Share News

NAVYA : జ్ఞానానందమయం... శ్రీశంకర వాఙ్మయం

ABN , Publish Date - May 10 , 2024 | 12:32 AM

ఆది కవి వాల్మీకి శ్రీమద్రామాయణం ద్వారా ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో లోకానికి మార్గదర్శనం చేశాడు. వ్యాసమునీంద్రుడు మహాభారతం, ప్రస్థానత్రయం, పురాణాల ద్వారా భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాడు.

NAVYA : జ్ఞానానందమయం...  శ్రీశంకర వాఙ్మయం

విశేషం

ది కవి వాల్మీకి శ్రీమద్రామాయణం ద్వారా ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో లోకానికి మార్గదర్శనం చేశాడు. వ్యాసమునీంద్రుడు మహాభారతం, ప్రస్థానత్రయం, పురాణాల ద్వారా భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాడు. అలాగే... శాఖోపశాఖలుగా చీలిపోయి, అస్తవ్యస్తంగా ఉన్న హిందూ మతాన్ని, వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి, ఒకే తాటి మీదకు తెచ్చి పునరుజ్జీవింప జేసినవారు ఆది శంకరులు.

ఎనిమిదేళ్ళ వయసులో ఆపత్సన్యాసాన్ని స్వీకరించి, తల్లి అనుజ్ఞతో ఆదిశంకరులు దేశ సంచారాన్ని ప్రారంభించారు. నర్మదా నదీతీరంలో... గోవింద భగవత్పాదాచార్యుల దగ్గర క్రమ సన్యాసాన్ని పొంది, శ్రీశంకర భగవత్పాదాచార్యులుగా యోగ పట్టాన్ని స్వీకరించారు. శ్రీశంకరుల ఎనిమిదేళ్ళ ఆయుష్షును గురువు పదహారేళ్ళకు పెంచారు.

గురువు ఆదేశం మేరకు శ్రీశంకరులు కాశీ క్షేత్రం చేరుకున్నారు. ఈశ్వర సాక్షాత్కారంతో బ్రహ్మ జ్ఞానం పొందారు. అనంతరం వ్యాసుల దర్శనం అయింది. శంకరుల జ్ఞాన సంపదకు మెచ్చిన వ్యాస మహర్షి... తాను రచించిన ప్రస్థాన త్రయానికి భాష్యాన్ని రాయాలనీ, దేశం నలుమూలలా పర్యటించి, వైదిక ధర్మానికి ప్రాచుర్యం కల్పించాలనీ ఆదేశించారు. అందుకు వీలుగా... శ్రీశంకరుల ఆయుర్దాయాన్ని పదహారేళ్ళ నుంచి రెట్టింపు చేస్తూ ఆశీర్వదించారు.

వ్యాసుడి ఆదేశాన్ని పాటిస్తూ... శ్రీ శంకరులు ప్రస్థానత్రయ భాష్యంతో పాటు, అద్వైత సిద్ధాంత ప్రాచుర్యానికి వీలుగా అనేక ప్రకరణ గ్రంథాలను రచించారు. దేశ పర్యటనలో తాను దర్శించిన అనేక దేవాలయాల్లో యంత్రాలను స్థాపించారు. ఆయా దేవీ దేవతల మీద స్తోత్రాలను రాశారు. అవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి.


‘అద్వైతానుభూతి’, ‘ఆత్మబోధ’, ‘ప్రబోధ సుధాకరం’, ‘అపరోక్షానుభూతి’, ‘సర్వవేదాంత సార సంగ్రహం’, ‘వివేక చూడామణి’, ‘వేదాంత డిండిమ’ తదితరాలు ప్రకరణ గ్రంథాలు. అనేక స్తోత్ర రత్నాలు, ‘విష్ణు సహస్రనామ భాష్యం’, ‘లలితా త్రిశతీ భాష్యం’ ఆదిగా ఎన్నో భాష్య రచనలూ చేసి అపార వైదిక వాఙ్మయాన్ని ఆయన అందించారు.

ఆది శంకరుల ‘లహరులు’ అత్యంత ప్రత్యేకమైనవి. ‘సౌందర్య లహరి’లో శ్రీవిద్యా మహిమను, ఉపాసనా విధులను, మంత్రోద్ధార రహస్యాలను, షట్చక్రాల సంబంధాన్ని, దార్శనిక విచారాలనూ పొందుపరిచారు. శక్తి చెంతలేనిదే శివుడు అశక్తుడంటూ ‘శివా శక్త్యో యుక్తో యది భవతి శక్తః ప్రభవితుః’ అని ‘సౌందర్యలహరి’ని ప్రారంభించారు. జగదంబను అందులో వర్ణించిన తీరు ఆయనకే సాధ్యమంటారు పండితులు. ‘జ్ఞానానంద సుధా మరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః... శివా! నీ ధ్యానంతో నా మనస్సు వసంతకాలంలా జ్ఞానమనే ఫలాలను, జ్ఞానానందం అనే తేనెను అందిస్తున్నాయి’ అంటారు ‘శివానందలహరి’లో శ్రీ శంకరులు. ఆ మాటలు ఆయన రచనలకూ వర్తిస్తాయి. ఆయన వాఙ్మయం ఆద్యంతం జ్ఞానానందమయం.

(12న శ్రీశంకర జయంతి

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - May 10 , 2024 | 12:32 AM