Share News

దుమ్మురేపిన ధీరజ్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:51 AM

వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్లు అమోఘంగా రాణించారు. జ్యోతి సురేఖ ఏకంగా హ్యాట్రిక్‌ స్వర్ణాలతో ఔరా అనిపిస్తే..నేడు మరో తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర పసిడి, కాంస్య పతకాలతో...

దుమ్మురేపిన ధీరజ్‌

తెలుగు ఆర్చర్‌కు స్వర్ణ, కాంస్యాలు

ఒలింపిక్‌ చాంపియన్‌ కొరియాకు భారత్‌ షాక్‌

ఆర్చరీ వరల్డ్‌ కప్‌

షాంఘై : వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్లు అమోఘంగా రాణించారు. జ్యోతి సురేఖ ఏకంగా హ్యాట్రిక్‌ స్వర్ణాలతో ఔరా అనిపిస్తే..నేడు మరో తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర పసిడి, కాంస్య పతకాలతో సత్తా చాటాడు. భారత రికర్వ్‌ పురుషుల జట్టు ఏకంగా ఒలింపిక్‌ చాంపియన్‌ దక్షిణ కొరియాకి షాకిచ్చి విజేతగా నిలవడం విశేషం. మిక్స్‌డ్‌ టీమ్‌లో ధీరజ్‌ జోడీ కాంస్యం అందుకోగా, వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి రజతం సాధించింది. ఆదివారం నాటి పోటీల్లో రికర్వ్‌ ఆర్చర్లు స్వర్ణం, రజతం, కాంస్యం సహా మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. రికర్వ్‌ పురుషుల టీమ్‌ విభాగం ఫైనల్లో ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ త్రయం 5-1తో కివ్‌ ఊజిన్‌, కిమ్‌ జే డోక్‌, లీ ఊ సోక్‌తో కూడిన బలమైన దక్షిణ కొరియాను చిత్తు చేసి చారిత్రక బంగారు పతకం చేజిక్కించుకుంది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్‌ కప్‌ రికర్వ్‌ కేటగిరీలో భారత్‌ స్వర్ణం దక్కించుకుంది. 2010లో ఇదే షాంఘైలో జరిగిన ప్రపంచ కప్‌ స్టేజ్‌-4లో మనోళ్లు చివరిసారి పసిడి పతకాన్ని ముద్దాడారు. అలాగే ఈ విభాగంలో తిరుగులేని దక్షిణ కొరియాను మన ఆర్చర్లు మట్టికరిపించారు. జూన్‌లో అంటాల్యాలో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ముందు కొరియాపై గెలుపు భారత ఆర్చర్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. ఈ విజయం మన ర్యాంకింగ్‌ పాయింట్లనూ పెంచనుంది. ఇక..రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అంకితా భక్త్‌ జతగా ధీరజ్‌ 6-0తో మెక్సికో ద్వయం వాలెన్సియా/మతియా్‌సను ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. రికర్వ్‌ మహిళల వ్యక్తిగత కేటగిరీ తుది పోరులో దీపికా కుమారి 6-0తో హాంగ్జౌ ఆసియా క్రీడల చాంపియన్‌ లిమ్‌ సిహ్‌యోన్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమితో రజత పతకంతో సరిపెట్టుకుంది. స్టేజ్‌-1 ప్రపంచ కప్‌ను భారత్‌ కాంపౌండ్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో కలిపి ఐదు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్యం సహా మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది.

Updated Date - Apr 29 , 2024 | 05:53 AM