Share News

విశేషం : సంకీర్తనాచార్య కృష్ణమయ్య

ABN , Publish Date - May 10 , 2024 | 12:20 AM

భగవంతుడి గుణాలను ప్రస్తుతించడానికీ, దైవ లీలలను సామాన్యులకు తెలియజేసి... వారిలో భక్తి కలిగించి, తద్వారా ముక్తి మార్గాన్ని చూపడానికి... ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు జన్మిస్తారు.

విశేషం  :  సంకీర్తనాచార్య  కృష్ణమయ్య

గవంతుడి గుణాలను ప్రస్తుతించడానికీ, దైవ లీలలను సామాన్యులకు తెలియజేసి... వారిలో భక్తి కలిగించి, తద్వారా ముక్తి మార్గాన్ని చూపడానికి... ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు జన్మిస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తించడానికి తాళ్ళపాక అన్నమయ్య జన్మిస్తే... అంతకుముందు కాలంలో... సింహాచల శ్రీవరాహ లక్ష్మీ నరసింహుణ్ణి కీర్తించడానికి పుట్టినవాడు... సింహాచలం కృష్ణమయ్యగా ప్రసిద్ధి చెందిన శ్రీకాంత కృష్ణమాచార్యులు. నేడు సింహాచలంలో చందనోత్సవం జరుగుతున్నవేళ... సింహాద్రి అప్పన్నను తన రచనలతో అర్చించిన కృష్ణమయ్యను స్మరించుకోవడం సముచితం.

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలానికి చెందిన కృష్ణమయ్య గురించిన ప్రస్తావన ‘ప్రతాపరుద్ర చరిత్ర’, ‘సిద్దేశ్వర చరిత్ర’ గ్రంథాల్లో కనిపిస్తుంది. కృష్ణమయ్య సుమారు ఏడువందల ఏళ్ళ క్రితం... ఆరు భాద్రపద బహుళ చతుర్దశి రోజున గోవిందాచార్యులు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు.

తను పుట్టుకతోనే అంధుడిననీ, ఆ కారణంగా తన అమ్మమ్మ తనను బావిలో పడేస్తే... ఒక సాధువు చేరదీసి కాపాడాడనీ, సింహాచల శ్రీ నృసింహస్వామి కరుణతో... పదకొండేళ్ళ వయసులో తనకు చూపు వచ్చిందనీ ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. అప్పటినుంచీ... అంటే పదకొండేళ్ళకే నృసింహ సంకీర్తనా సేవకు శ్రీకారం చుట్టాడు.

అందుకు వచనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. వచన భక్తి వాఙ్మయంలో ఆయనే ప్రథమాచార్యుడు. కృష్ణమయ్య పాడుతూ ఉంటే... ఆ నృసింహుడే బాలునిగా వచ్చి నృత్యం చేసేవాడంటారు. ‘దేవా’ అని ప్రారంభమై. .. ‘సింహగిరి నరహరి దయానిధే’ అంటూ ముగిసే ఆయన రచనలు ఆ కాలంలో ప్రజల నాలుకల మీద నాట్యమాడాయి.

కృష్ణమయ్య సాహిత్యం గురించి, భక్తి గురించి తెలుసుకున్న ప్రతాపరుద్రుడు... ఆయనను ఓరుగల్లుకు ఆహ్వానించి సత్కరించాడు. ఒకసారి గ్రహణ సమయంలో... కృష్ణమయ్యతో సహా కొందరు పరివారంతో ప్రతాపరుద్రుడు గౌతమీ నదిలో స్నానం చేస్తూండగా... స్వర్ణ, వజ్రాభరణాలు దొరికాయి. వాటితో పాటు మరికొన్ని ఆభరణాలను కృష్ణమయ్యకు ఇచ్చి... వాటిని సింహాచలేశునికి అలంకరించమన్నాడు.


ఆ ఆభరణాలను తన ఇంటికి తీసుకువెళ్ళి, వాటిని తన నిత్యాగ్రిహోత్ర హోమగుండంలో వేసి... ‘‘ఇవి సింహాద్రి అప్పన్నకు’’ అన్నాడు కృష్ణమయ్య. ఈ విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు... నగలు ఏవని కృష్ణమయ్యను అడిగాడు. రాజును వెంటబెట్టుకొని సింహగిరిపైకి వెళ్ళాడు కృష్ణమయ్య.

