Share News

సహజయోగ : మాతృ వందనం

ABN , Publish Date - May 10 , 2024 | 01:05 AM

సృష్టికి మూలం ఆదిశక్తి. ఆమె తన మాతృప్రేమ శక్తితో ఈ చరాచర ప్రకృతిని సృష్టించింది. అలాగే తనకు ప్రతిబింబంగా స్త్రీలను సృష్టించి... వారిలో ప్రేమైక మాతృత్వ గుణాలను స్థిరపరచింది. ఆ మాతృత్వ గుణాలకు ప్రతిరూపమైన శ్రీమాతాజీ నిర్మలాదేవి జాతి, మత, వర్ణ విభేదాలు లేని వసుధైక కుటుంబ స్థాపన కోసం కృషి చేశారు.

సహజయోగ : మాతృ వందనం

సృష్టికి మూలం ఆదిశక్తి. ఆమె తన మాతృప్రేమ శక్తితో ఈ చరాచర ప్రకృతిని సృష్టించింది. అలాగే తనకు ప్రతిబింబంగా స్త్రీలను సృష్టించి... వారిలో ప్రేమైక మాతృత్వ గుణాలను స్థిరపరచింది. ఆ మాతృత్వ గుణాలకు ప్రతిరూపమైన శ్రీమాతాజీ నిర్మలాదేవి జాతి, మత, వర్ణ విభేదాలు లేని వసుధైక కుటుంబ స్థాపన కోసం కృషి చేశారు. మనిషి తనకు ప్రయోజనంలేని, అనవసరమైన విషయాలకు బానిస కావడం ఆమె మాతృహృదయాన్ని కలచివేసింది. వాటి నుంచి మనిషిని విముక్తి చేయడం ఎలా?’ అని ఆలోచించారు. సహజయోగాన్ని కనుగొన్నారు.

కష్టంలో ఉన్నవారు కనిపిస్తే ఆమె చలించిపోయేవారు. ఒకసారి ఆమె రైలులో ప్రయాణిస్తున్నప్పుడు... భర్తలు వదిలేసిన బీద మహిళలు, అనాథలైన ఆడపిల్లలను స్టేషన్లలో చూసి బాధపడ్డారు. వారి కోసం ఢిల్లీలో ‘నిర్మల ప్రేమాశ్రమం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వారికి చదువు, వృత్తి పని నేర్పించి... కొత్త జీవితాన్ని అందించారు. ఆమె భర్త సర్‌ సి.పి. శ్రీవాత్సవ ఐక్యరాజ్య సమితిలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా వారు ఇంగ్లండ్‌లో నివసిస్తున్నప్పుడు.. రోడ్డుపై బక్కచిక్కిన, సరైన దుస్తులు లేని పిల్లవాడిని ఆమె చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పిల్లవాడిని కారులో తన ఇంటికి తీసుకువచ్చి, స్నానం చేయించి, తన భర్త దుస్తులను వేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీవాత్సవ తన దుస్తుల్లో ఉన్న ఆ కుర్రాణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. జరిగినదంతా నిర్మలాదేవి ఆయనకు చెప్పారు. ముక్కూ మొహం తెలియని పిల్లవాడిని ఎవరి అనుమతీ లేకుండా ఇంటికి తీసుకురావడం ప్రమాదకరమని చెప్పినా... ఆమె మాతృహృదయం ముందు అలాంటి ఆలోచన, భయాలు పని చేయలేదు.

