Share News

ప్రతిష్ఠాత్మకం ‘పెద్దపల్లి’

ABN , Publish Date - May 05 , 2024 | 03:43 PM

పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకం ‘పెద్దపల్లి’

  • ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల క్లీన్‌స్వీ్‌ప

  • ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుపైనే భారం

  • అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు

  • వామపక్షాల మద్దతుతో గెలుపుపై భరోసా

పెద్దపల్లి, మే5 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్‌స్వీ్‌ప చేసిన కాంగ్రెస్‌ పార్టీకి పెద్దపల్లిలో గెలవడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిక మెజార్టీతో గెలవాలని ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ టికెట్‌ను ఎక్కువ మంది స్థానిక నేతలు ఆశించడం, అలాగే గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని పలువురు వ్యతిరేకించడం వంటివి జరిగినా.. మంత్రి శ్రీధర్‌బాబు అందరినీ సమన్వయ పరిచి ఎమ్మెల్యేలు వివేక్‌, వినోద్‌, ప్రేమ్‌సాగర్‌రావు, లక్ష్మణ్‌కుమార్‌, విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌ తదితరులతో చర్చిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. అలాగే ప్రత్యర్థుల ఎత్తుగడలను పసిగడుతూ పార్టీ శ్రేణులను వ్యూహాత్మకంగా ముందుకు కదిలిస్తున్నారు.

ప్రతికూల అంశాలను అధిగమించి..

ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్‌ ఇచ్చారు. ఈ టికెట్‌ను చాలా మంది స్థానిక నాయకులు ఆశించారు. ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌ నేతకు టికెట్‌ ఇస్తామని పార్టీ పెద్దల నుంచి హామీ లభించడంతో ఆయన రెండు మాసాల క్రితం బీఆర్‌ఎ్‌సను వీడి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తనకు టికెట్‌ రాదని భావించిన టీపీసీసీ కార్యదర్శి గొమాసే శ్రీనివాస్‌ బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకున్నారు. వెంకటేశ్‌ నేతకు టికెట్‌ రాకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమై ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా అన్ని ప్రతికూల అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు అధిగమించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, టికెట్‌ ఆశించిన వారందరితో సంప్రదింపులు జరిపి సమన్వయపరిచి ప్రచారాన్ని ముందుకు నడిపించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని, దేశంలో యూపీఏ ప్రభుత్వాన్ని తీసుకవచ్చి రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలంటూ అందరికీ దిశా నిర్దేశం చేశారు.

పార్టీలో చేరికలపై దృష్టి

మొదటగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యేలా చూశారు. ఆ తర్వాత మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నాటి జోష్‌ను మళ్లీ కార్యకర్తల్లో తీసుకవచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల ఎత్తులను కనిపెడుతూ వారిపై పైచేయి సాధించే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. అలాగే పార్టీలో చేరికలను మరింత పెంచుతున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన నాయకులను కాంగ్రె్‌సలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్మిక సంఘాలతో పాటు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. సింగరేణి కార్మికులతో పాటు ఇతర కార్మికులు, దళితుల ఓట్లు అధికంగా ఉండడంతో వారిని సైతం సమీకరిస్తున్నారు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంల మద్దతును కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు. పదేళ్ల తర్వాత పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నారు.

Updated Date - May 05 , 2024 | 03:43 PM