరుపు ఆటతో..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆదిలో వికెట్లు కోల్పోయినా.. పరుగుల వేటలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. తొలి పది ఓవర్లలో రజత్‌ పటీదార్‌ ధాటికి 119/3 స్కోరు చేయగా.. వర్షం తర్వాత విరాట్‌ కోహ్లీ విధ్వంసంతో జట్టు 122/4 స్కోరు సాధించింది. అయితే కోహ్లీ 0, 10 పరుగుల వద్ద, పటీదార్‌ కూడా ఖాతా తెరవకుండానే ఇచ్చిన క్యాచ్‌లను పంజాబ్‌ ఫీల్డర్లు వదిలేయడం బెంగళూరుకు కలిసొచ్చింది. ఈ మూడుసార్లు కూడా అరంగేట్ర పేసర్‌ విద్వత్‌ కావేరప్ప బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. అయితే కావేరప్ప తన వరుస ఓవర్లలో ఓపెనర్‌ డుప్లెసి (9), విల్‌ జాక్స్‌ (12)ను అవుట్‌ చేశాడు. ఆరో ఓవర్‌లో పటీదార్‌ మూడు ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 56/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా ఆర్‌సీబీ జోరు తగ్గలేదు. ఏడో ఓవర్‌లో విరాట్‌, పటీదార్‌ చెరో సిక్సర్‌ బాదగా.. ఎనిమిదో ఓవర్‌లో పటీదార్‌ మూడు సిక్సర్లతో చెలరేగాడు. దీంతో స్కోరు 51 బంతుల్లోనే వందకు చేరింది. ఇక పదో ఓవర్‌లో సిక్సర్‌తో 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్‌ను కర్రాన్‌ అవుట్‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే భారీ వర్షంతో అర్ధగంటపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. అనంతరం 32 బంతుల్లో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 16వ ఓవర్‌లో కోహ్లీ 2 సిక్సర్లు, గ్రీన్‌ ఫోర్‌తో కర్రాన్‌ 21 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే 18వ ఓవర్‌లో 6,4తో సెంచరీ ఖాయమనిపించిన కోహ్లీ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అర్ష్‌దీప్‌ కోహ్లీ వికెట్‌ను అర్ష్‌దీప్‌ తీయడంతో నాలుగో వికెట్‌కు 92 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఇక 19వ ఓవర్‌లో ఆర్‌సీబీ 21 పరుగులు సాధించినా.. చివరి ఓవర్‌లో పేసర్‌ హర్షల్‌ మూడు పరుగులే ఇచ్చి దినేశ్‌ కార్తీక్‌ (18), లొమ్రోర్‌ (0), గ్రీన్‌ (46) వికెట్లను తీశాడు. అయినా ఆర్‌సీబీ చివరి నాలుగు ఓవర్లలో 56 రన్స్‌ సాధించింది.


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) రొసో (బి) అర్ష్‌దీప్‌ 92, డుప్లెసి (సి) శశాంక్‌ (బి) కావేరప్ప 9, విల్‌ జాక్స్‌ (సి) హర్షల్‌ (బి) కావేరప్ప 12, పటీదార్‌ (సి) బెయిర్‌స్టో (బి) కర్రాన్‌ 55, గ్రీన్‌ (సి) కర్రాన్‌ (బి) హర్షల్‌ 46, కార్తీక్‌ (సి) కర్రాన్‌ (బి) హర్షల్‌ 18, లోమ్రార్‌ (బి) హర్షల్‌ 0, స్వప్నిల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 241/7; వికెట్ల పతనం: 1-19, 2-43, 3-119, 4-211, 5-238, 6-240, 7-241; బౌలింగ్‌: కావేరప్ప 4-0-36-2, అర్ష్‌దీప్‌ 3-0-41-1, కర్రాన్‌ 3-0-50-1, హర్షల్‌ 4-0-38-3, రాహుల్‌ చాహర్‌ 3-0-47-0, లివింగ్‌స్టోన్‌ 3-0-28-0.

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (ఎల్బీ) స్వప్నిల్‌ 6, బెయిర్‌స్టో (సి) డుప్లెసి (బి) ఫెర్గూసన్‌ 27, రొసో (సి) జాక్స్‌ (బి) కర్ణ్‌ శర్మ 61, శశాంక్‌ (రనౌట్‌) 37, జితేశ్‌ (బి) కర్ణ్‌ శర్మ 5, లివింగ్‌స్టోన్‌ (సి) కర్ణ్‌ (బి) స్వప్నిల్‌ 0, కర్రాన్‌ (బి) ఫెర్గూసన్‌ 22, అశుతోష్‌ (ఎల్బీ) సిరాజ్‌ 8, హర్షల్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) సిరాజ్‌ 0, రాహుల్‌ చాహర్‌ (నాటౌట్‌) 5, అర్ష్‌దీప్‌ (సి) కర్ణ్‌ (బి) సిరాజ్‌ 4, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 17 ఓవర్లలో 181 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-6, 2-71, 3-107, 4-125, 5-126, 6-151, 7-164, 8-170, 9-174, 10-181; బౌలింగ్‌: స్వప్నిల్‌ 3-0-28-2, సిరాజ్‌ 4-0-43-3, యశ్‌ దయాల్‌ 2-0-22-0, ఫెర్గూసన్‌ 3-0-29-2, జాక్స్‌ 1-0-5-0, గ్రీన్‌ 1-0-16-0, కర్ణ్‌ శర్మ 3-0-36-2.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 11 8 3 0 16 1.453

రాజస్థాన్‌ 11 8 3 0 16 0.476

హైదరాబాద్‌ 12 7 5 0 14 0.406

చెన్నై 11 6 5 0 12 0.700

ఢిల్లీ 12 6 6 0 12 -0.316

లఖ్‌నవూ 12 6 6 0 12 -0.769

బెంగళూరు 12 5 7 0 10 0.217

ముంబై 12 4 8 0 8 -0.212

పంజాబ్‌ 12 4 8 0 8 -0.423

గుజరాత్‌ 11 4 7 0 8 -1.320

1

ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (4) 600+ పరుగులు సాధించిన బ్యాటర్‌గా రాహుల్‌తో సమంగా నిలిచిన కోహ్లీ.

Updated Date - May 10 , 2024 | 02:00 AM