Share News

నెహ్రూ కన్నా మా నాన్నకే ఓట్లు ఎక్కువ

ABN , Publish Date - May 08 , 2024 | 05:48 AM

మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు (1952)లో నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు రావి నారాయణ రెడ్డికి మాత్రమే వచ్చాయని అనుకుంటారంతా. కానీ నల్లగొండ పార్లమెంటు ద్విసభ్య స్థానం నుంచి పోటి...

నెహ్రూ కన్నా మా నాన్నకే ఓట్లు ఎక్కువ

మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు (1952)లో నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు రావి నారాయణ రెడ్డికి మాత్రమే వచ్చాయని అనుకుంటారంతా. కానీ నల్లగొండ పార్లమెంటు ద్విసభ్య స్థానం నుంచి పోటి చేసిన మరొకరికి కూడా తొలి ప్రధానికన్నా మిన్నగా ఓట్లు పోలైన విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. 27 ఏళ్లకే మొదటి పార్లమెంటులో అడుగుపెట్టి, సభలో పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కిన ఆ నాయకుడు సుంకం అచ్చాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తనదైన పాత్ర పోషించారు. జీవితాంతం సామ్యవాద సిద్ధాంతానికి నిబద్ధుడైన అచ్చాలు జీవిత విశేషాలను.... ఆయన కుమార్తె సుంకం ఆలోచన ‘నవ్య’తో చెబుతున్నారిలా...

మా నాన్న సుంకం అచ్చాలు నల్లగొండకు మొదటి లోక్‌సభ సభ్యుడిగా ప్రజా సేవ చేశారు. ఇప్పటి రాజకీయనాయకుల్లా కాకుండా, చివరి శ్వాస వరకు అత్యంత నిజాయితీగా బతికారు. ఆస్తిపాస్తులకన్నా విలువైన ప్రజాభిమానాన్ని సంపాదించారు. బతికినన్నాళ్లు నిఖార్సయిన కమ్యూనిస్టుగా జీవించారు. సుంకం అచ్చాలు అంటే రావి నారాయణరెడ్డి గారి మొదలు గుడిసెల్లోని జనం వరకు... అందరూ అభిమానించేవారు. బొమ్మగాని ధర్మభిక్షంగారైతే మా నాన్న లేకుండా నల్లగొండలో ఒక్క సభ కూడా నిర్వహించేవారు కాదు. దొడ్డా నర్సయ్య, ఉప్పల్‌ మల్సూర్‌ లాంటి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఎన్నో సాయంత్రాలు మా ఇంటి ముంగిట నులక మంచం మీద కూర్చొని ప్రజా సమస్యలమీద చర్చించుకోవడం నాకు బాగా గుర్తు. పెద్దగా చదువుకోకున్నా, మా నాన్నకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలు వచ్చు. కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. కౌలుదారుల పక్షాన కొట్లాడి, చాలామందికి ఇనాం భూములతో పాటు నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించారు. నల్లగొండలోని రిక్షా కార్మికుల సహకార సంఘం కార్యదర్శిగా వారికి బ్యాంకు నుంచి రుణాలిప్పించడం లాంటి పనులు చాలానే చేశారు. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది మా నాన్నను ఇప్పటికి యాది చేసుకొంటారు.


మా ఇల్లు ఓ రహస్య స్థావరం

మా పూర్వీకులది కర్నూలు జిల్లా. మా తాతయ్య కాశయ్య బతుకుతెరువు కోసం కర్నూలు నుంచి కాలినడకన నల్లగొండకు వచ్చాడు. చెప్పులు కుట్టే వృత్తిని వదిలేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. నల్లగొండ జైలుఖానాలో తోటమాలిగానూ పని చేసేవాడు. ఆయన రెక్కల కష్టంతో మాన్యం చెలకలో కొంత భూమి కొన్నాడు. బొట్టుగూడాలో పెద్ద ఇల్లు కట్టాడు. అది ఎంతోమందికి ఆశ్రయమిచ్చింది. అన్నపూర్ణలా ఎంతోమంది ఆకలి తీర్చింది. మాకేమైనా ఆస్తి ఉందంటే, అది మా తాత సంపాదించి ఇచ్చిందే. ఒకవైపు మా తాత కష్టపడుతూ ఉంటే, మరోవైపు మా నాన్న కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలలో తీరికలేకుండా ఉండేవారు. ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో కార్యకర్తగా చాలా చురుగ్గా పాల్గొన్నారని విన్నాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో మా ఇల్లు ఒక పెద్ద రహస్య స్థావరం. కొద్దిమంది నాయకులు మా ఇంట్లో అజ్ఞాత జీవితాన్ని గడిపారు. ఒకరోజు పోరాట దళాలకు సమాచారం చేర్చడం కోసం కొరియర్‌గా కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు మా ఇంటికొచ్చారట. ఈ విషయాన్ని ఆయనే ఒకసారి గుర్తు చేసుకొన్నారు. అలా మాకు తెలియడమే కానీ, మా నాన్న ఎన్నడూ తన గురించి ఏమీ చెప్పలేదు. మా నాన్న అని గొప్పగా చెప్పడం కాదు కానీ, ‘సుంకం అచ్చాలు అంటే మితభాషి, సౌమ్యుడు, స్నేహశీలి’ అని సురవరం సుధాకర్‌రెడ్డి గారిలాంటి నాయకులు గొప్పగా చెప్పగా విన్నాం.