తాను ఇచ్చిన ఆభరణాలు స్వామికి అలంకరించి ఉండడం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణమయ్య భక్తికి దాసుడయ్యాడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న కాలంలో... నారసింహుణ్ణి కీర్తిస్తూ కృష్ణమయ్య గానం చేస్తే... కనకవర్షం కురిసిందట. ఈ వివరాలన్నీ ‘సిద్దేశ్వర చరిత్ర’లో ఉన్నాయి.

తాను పాడితే నారసింహుడు ఆడతాడనీ, తనంత భక్తుడు ఎవరూ లేరనీ గర్వపడిన కృష్ణమయ్య జీవితంలో ఒక అపూర్వమైన ఘట్టం జరిగింది. భగవద్రామానుజాచార్యులు శిష్య సమేతంగా దేశసంచారం చేస్తూ సింహాచలం వచ్చారు.

స్వామిని సేవించుకున్నారు. అక్కడ కృష్ణమయ్య గురించి విన్న రామానుజులు ఆయనను కలిసి... ‘‘మీరు ప్రతిరోజూ అప్పన్నను దర్శిస్తున్న మహానుభావులు. నాకు మోక్షం ఉందో, లేదో స్వామిని అడుగుతారా?’’ అని కోరారు. ‘‘సరే’’నంటూ స్వామిని కృష్ణమయ్య అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఈ సంగతి రామానుజులకు కృష్ణమయ్య చెప్పాడు. అప్పుడు ‘‘రామానుజులు మీకు మోక్షం ఉందో లేదో కనుక్కోండి’’ అన్నారు. దానితో ఉగ్రుడైన కృష్ణమయ్య ‘‘రోజూ కనిపించే స్వామి నాకే మోక్షం ఇవ్వడా?’’ అంటూ నరసింహ స్వామి దగ్గరకు వెళ్ళి అడిగాడు. ‘‘నీకు మోక్షార్హత లేదు. నీ పాటకు, నేను చేసిన నృత్యంతో సరిపోయింది. నీతో ఈ ప్రశ్న అడిగించిన రామానుజులకే కలియుగంలో మోక్షం ఇచ్చే అర్హత ఉంది’’ అని బదులిచ్చాడు.

ఆగ్రహించిన కృష్ణమయ్య తాను నిత్యం కొలిచే స్వామినే దుర్భాషలాడాడు. అప్పన్న కోపిస్తూ ‘‘ఏ సాహిత్యాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో... అది నశించిపోతుంది’’ అని శపించాడు. కృష్ణమయ్య తప్పు తెలుసుకొని, రామానుజులను శరణు కోరి, ఆయనకు శిష్యుడయ్యాడు.


కృష్ణమయ్య రచన, భక్తి, సంగీతం, నాట్యాలు కలబోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచనలు కొన్ని ప్యారిస్‌లోని లిండ్స్‌ లైబ్రరీకి తరలించినట్టు ఆధారాలున్నాయి. అలాగే తంజావూరు సరస్వతీ మహల్‌ పుస్తక భాండాగారంలో కృష్ణమయ్య రచనలు రెండువందల వరకూ లభ్యమయ్యాయి. వైష్ణవ సంప్రదాయాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి, భగవద్రామానుజులు ప్రతిపాదించిన విష్ణుభక్తి, భాగవత కైంకర్యం, ఆచార్య సేవానిరతి తదితర వైష్ణవ మత సూత్రాలను ఆయన తన రచనల్లో పొందుపరిచారు. ఆయన సాహిత్యం తదనంతర కాలంలోని వారికి మార్గదర్శకంగా ఉపయోగపడింది. ‘‘సింహగిరి నరహరీ! మీ దివ్యనామము ఇదియే నాకు జపము, దయానిధీ!’’ అంటూ సింహాచలాధీశుణ్ణి మనసారా కీర్తించి, తొలి తెలుగు వాగ్గేయకారునిగా కీర్తిపొందిన మహనీయుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు.

పురాణేతిహాసాలు సంస్కృతంలో ఉండడం వల్ల అవి సామాన్య జనానికి దూరమయ్యాయని భావించిన కృష్ణమయ్య... వాటిని అందరికీ అందుబాటులో ఉండాలనుకున్నాడు. వేదాలను, ఉపనిషత్‌ సారాన్నీ తేలికైన తెలుగు వచనంలో రాశాడు. సంగీత, నాట్యాల సమ్మేళనంతో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. ఆయన రాసిన ‘సింహగిరి వచనాల’ను ఈనాటికీ సింహాచలం ఆలయంలో పఠిస్తారు.

(నేడు సింహాచలేశుని చందనోత్సవం)

అద్దంకి శ్రీరామ కుమార్‌, 9440567625

Updated Date - May 10 , 2024 | 01:15 AM