Share News

పంతం కోసం ఎందాకైనా...

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:05 AM

వివాదాలు చుట్టుముట్టినా, వైఫల్యాలు ఎదురైనా... ‘తగ్గేదిలే’ అనే స్వభావం మీసా భారతి సొంతం. తెరవెనుక రాజకీయ వ్యవహారాల్లో చాతుర్యం, ముక్కు మీద కోపం... ఇవీ ఆమె గురించి వినిపించే విశేషణాలు

పంతం కోసం ఎందాకైనా...

వివాదాలు చుట్టుముట్టినా, వైఫల్యాలు ఎదురైనా... ‘తగ్గేదిలే’ అనే స్వభావం మీసా భారతి సొంతం. తెరవెనుక రాజకీయ వ్యవహారాల్లో చాతుర్యం, ముక్కు మీద కోపం... ఇవీ ఆమె గురించి వినిపించే విశేషణాలు. పాటలీపుత్ర నుంచి మూడోసారి పోటీకి దిగిన లాలూగారి పెద్దమ్మాయి... ప్రధాని మోదీని జైల్లో పెట్టిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు బిహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాయి.

‘‘రామ్‌ కృపాల్‌ యాదవ్‌ అంటే మాకు ఎంతో గౌరవం ఉండేది. కానీ మమ్మల్ని మోసం చేసి బిజెపిలో చేరారు. ఆ సంగతి తెలియగానే... గడ్డిని ముక్కలు చేసే యంత్రంతో అతని చేతులు నరికెయ్యాలనుకున్నాను.

నాకు ఎదురుపడితే అదే చేసేదాన్ని...’’ 2014 లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో మీసా భారతి ఆగ్రహంతో అన్న మాటలివి. ఆమె తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రామ్‌ కృపాల్‌ కుడి భుజం. లాలూ పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) తరఫున పట్నా నుంచి ఎంపీగా కూడా గెలిచారు.

కానీ 2009లో పట్నా నుంచి లాలూ స్వయంగా పోటీ చేయడంతో... రామ్‌ కృపాల్‌కు అవకాశం దక్కలేదు. 2014లో తనకు పాటలీపుత్ర పార్లమెంట్‌ సీటు ఇవ్వాలని లాలూను ఆయన కోరారు.

కానీ అప్పటికే ఆ స్థానం మీద లాలూ తొలి సంతానమైన మీసా భారతి కన్నుపడింది. ఎందుకంటే... ఆమె భర్త శైలేష్‌ సొంత ఊరు దామాపూర్‌. అది పాటలీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉంది.

చివరకు ఆమెనే అభ్యర్థిగా లాలూ ప్రకటించారు. దాంతో ఆర్‌జెడికి రామ్‌ కృపాల్‌ రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. మీసాను ఓడించారు. కేంద్ర మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ రామ్‌ కృపాల్‌ చేతిలో మీసా ఓటమి పాలయ్యారు. ఈ పరాజయాలను మీసా చాలా వ్యక్తిగతంగా తీసుకున్నారని చెబుతారు ఆమె సన్నిహితులు. పార్టీకి కంచుకోటల్లాంటి వేరే స్థానాలేవైనా ఎంచుకొనే వెసులుబాటు ఆమెకు ఉంది.

అదీగాక... రెండు విడతలుగా రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఆమె కొనసాగుతున్నారు. ఎంపీగా ఆమె హోదాకు ఎలాంటి ఢోకా లేదు. అయితే ‘‘ఎప్పటికైనా రామ్‌ కృపాల్‌ను ఓడించి తీరుతాను’’ అని మీసా పంతం పట్టారు. అందుకే ఈసారి కూడా పాటలీపుత్ర నుంచి... రామ్‌ కృపాల్‌కు ప్రత్యర్థిగా ఆమె బరిలోకి దిగారు.

ఇటీవలే ఆ పార్లమెంటరీ స్థానానికి పోలింగ్‌ ముగిసింది. ఈ విడత ప్రచారంలో మీసా తన వ్యాఖ్యలకు మరింత పదునుపెట్టారు. ప్రధానమంత్రి మోదీపై విపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తూ ఉండొచ్చు.

కానీ ‘‘మా కూటమి అధికారంలోకి వస్తే మోదీతో సహా బీజేపీ నాయకులందర్నీ జైల్లో పెట్టిస్తాం’’ అనే ధైర్యం చేసింది బహుశా మీసాయే కావచ్చు. ఆమె వ్యాఖ్యలపై బిజెపి వర్గాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. దాంతో తన మాటలకు ఆమె వివరణ ఇస్తూ ‘‘ఎలకో్ట్రరల్‌ బాండ్స్‌ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీదే నేను మాట్లాడాను. మా ప్రభుత్వం వస్తే వాటి మీద విచారణ జరిపించి, దోషులకు శిక్ష వేయిస్తామన్నాను. నా మాటలు వక్రీకరించారు’’ అంటూ సమర్థించుకున్నారు.


హార్వర్డ్‌ వివాదం...

మాటలతో, చేతలతో వివాదాల్ని కొనితెచ్చుకోవడం మీసాకు కొత్తేం కాదు. 2015 మార్చిలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్‌ కాన్ఫరెన్స్‌లో తాను ప్రసంగించానని సూచించే కొన్ని ఫొటోలను ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో మీసా భారతి పెట్టారు.