మా నాన్న మంచి దర్జీ కూడా

మేము మొత్తం ఏడుగురు సంతానం. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లం. నేను రెండో బిడ్డను. ప్రతి మనిషి జీవితానికి ఆ వ్యక్తి ఆలోచనే ఆధారమని మా నాన్న నమ్మకం. అందుకే నాకు ‘ఆలోచన’ పేరు పెట్టారు. విశాలాంధ్ర ఉద్యమం సమయంలో పుట్టిందని మా చెల్లెలికి ‘విశాలాంధ్ర’ అని నామకరణం చేశారు. మా నాన్నకు మొదట ‘షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌’ పార్టీతో అనుబంధం ఉన్నదని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ గారు రాసిన వ్యాసం చదివాకే మాకు తెలిసింది. అయితే, తను ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో అంబేడ్కర్‌ గారిని కలిశానని నాన్నే ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు. ఆ మహనీయుడి మీద అభిమానంతో మా చిన్న తమ్ముడికి ‘అంబేడ్కర్‌’ అని పెట్టారు. ప్రతి పండుగకు పిల్లలందరికీ నాన్నే దుస్తులు కుట్టేవారు. దర్జీ పని బాగా వచ్చు. ఎంపీ పదవి ముగిసిన తర్వాత చాలాకాలం మా నాన్న దుస్తులు కుట్టారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా, జీవితాంతం భారత కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడిగానే కొనసాగారు. మొట్టమొదటి ఎన్నికలప్పుడు నల్లగొండలో పార్టీ జిల్లా కార్యాలయం కోసం వకీలు అబ్దుల్‌ లతీఫ్‌ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. కొద్ది రోజుల తర్వాత స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఇబ్బంది పెట్టడంతో, మా ఇల్లే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం అయింది. నల్లగొండకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఎవరు వచ్చినా నేరుగా మా ఇంటి దగ్గరే దిగేవారు. ఎంతమంది వచ్చినా మా అమ్మ లింగమ్మ విసుగు, అలసట లేకుండా వండి వడ్డించేది. సమావేశాలు లాంటివేమైనా ఉన్న రోజున వంద ఇస్తర్లు కూడా లేచిన సందర్భాలున్నాయి. పైగా ఇంటికి ఎవరొచ్చినా అన్నం తినకుండా వెళ్ళనిచ్చేవారు కాదు మా అమ్మానాన్న. డబ్బు చుట్టూ మనుషులు తిరగని రోజులవి.


కూతురిగా గర్వపడుతున్నా...

