Share News

నేడు అక్షయ తృతీయ : అక్షయ ఫలదాయకం

ABN , Publish Date - May 10 , 2024 | 12:49 AM

జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలంలో ఉచ్చ స్థితి, నీచ స్థితి ఉంటాయి. గ్రహాలు ఉచ్చ స్థానాల్లో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయడం ఉత్తమం.

నేడు అక్షయ తృతీయ : అక్షయ ఫలదాయకం

జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలంలో ఉచ్చ స్థితి, నీచ స్థితి ఉంటాయి. గ్రహాలు ఉచ్చ స్థానాల్లో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయడం ఉత్తమం. దానివల్ల ఆ గ్రహం తాలూకు అనుగ్రహం లభిస్తుంది. ఏటా ఏప్రిల్‌ 14 నుంచి మే 14 వరకూ... సౌర మానం ప్రకారం మేష మాసంలో... సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో రవి అనుగ్రహాన్ని పొందితే ఆరోగ్యం, అభివృద్ధి, ఉత్సాహం లభిస్తాయి.

రోహిణి నక్షత్రం రోజున చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడి అనుగ్రహం లభిస్తే సర్వకార్యానుకూలత, సంతోషం, మనోల్లాసం కలుగుతాయి. సూర్యుడు, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న రోజైన రోహిణీ నక్షత్రయుతమైన వైశాఖ శుక్ల పక్ష తృతీయ (అక్షయ తృతీయ) విశేషమైనది. సూర్య చంద్రులిద్దరూ ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల... ఈ రోజున చేసే ప్రతి పనీ అక్షయం అవుతుందనేది భారతీయుల విశ్వాసం. ఈ విషయాన్ని ‘నిర్ణయ సింధు’, ‘మత్స్యపురాణం’, ‘మరీచి సంహిత’ తదితర గ్రంథాలు ధ్రువపరుస్తున్నాయి. ఇది సర్వశుభాలనూ కలిగించే పర్వదినమనీ పేర్కొంటున్నాయి. అలాగే ఇది లక్ష్మీ దేవికీ, గౌరీ దేవికీ ప్రీతిపాత్రమైన రోజు.

ఉదకుంభ ప్రదానేన శివలోకే మహీయతే

ఏష ధర్మ ఘతోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మికః

అస్య ప్రదానాత్‌ తృష్యంతు పితరోపి పితామహః

ఈ రోజున అక్షయ స్వరూపుడైన విష్ణువును అర్చించాలనీ, ఉద కుంభదానం విశేష ఫలప్రదమనీ, రాగి లేదా వెండి చెంబులో శుద్ధ జలాన్ని ఉంచి, అర్చించి దానం ఇస్తే... పితృదేవతలు దాన్ని గ్రహించి, తృప్తి చెంది అనుగ్రహిస్తారనీ పూర్వులు చెప్పారు.

ఈ రోజు ఏ కార్యం చేసినా అది అక్షయం అవుతుందనీ, విష్ణువును అక్షతలతో అర్చించి, వాటిని శిరస్సున ధరిస్తే అక్షయఫలం చేకూరుతుందనీ శాస్త్రవచనం. సూర్యుడు పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించినదీ, భగీరథుని తపస్సుకు మెచ్చి దివి నుంచి భువికి గంగ వచ్చినదీ, శ్రీకృష్ణుణ్ణి కుచేలుడు దర్శించి, ఆయన కృపను పొందినదీ, ఆది శంకరులు కనకధారా స్తోత్రాన్ని ఉపదేశించినదీ ఈ రోజునేనని పురాణాలు చెబుతున్నాయి. పరశురామ జయంతి కూడా ఈనాడే కావడం విశేషం. ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే... ఆ ఇల్లు బంగారంతో తులతూగుతుందనే విశ్వాసం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ప్రొఫెసర్‌ వేదాన్తం శ్రీవిష్ణుభట్టాచార్యులు,తిరుపతి

Updated Date - May 10 , 2024 | 01:11 AM