భారత కేంద్ర ప్రభుత్వంలో శ్రీవాత్సవ ఉన్నత పదవిలో ఉన్న రోజుల్లో.... ఒకసారి మతకల్లోలాలు పెచ్చుమీరాయి. ఆశ్రయం కోసం ఒక జంట, ఒక ముస్లిం యువకుడు వచ్చి... తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనీ, ఒక్క రోజు తలదాచుకోవడానికి అనుమతించాలనీ ప్రాధేయపడ్డారు. నిర్మలాదేవి సరేనన్నారు. కాసేపటికి వచ్చిన శ్రీవాత్సవ బయటి పరిస్థితుల గురించి ఆమెకు చెబుతూ... వారికి ఆశ్రయం ఇవ్వడం సరికాదనీ, సురక్షితమైన మరో చోటుకు పంపిద్దామనీ అన్నారు. నిర్మలాదేవి ఆయనకు నచ్చజెప్పారు.

మరుసటిరోజు స్థానిక యువకులు పెద్ద పెద్ద కర్రలతో, మారణాయుధాలతో వారి ఇంట్లోకి దూసుకువచ్చి... ‘‘మీరు దేశ ద్రోహులకు... అందులోనూ ముస్లింలకు ఆశ్రయం ఇచ్చారు. వారిని మాకు మర్యాదగా అప్పగించండి’’ అని గొడవ చేశారు. అప్పుడు ఆమె ‘‘నేను స్వచ్ఛమైన హిందువును, భారతీయురాలిని.


శత్రువులకు ఆశ్రయం ఎలా ఇస్తాననుకున్నారు?’’ అని చెప్పి, వారిని పంపేశారు. తన ఇంటికి వచ్చినవారు ప్రసిద్ధ సినీనటి అచల సత్యదేవ్‌ దంపతులనీ, ఆ ముస్లిం యువకుడు ఇప్పటి ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ అనీ తరువాత తెలిసింది. ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో.

‘‘మనలో మాతృమూర్తి తత్త్వమైన భూమాతే... మనలో నివశిస్తున్న కుండలినీ శక్తి. అది జన్మజన్మల నుంచి మనకు తల్లిగా ఉంటూ, మనకు అంతర్గతమైన, ఆధ్యాత్మికమైన పోషణను ఇస్తోంది. మన బాగోగులను చూసుకుంటోంది. మనం భూమాతను తల్లిగా కొలుచుకుంటాం. దేశాన్ని ‘భారతమాత’ అని తల్లిగానే గౌరవించుకుంటాం. తల్లికి ఉన్న స్థానం అది.

పిల్లలను చక్కని నడవడిక కలిగిన వారిగా తీర్చి దిద్దడంలో తల్లుల పెంపకమే కీలకం. పెద్దలను, గురువులను, సమాజాన్ని గౌరవించడం వారికి నేర్పాలి. ‘మానవాళి అంతా ఒక కుటుంబం’ అని బోధించాలి. ఈ శక్తి తల్లికే ఉంది. పిల్లలు లంచగొండులు, అవనీతిపరులు, హింసాకారకులు అయితే... దానికి బాధ్యత తల్లులదే. పిల్లలను సన్మార్గంలో పెట్టడం అనే బాధ్యత తల్లులు సక్రమంగా నెరవేర్చకపోతే... ఆ ప్రభావం మొత్తం సమాజం మీద పడుతుంది’’ అని వివిధ సందర్భాల్లో ఆమె చెప్పారు.

కుమార్తెగా, విద్యార్థి నాయకురాలుగా, స్వాతంత్య్ర ఉద్యమకారిణిగా, ఆదర్శ పత్నిగా, గృహిణిగా, తల్లిగా, అమ్మమ్మగా... తన బాధ్యతలన్నిటినీ సమగ్రంగా నిర్వహించిన నిర్మలాదేవి... ఆధ్యాత్మిక గురువుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1970 మే 5న... సహజయోగాన్ని ఆవిష్కరించారు. ప్రపంచమంతటా దాన్ని వ్యాప్తి చేశారు. ధ్యాన సాధన ద్వారా లక్షలాదిమంది సమస్యలకు సునాయాసమైన పరిష్కారాన్ని చూపించారు. శిష్యులనుంచి శ్రీమాతాజీగా వందనాలు అందుకుంటున్నారు.

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - May 10 , 2024 | 01:26 AM