చిన్నప్పుడు చదువుకోడానికి నాన్న బడికెళితే... ఉపాధ్యాయులు చదువు చెప్పలేదట. విద్య విలువ తెలిసిన వ్యక్తి కదా! ఏదైనా గ్రామం నుంచి వచ్చి ఎవరైనా... ‘‘అచ్చాలు! మా ఊరికి ప్రభుత్వ పాఠశాల కావాలి’’ అనడిగితే, మా నాన్న కలెక్టరు వెంటపడిమరీ పాఠశాల ప్రారంభమయ్యేదాకా వదిలేవారు కాదు. మా నాన్న లోక్‌సభ సభ్యుడిగా పనిచేసింది ఐదేళ్లే అయినా, జీవితాంతం స్థానికులకు అందుబాటులో ఉంటూ వారికి తలలో నాలుకలా మెలిగారు. వ్యవహార జ్ఞానం కలిగిన వ్యక్తి కనుక కుటుంబ తగువులు కూడా సులువుగా పరిష్కరించేవారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళాలతో సమానంగా పని చేసిన మా నాన్నను స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం గుర్తించలేదు. అందుకు చివరి రోజుల్లో నాన్న చాలా బాధపడ్డారు. స్వచ్ఛమైన రాజకీయాలకు తీపి జ్ఞాపకం మా నాన్న సుంకం అచ్చాలు. ఒక్క రూపాయి పంచకుండా, జనాన్ని ప్రలోభపెట్టకుండా లోక్‌సభకు వెళ్లారు. నందికొండ ప్రాజెక్ట్‌, నడికుడి రైల్వే మార్గం కోసం పార్లమెంటులో గొంతెత్తారు. నిత్యం ప్రజా సమస్యల మీద కొట్లాడారు. ప్రజల మనిషిగా బతికారు. అనారోగ్యంతో నలభై ఏళ్ళ కిందట కన్ను మూసినా... నిజమైన నాయకుడిగా చరిత్రలో మా నాన్న పేరు శాశ్వతం.

సాంత్వన్‌

ఫొటో: లవకుమార్‌


దిగువసభలో చిన్నవాడు

మొట్టమొదటి ఎన్నికలు 1952లో నల్లగొండ పార్లమెంటు ద్విసభ్య స్థానం(ఎస్సీ, జనరల్‌) పోటీలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) అభ్యర్థులు మా నాన్న సుంకం అచ్చాలు, రావి నారాయణరెడ్డి.... కాంగ్రెస్‌ నాయకులు పి.మహేంద్రనాథ్‌, వి.భాస్కరరావు మీద మంచి మెజారిటీతో గెలిచారు. అప్పుడు రావి నారాయణరెడ్డి గారికి 3,09,162 వస్తే, మా నాన్నకు 2,82,117 ఓట్లు పోలయ్యాయి. యూపీలోని పుల్పూర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూకు 2,33,571 ఓట్లు వచ్చాయి. అలా ఆ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థులుగా రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు చరిత్ర సృష్టించారు. అందుకుగాను ఇద్దరినీ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సన్మానించారు. 27 ఏళ్ళ వయసులో మొదటి లోక్‌సభకు ఎన్నికైన మా నాన్న దిగువసభలోని మిగతా సభ్యుల్లోకెల్లా చిన్నవాడట. అందుకు ఆనాటి పార్లమెంటులోని పెద్దలంతా నాన్నను ప్రత్యేకంగా అభినందించారని విన్నాను. అచ్చంపేట శాసనసభ స్థానం నుంచి 1962 ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా నాన్న పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనకు అస్సలు పరిచయం లేని అచ్చంపేట నుంచి పోటీకి నిలబెట్టడమే అందుకు ప్రధాన కారణం. అయినా, నాన్న ఎన్నడూ కుంగిపోలేదు. విజయాన్ని, ఓటమిని సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత మా నాన్న సొంతం.


పార్లమెంటు సమావేశాలకు మా నాన్న సుంకం అచ్చాలు... వరంగల్‌ లోక్‌సభ సభ్యుడు పెండ్యాల రాఘవరావు గారు కలిసి వెళ్లేవారు. వీరిద్దరికీ కలిపి ఢిల్లీలో ఒకే క్వార్టర్‌ ఇచ్చారట. మొదటి లోక్‌సభ సభ్యుల గ్రూప్‌ ఫొటోలోనూ ఇద్దరూ పక్కపక్కనే కనిపిస్తారు. ఒకరికొకరు చాలా స్నేహంగా మెలిగేవారు. సాటి మనిషి ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకునే రకం కాదు మా నాన్న. అచ్చంపేట నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న సమయంలో ఒకరోజు ప్రచారానికి బాడుగ కారులో వెళుతుండగా దారిలో ప్రత్యర్థి పార్టీ కార్యకర్త ఒళ్ళంతా దెబ్బలతో కనిపించాడట. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అతన్ని కారులో ఎక్కించుకొని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి దగ్గరుండి మరీ చికిత్స చేయించారట. దీన్ని ప్రత్యక్షంగా చూసిన కందిమళ్ళ ప్రతాపరెడ్డిగారు ఈ సంగతి చెప్పారు.

కుటుంబ సభ్యులతో అచ్చాలు

Updated Date - May 08 , 2024 | 05:48 AM