Share News

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:41 AM

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత..

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!
List Of All Records Set By SunRisers Hyderabad

ఐపీఎల్-2024లో (IPL 2024) భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరోసారి విజృంభించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని సన్‌రైజర్స్ మడతపెట్టింది. హైదరాబాద్ బ్యాటర్లు.. ముఖ్యంగా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 266 పరుగులను నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో బిగ్గెస్ట్ స్కోరు కాగా.. హైదరాబాద్ 260+ మార్క్‌ని దాటడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్‌హెచ్ జట్టు కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.


హార్దిక్ పాండ్యాకు ఆ సమస్య.. విరుచుకుపడ్డ స్టార్

ఆ రికార్డులు ఏంటంటే..

* ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (Travis Head), అభిషేక్ శర్మ (Abhishek Sharma) మెరుపులు మెరిపించడంతో.. పవర్‌ప్లేలో భాగంగా ఆరు ఓవర్లలో 125 పరుగుల్ని సన్‌రైజర్స్ సాధించింది. ఐపీఎల్‌లో ఇదే అత్యధిక పవర్‌ప్లే టోటల్. 2017లో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 105/0 పరుగులు చేయగా.. ఆ రికార్డ్‌ని ఎస్ఆర్‌హెచ్ బద్దలుకొట్టింది.

* పవర్‌ప్లే ముగిసే సమయానికి.. ట్రావిస్ హెడ్ కేవలం 26 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఒక సన్‌రైజర్స్ ప్లేయర్ పవర్‌ప్లేలో ఇంత భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం ఇదే మొదటిసారి. 2019లో డేవిడ్ వార్నర్ కేకేఆర్‌పై 23 బంతుల్లో 62 పరుగులు చేశాడు. తాజాగా ట్రావిస్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేశాడు.

* ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే అర్థశతకం సాధించి.. ముంబై ఇండియన్స్‌పై అభిషేక్ శర్మ నమోదు చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (16 బంతుల్లో) రికార్డ్‌ని సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే.. ఐపీఎల్ మొత్తంలో అభిషేక్ జైస్వాల్ 13 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు.

* ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ఇది మూడోసారి. డేవిడ్ వార్నర్ ఈ ఫీట్‌ని ఆరుసార్లు అందుకోగా.. క్రిస్ గేల్, సునీల్ నరైన్ మూడుసార్లు అందుకున్నారు. ట్రావిస్ దూకుడు చూస్తుంటే.. డేవిడ్ వార్నర్ రికార్డ్‌ని పటాపంచలు చేసేలాగా కనిపిస్తున్నాడు.

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ధోనీ ఆల్‌టైం రికార్డ్ బద్దలు

* అభిషేక్ శర్మ బాదిన భారీ సిక్స్ కారణంగా.. ఐదు ఓవర్లలోనే సన్‌రైజర్స్ జట్టు 100 పరుగుల మార్క్‌ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఐదు ఓవర్లలోనే 100 పరుగులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఘనతని ఆరు ఓవర్లలో సాధించగా.. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది.

* 10 ఓవర్లు ముగిసే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 158/4. దీంతో.. ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో అతిపెద్ద స్కోరుగా నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఇంతకుముందు ఇదే హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై 148/2 స్కోరు చేసింది. ఇప్పుడు 10 పరుగుల తేడాతో దాన్ని అధిగమించింది.

* 14.5 ఓవర్లలో వారి 200 పరుగుల మార్కును దాటి.. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ని మూడోసారి అందుకున్న జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. 2016లో పంజాబ్‌తో జరిగిన 15 ఓవర్ల మ్యాచ్‌లో.. ఆర్సీబీ 14.1 ఓవర్లలోనే 200 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది.

* టీ20ల్లో సన్‌రైజర్స్ 250 పరుగుల మార్క్‌ని మూడుసార్లు దాటేసింది. ఐపీఎల్‌లో ఓ జట్టు మూడుసార్లు అంత భారీ స్కోరు నమోదు చేయడం ఇదే తొలిసారి. అలాగే.. సన్‌రైజర్స్ చేసిన 266 స్కోరు.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 09:41 AM