Share News

ఆత్మవిశ్వాసం అండగా..

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:50 AM

సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే జీవితం. ఇది నాకు చిన్నప్పుడే బోధపడింది. అందుకు కారణం నా వైకల్యం. నాకు ఏడాదిన్నరప్పుడు పోలియో మహమ్మారి సోకిందని వైద్యులు నిర్థారించారు. ఇక అప్పటి నుంచి మా అమ్మానాన్నలకు కంటి మీద కునుకులేదు. అలాగని వారు బాధపడుతూ... నన్ను బాధ పెట్టలేదు.

ఆత్మవిశ్వాసం  అండగా..

పసి వయసులో పోలియో... ఆమె కాలు కదలనివ్వలేదు.

కానీ పట్టుదలతో చదివి... ఆత్మవిశ్వాసంతో నిలబడింది.

నేడు తనలాంటి ఎంతోమందికి దిక్సూచిగా మారి... ఆత్మస్థైర్యం నింపి...

ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, అథ్లెట్‌గా... ఎన్నో హృదయాలను గెలుచుకున్న అమితా పటేల్‌ విజయ గాథ ఇది.

‘‘కష్టాలు అందరికీ వస్తాయి. సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే జీవితం. ఇది నాకు చిన్నప్పుడే బోధపడింది. అందుకు కారణం నా వైకల్యం. నాకు ఏడాదిన్నరప్పుడు పోలియో మహమ్మారి సోకిందని వైద్యులు నిర్థారించారు. ఇక అప్పటి నుంచి మా అమ్మానాన్నలకు కంటి మీద కునుకులేదు. అలాగని వారు బాధపడుతూ... నన్ను బాధ పెట్టలేదు.

వైకల్యాన్ని మరిచిపోయేలా నాకంటూ ఒక మెరుగైన జీవితం ఇవ్వాలనుకున్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను ఎంతో అపురూపంగా పెంచారు.

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ సమీపంలోని జోధ్‌పూర్‌ మా ఊరు. ఊహ తెలిసినప్పటి నుంచీ వైకల్యంతో పోరాడుతున్నాను. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు, అవహేళనలు. అన్నిటినీ తట్టుకొని నిలబడ్డానంటే అందుకు మా అమ్మానాన్నల ప్రేమ, మార్గదర్శనం, ప్రోత్సాహం కారణం.

బడికి వెళ్లలేక...

నా పరిస్థితి ఏంటో నాకు బాల్యంలోనే అర్థమైంది. చక్రాల కుర్చీ లేనిదే అడుగు బయటకు పెట్టలేను. ఈ వైకల్యాన్ని జయించాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి.

నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. వీటన్నిటికీ పునాది విద్య ఒక్కటేనని అమ్మానాన్నలు చెప్పారు. వారి అండతో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నాను. కానీ బడికి వెళ్లడమే గగనమైపోయింది. కష్టపడి వెళ్లినా... తరగతి గదుల్లో కూర్చోవడం, తిరిగి బయటకు రావడం... ఇలా ప్రతిదీ సమస్యగానే మారింది. పాఠశాలల్లో నాలాంటి వికలాంగులకు ఎక్కడికైనా వీల్‌చైర్‌లో వెళ్లగలిగేలా సరైన సౌకర్యాలు ఉండేవి కావు. మరి నా చదువుకు మార్గం ఏమిటి? ఈ ఆలోచన మా ఇంట్లోవాళ్లను కొన్నాళ్లు సందిగ్ధంలో పడేసింది.

అయితే నా ప్రతిభాపాఠవాల మీద వాళ్లకు ఎంతో నమ్మకం. చివరకు స్థానిక గ్రామ పంచాయత్‌ స్కూల్లో చేరాను.


  • విష్యత్తుకు పునాది...

చదువుకోవాలన్న నా దృఢ సంకల్పానికి, నా భవిష్యత్తుకు, నాపై అమ్మానాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆ పాఠశాలలోనే పునాది పడింది. క్రమంగా పదో తరగతి, హెచ్‌ఎ్‌ససీ, బీఏ, ఆ తరువాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను.

నా విద్యాభ్యాసంలో ప్రతి మైలు రాయినీ ఎనలేని అంకితభావంతో అధిగమించాను. అదే సమయంలో నాలాంటివారికి అండగా నిలబడి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నాను. దాంతోపాటు సామాజిక అంశాల మీద కూడా పరిజ్ఞానం పెంచుకున్నాను.

  • ప్రతిచోటా తిరస్కరణలే...

మొదటి నుంచి నా కాళ్లపై నేను నిలబడాలన్న తపన. అందుకే చదువు అవ్వగానే అమ్మానాన్నకు భారం కాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాను.

వృత్తి విద్య, కంప్యూటర్‌ కోర్సులు చాలా నేర్చుకున్నాను. నా వైకల్యం వల్ల కార్పొరేట్‌ కంపెనీల నుంచి తిరస్కరణలే ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే... వ్యవస్థీకృత అడ్డంకులు ఎదురయ్యాయి.

ఇక్కడే నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఉద్యోగ ప్రయత్నాలకు మార్గం మూసుకుపోవడంతో సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నాను.

  • సరికొత్త అధ్యాయం...

ఈ నేపథ్యంలోనే 1992లో నా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికాను. కంప్యూటర్‌ కోర్సులు నేర్పే ఇనిస్టిట్యూట్‌ ఒకటి నెలకొల్పాను. అదికూడా మా ఇంట్లోని ఒక గదిలో. వైకల్యం ఉన్నవారితోపాటు ఏ ఆధారం లేని యువతను సాధికారత దిశగా నడిపించాడానికి అది నేను వేసిన తొలి అడుగు. కేవలం కంప్యూటర్‌ విద్య మాత్రమే కాకుండా... వారిలో ఆత్మవిశ్వాసం నింపి, భవితకు భరోసా కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చాను.

వికలాంగులకు ఉచిత విద్య అందిస్తున్నాను. దాంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాను. ముఖ్యంగా నాలాంటివారికి పెళ్లిళ్లు అవ్వడం చాలా కష్టం. అందుకే... నా దగ్గరకు విద్య అభ్యసించే అలాంటి విద్యార్థుల పెళ్లి బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ‘దివ్యాంగ్‌ రోజ్‌గార్‌ మేళా, దివ్యాంగ్‌ జీవన్‌సాథీ’ లాంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

  • వారి గుండెల్లో నేను...

నా కృషివల్ల ఇన్నేళ్లుగా వేలమంది ప్రయోజనం పొందారు. అనేకమంది బాగా స్థిరపడ్డారు. అన్నిటికీ మించి వారి గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. నాకు... నా విద్యార్థులకు మధ్యనున్నది భావోద్వేగాల బంధం.

ఇంతకు మించిన సంతృప్తి నాకు ఎక్కడ దొరుకుతుంది! సామాజిక కార్యకర్తగానే కాకుండా... నాకంటూ ఒక జీవితం ఉంది. నేను మంచి అథ్లెట్‌ను కూడా. జావెలిన్‌ త్రోలో చాలా పతకాలు సాధించాను. కవిత్వం రాస్తాను. మన సామర్థ్యానికి, వేరొకరికి స్ఫూర్తిగా నిలవడానికి వైకల్యం అనేది అవరోధం కాదని ఈ సమాజానికి నిరూపించడమే నా ఏకైక లక్ష్యం. అందులో కొంతవరకు విజయం సాధించాని గర్వంగా చెప్పగలను.’

Updated Date - Apr 29 , 2024 | 05:50 AM