Share News

IPL PK Vs KKR : 262.. ఉఫ్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:25 AM

ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల సునామీ. 261 పరుగులు సాధించాక ఇక గెలుపు తమదే అనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది నిజంగా ఊహించని పరిణామమే. అసాధ్యమనుకున్న ఛేదనను అనూహ్యరీతిలో సాగిన

IPL PK Vs KKR : 262.. ఉఫ్‌

18.4 ఓవర్లలోనే ఖతం

పంజాబ్‌ రికార్డు ఛేదన

బెయిర్‌స్టో సూపర్‌ సెంచరీ

రాణించిన శశాంక్‌, ప్రభ్‌సిమ్రన్‌

కోల్‌కతాకు భంగపాటు

బెయిర్‌స్టో (48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 108 నాటౌట్‌)

1 పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక ఛేదన (262) చేసిన జట్టుగా పంజాబ్‌

టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (42) నమోదు కావడం ఇదే తొలిసారి.

అలాగే ఓ ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (24) బాదిన జట్టుగా పంజాబ్‌.

6 ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక స్కోరు (262) చేసిన ఐపీఎల్‌ జట్టుగా పంజాబ్‌.

ఈ సీజన్‌లో 250+ స్కోర్లు నమోదు కావడం ఇది ఆరోసారి

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అసలేం జరుగుతోంది? ప్రతీ మ్యాచ్‌ అంతకు మించీ అన్నట్టుగా సాగుతున్న ఈ లీగ్‌లో మరో కళ్లుచెదిరే పోరు. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారిన ఈడెన్‌ గార్డెన్స్‌లో ఏకంగా 262 పరుగుల రికార్డు ఛేదనను పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు మరో 8 బంతులుండగానే ఊదిపారేశారు. ఇది టీ20 చరిత్రలోనే అత్యధిక ఛేదన. కలయా.. నిజమా అనే రీతిలో ప్రభ్‌సిమ్రన్‌ శుభారంభానికి బెయిర్‌స్టో శతకం తోడవ్వగా.. చివర్లో శశాంక్‌ సింగ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోల్‌కతా బౌలర్లు బిత్తరపోవాల్సి వచ్చింది. అంతకుముందు కేకేఆర్‌ బ్యాటర్లు సాగించిన జోరు కూడా కింగ్స్‌ ఆట ముందు చిన్నబోయింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 523 పరుగులు నమోదు కావడం విశేషం.

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల సునామీ. 261 పరుగులు సాధించాక ఇక గెలుపు తమదే అనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది నిజంగా ఊహించని పరిణామమే. అసాధ్యమనుకున్న ఛేదనను అనూహ్యరీతిలో సాగిన ఆటతీరుతో పంజాబ్‌ కింగ్స్‌ సుసాధ్యం చేసింది. జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 108 నాటౌట్‌) కీలక మ్యాచ్‌లో ఫామ్‌ అందుకోగా.. హిట్టర్‌ శశాంక్‌ సింగ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68 నాటౌట్‌), ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54) కోల్‌కతా బౌలర్లను చెడుగుడు ఆడారు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. సాల్ట్‌ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75), నరైన్‌ (32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 71) రాణించారు. అర్ష్‌దీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బెయిర్‌స్టో నిలిచాడు.


బాదుడే బాదుడు: భారీ ఛేదనను పంజాబ్‌ కళ్లు చెదిరే రీతిలో ఆరంభించింది. ఆరంభంలో ప్రభ్‌సిమ్రన్‌.. మధ్య ఓవర్లలో బెయిర్‌స్టో.. చివర్లో శశాంక్‌ ప్రతాపం సాగింది. స్పిన్నర్‌ నరైన్‌ మాత్రం రన్స్‌ను కట్టడి చేయగలిగాడు. ప్రభ్‌సిమ్రన్‌ మూడో ఓవర్‌లోనే 6,4,6,4తో 23 పరుగులు అందించాడు. ఐదో ఓవర్‌లో మరో 4,6తో 18 బంతుల్లోనే ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. ఇక ఆరో ఓవర్‌లో బెయిర్‌స్టో 4,6,4,4,6తో 24 రన్స్‌ రాగా ఆఖరి బంతికి ప్రభ్‌ రనౌటయ్యాడు. దీంతో పవర్‌ప్లేలో 93/1తో నిలిచింది. వన్‌డౌన్‌లో రొసో (26) కూడా ఉన్న కాసేపు వేగం కనబరిచాడు. అటు బెయిర్‌స్టో సిక్సర్‌తో 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రస్సెల్‌ ఓవర్‌ (12)లో రొసో సిక్సర్‌, జానీ రెండు సిక్సర్లతో 24 రన్స్‌ రాబట్టగా అటు స్కోరు 173/1కి చేరింది. రొసోను నరైన్‌ అవుట్‌ చేసినా.. శశాంక్‌ రాకతో పంజాబ్‌ దూకుడు ఆగలేదు. 14వ ఓవర్‌లో రెండు, 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో పాటు 18వ ఓవర్‌లో 6,6,4తో పంజాబ్‌ విజయాన్ని లాంఛనం చేసేశాడు. ఈ దెబ్బకు 23 బంతుల్లోనే శశాంక్‌ ఫిఫ్టీ పూర్తి కాగా.. మరోవైపు 45 బంతుల్లోనే బెయిర్‌స్టో తన సెంచరీని పూర్తి చేశాడు. 12 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన వేళ శశాంక్‌ మరో సిక్సర్‌తో 8 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


