Share News

జాక్స్‌ విధ్వంసం

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:56 AM

విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 నాటౌట్‌) వీరవిహారంతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో...

జాక్స్‌ విధ్వంసం

  • అదరగొట్టిన కోహ్లీ

  • బెంగళూరు 9 వికెట్ల గెలుపు

  • గుజరాత్‌ చిత్తు

అహ్మదాబాద్‌: విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 నాటౌట్‌) వీరవిహారంతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 200/3 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 నాటౌట్‌), షారుక్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) శ్రమ వృథా అయింది. ఛేదనలో బెంగళూరు 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 206 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. అలసటతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన మ్యాక్స్‌వెల్‌ మళ్లీ జట్టులోకొచ్చాడు. శతకంతో చెలరేగిన జాక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


అలవోకగా బాదుతూ..: జాక్స్‌, కోహ్లీ రెండో వికెట్‌కు అజేయంగా 74 బంతుల్లో 166 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు సునాయాసంగా నెగ్గింది. ఛేదనలో ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి (24) ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. అయితే, డుప్లెసిని కిషోర్‌ క్యాచవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన జాక్స్‌ కుదురుకోవడానికి కొంత సమయం తీసుకొన్నా.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 10 ఓవర్‌లో బౌండ్రీతో విరాట్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. టీమ్‌ స్కోరు వందకు చేరువైంది. చివరి 36 బంతుల్లో 53 పరుగులు కావాల్సి ఉండగా.. జాక్స్‌ ఒక్కసారిగా శివాలెత్తాడు. 15వ ఓవర్‌లో మోహిత్‌ బౌలింగ్‌లో 4,6,6,6,4తో ఏకంగా 29 పరుగుల పిండుకొన్న విల్‌.. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. రషీద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 6,6,4,6,6తో 29 పరుగులు రాబట్టిన జాక్స్‌ ఔరా అనిపించే రీతిలో సెంచరీ మార్క్‌ చేరుకోవడమే కాకుండా.. మరో 24 బంతులు మిగిలుండగానే జట్టును గెలుపు గీత దాటించాడు. 15వ ఓవర్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్న జాక్స్‌ 16వ ఓవర్లో సెంచరీ చేయడం చూస్తే...అతని విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్ధమవుతుంది. ఓ దశలో 16 బంతుల్లో 16 పరుగులే చేసిన జాక్స్‌, తర్వాతి 25 బంతుల్లో 84 రన్స్‌ సాధించాడు.


ముందుగా షారుక్‌..: బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన షారుక్‌ ఖాన్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. సాయి సుదర్శన్‌ తుది కంటా క్రీజులో నిలవడంతో గుజరాత్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. సుదర్శన్‌, షారుక్‌ మూడో వికెట్‌కు 45 బంతుల్లో 86 పరుగులతో ఆదుకొన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌.. తొలి ఓవర్‌లోనే సాహా (5) వికెట్‌ను చేజార్చుకొంది. గిల్‌ (16), సుదర్శన్‌ జాగ్రత్తగా ఆడడంతో.. తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ 42/1తో నిలిచింది. అయితే, ఏడో ఓవర్‌లో మ్యాక్సీ బౌలింగ్‌లో గిల్‌ వెనుదిరిగాడు. ఈ దశలో షారుక్‌ రాకతో స్కోరుబోర్డు ఊపందుకొంది. అర్ధ శతకంతో ప్రమాదకరంగా మారిన షారుక్‌ను సిరాజ్‌ బౌల్డ్‌ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. అనంతరం మిల్లర్‌ (26 నాటౌట్‌)తో కలసి సుదర్శన్‌ 69 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో.. గుజరాత్‌ అనూహ్యంగా 200 మార్క్‌ను తాకింది.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (బి) కర్ణ్‌ (బి) స్వప్నిల్‌ 5, గిల్‌ (సి) గ్రీన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 16, సుదర్శన్‌ (నాటౌట్‌) 84, షారుక్‌ (బి) సిరాజ్‌ 58, మిల్లర్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 200/3; వికెట్ల పతనం: 1-6, 2-45, 3-131; బౌలింగ్‌: స్వప్నిల్‌ 3-0-23-1, సిరాజ్‌ 4-0-34-1, యశ్‌ 4-0-34-0, మ్యాక్స్‌వెల్‌ 3-0-28-1, కర్ణ్‌ శర్మ 3-0-38-0, గ్రీన్‌ 3-0-42-0.

బెంగళూరు: కోహ్లీ (నాటౌట్‌) 70, డుప్లెసి (సి/సబ్‌) శంకర్‌ (బి) సాయి కిషోర్‌ 24, జాక్స్‌ (నాటౌట్‌) 100; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 16 ఓవర్లలో 206/1; వికెట్ల పతనం: 1-40; బౌలింగ్‌: అజ్మతుల్లా 2-0-18-0, సందీప్‌ వారియర్‌ 1-0-15-0, సాయి కిషోర్‌ 3-0-30-1, రషీద్‌ 4-0-51-0, నూర్‌ 4-0-43-0, మోహిత్‌ 2-0-41-0.


1

కేవలం 10 బంతుల్లోనే జాక్స్‌ 50 నుంచి 100 పరుగుల మార్క్‌ను అందుకోవడం ఐపీఎల్‌లో ఇదే ప్రథమం. అంతకుముందు గేల్‌ 13 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించాడు.

2

ఐపీఎల్‌లో బెంగళూరుకు ఇది రెండో అత్యధిక ఛేదన. 2010లో పంజాబ్‌పై 204 పరుగులు స్కోరును ఛేజ్‌ చేసింది.

Updated Date - Apr 29 , 2024 | 05:58 AM