ఓపెనర్ల విధ్వంసం: 10 ఓవర్లలో 137.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు నరైన్‌, సాల్ట్‌ విజృంభించిన తీరిది. ఒకరికి మించి మరొకరు అన్నట్టు అలవోకగా పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పైగా నరైన్‌ 16 పరుగుల వద్ద, సాల్ట్‌ 34, 35 రన్స్‌ వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం కూడా కలిసివచ్చింది. ఆ తర్వాత కూడా ప్రతీ బ్యాటర్‌ వేగం కనబర్చడంతో కోల్‌కతా అవలీలగా 250+ దాటేసింది. మూడో ఓవర్‌లోనే సాల్ట్‌ 6,4,6తో 18 రన్స్‌ రాబట్టగా.. ఆ వెంటనే నరైన్‌ 4,6,4తో 21 రన్స్‌ సమకూర్చాడు. ఈ దెబ్బకు పవర్‌ప్లేలోనే జట్టు 76 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా కేకేఆర్‌ జోరు తగ్గలేదు. ఎనిమిదో ఓవర్‌లో నరైన్‌ రెండు ఫోర్లతో 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. అదే ఓవర్‌లో సాల్ట్‌ 4,6తో 22 రన్స్‌ వచ్చాయి. దీంతో స్కోరు కూడా వంద దాటింది. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ఓవర్‌లో నరైన్‌ను ఎల్బీగా ప్రకటించినా వెంటనే అతడు రివ్యూకు వెళ్లి బతికిపోయాడు. 25 బంతుల్లోనే సాల్ట్‌ అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. ఈ దశలో రాహుల్‌ చాహర్‌ కేకేఆర్‌కు ఝలక్‌ ఇచ్చాడు. 11వ ఓవర్‌లో నరైన్‌ వికెట్‌ తీయడంతో పంజాబ్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. తొలి వికెట్‌కు ఈ జోడీ 138 పరుగులు జత చేయడం విశేషం. కాసేపటికే తన ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో ఊపు మీదున్న సాల్ట్‌ను సామ్‌ కర్రాన్‌ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. ఓవైపు వెంకటేశ్‌ అయ్యర్‌ భారీ షాట్లు ఆడలేకపోగా.. హిట్టింగ్‌ కోసం ముందుగానే పంపిన రస్సెల్‌ (24) కాసేపే క్రీజులో నిలిచాడు. 16వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ అతడిని అవుట్‌ చేశాడు. అప్పటికే కేకేఆర్‌ స్కోరు 200 దాటేసింది. 18వ ఓవర్‌లో శ్రేయాస్‌ (28) బ్యాట్‌ ఝుళిపిస్తూ వరుసగా 6,4,6,6తో 24 రన్స్‌తో జోరు చూపాడు. కానీ చివరి రెండు ఓవర్లలో కోల్‌కతాకు 22 పరుగులే రాగా శ్రేయాస్‌, రింకూ (5), వెంకటేశ్‌ వికెట్లను కోల్పోయింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (బి) కర్రాన్‌ 75, నరైన్‌ (సి) బెయిర్‌స్టో (బి) చాహర్‌ 71, వెంకటేశ్‌ (రనౌట్‌) 39, రస్సెల్‌ (సి) హర్షల్‌ (బి) అర్ష్‌దీప్‌ 24, శ్రేయాస్‌ (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 28, రింకూ (సి) అశుతోష్‌ (బి) హర్షల్‌ 5, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 261/6; వికెట్ల పతనం: 1-138, 2-163, 3-203, 4-246, 5-253, 6-261; బౌలింగ్‌: కర్రాన్‌ 4-0-60-1, అర్ష్‌దీప్‌ 4-0-45-2, హర్షల్‌ 3-0-48-1, రబాడ 3-0-52-0, రాహుల్‌ చాహర్‌ 4-0-33-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-21-0.

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (రనౌట్‌) 54, బెయిర్‌స్టో (నాటౌట్‌) 108, రొసో (సి) శ్రేయాస్‌ (బి) నరైన్‌ 26, శశాంక్‌ (నాటౌట్‌) 68, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.4 ఓవర్లలో 262/2; వికెట్ల పతనం: 1-93, 2-178; బౌలింగ్‌: చమీర 3-0-48-0, హర్షిత్‌ 4-0-61-0, అనుకూల్‌ 2-0-36-0, నరైన్‌ 4-0-24-1, వరుణ్‌ 3-0-46-0, రస్సెల్‌ 2-0-36-0, రమణ్‌దీప్‌ 0.4-0-9-0.

Updated Date - Apr 27 , 2024 | 05:36 AM