వాటిని బిహార్‌(Bihar)లోని వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దీని గురించి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం వర్గాలను జాతీయ మీడియా వాకబు చేసినప్పుడు... ‘‘మీసా భారతి ఇండియా కాన్ఫరెన్స్‌లోని ఏ ప్యానెల్‌లోనూ వక్త కాదు. ఆమె ప్రేక్షకురాలుగా, టిక్కెట్టు కొనుక్కొని హాజరయ్యారు’’ అని ఇ-మెయిల్‌ (e-mail)ద్వారా స్పష్టం చేశారు. ఆమె తన సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు అప్‌లోడ్‌ చేశారనీ, అవి తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయనీ, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామనీ తెలిపారు.

దరిమిలా... తప్పుడు సమాచారంతో మీసా భారతి ప్రజలను మోసం చేశారంటూ బీజేపీ నాయకుడొకరు ముజఫర్‌నగర్‌ కోర్టులో కేసు వేశారు. దాంతో మీసా నష్టనివారణ చర్యలకు దిగారు.

‘‘హార్వర్డ్‌ వర్సిటీలో(At Harvard University) జరిగిన ఇండియన్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్ళాను. పోడియం దగ్గర కొన్ని ఫొటోలు తీసుకున్నాను. నా స్నేహితులకు షేర్‌ చేశాను. వాటిని స్థానిక మీడియా సంపాదించి, దాని చుట్టూ కథ అల్లింది. నేను ప్యానల్‌లో ఉన్నానని ఎప్పుడూ చెప్పలేదు.

సదస్సు తరువాత... ప్యానలి్‌స్టలతో నా అభిప్రాయాలను వ్యక్తిగతంగా పంచుకున్నానంతే. ఎవరో ఔత్సాహికులు, అభిమానులు నేను వక్తనంటూ వాటిని సర్క్యులేట్‌ చేసి ఉంటారు. ఈ వ్యవహారం నా దృష్టికి రాగానే... వాటిని తొలగించేలా చేశాను. తప్పుడు ప్రచారాన్ని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నా మీద అక్కసుతో కొందరు చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి’’ అంటూ ఎదురుదాడికి దిగారు.

అమ్మ వెనుక చక్రం తిప్పి..

‘‘మీసా చాలా కోపిష్టి. అనుకున్నది జరగాలంటుంది. ఎవరిమీదైనా కోపం పెంచుకుంటే... వారి అంతు చూడాల్సిందే’’ అని ప్రైవేటు సంభాషణల్లో ఆమె మేనమామ సాధుయాదవ్‌ వాపోయారనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాడు దాణా కుంభకోణం కేసు నేపథ్యంలో... బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి లాలూ రాజీనామా చేయడంతో... ఆ బాధ్యతలను ఆయన భార్య రబ్రీదేవి చేపట్టారు.

మూడు విడతలుగా ఆమె సీఎం పదవిని నిర్వహించిన కాలంలో... పాలనా వ్యవహారాలన్నీ మీసాభారతి చేతుల మీదుగానే సాగాయి. అమ్మ వెనుక ఆమె చక్రం తిప్పి, అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో... తన తల్లి రబ్రీని కలుసుకోడానికి కూడా మేనమామ సాధు యాదవ్‌ను మీసా అనుమతించలేదు.

ఆ తరువాత సాధు యాదవ్‌ ఆర్జేడీని విడిచిపెట్టాల్సి వచ్చింది. మీసా మీద, ఆమె భర్త మీద బినామీ ఆస్తులు, మనీ ల్యాండరింగ్‌, లెక్కచూపని ఆస్తులకి సంబంధించి అనేక ఆరోపణలున్నాయి.

ఈడీ దర్యాప్తులు, ఆస్తులపై దాడులు, కీలకమైన పత్రాల స్వాధీనం లాంటివి జరిగాయి. ‘‘ఇలాంటి వాటికి బెదిరేది లేదు. ఇదంతా కుట్ర’’ అంటారు మీసా. లాలూ సీఎంగా ఉండగా... ఆమెకు అర్హత లేకపోయినా ఎంబిబిఎస్‌ సీటును పొందారంటూ అప్పట్లో విపక్షాలు గగ్గోలుపెట్టాయి.

తను చదివిన పాట్నా మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ (పిఎంసిహెచ్‌)లో... గైనకాలజీలో టాపర్‌గా ఆమె నిలవడం, ఇన్ని విమర్శల మధ్య డాక్టర్‌ చదువు పూర్తి చేసినా... ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయకపోవడం... ఇలా ప్రతిదీ చర్చనీయాంశమే అయింది. వీటన్నిటినీ ఆమె కొట్టిపారేస్తారు. ‘‘నా పేరే ఒక అణచివేతపై ధిక్కారానికి ప్రతీక’’ అంటారామె. ఎమర్జెన్సీ సమయంలో... ‘అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం’ (మీసా) కింద లాలూ ప్రసాద్‌ అరెస్టయ్యారు.

సుమారు రెండేళ్ళు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో... 1976 మేలో జన్మించిన తన పెద్ద కుమార్తెకు... మీసా చట్టం కింద దేశంలో జరిగిన అణచివేతకు గుర్తుగా ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు. కాగా... లాలూ-రబ్రీ హయాలో బిహార్‌లో ఆటవిక పాలన నడిచిందనీ, పేదలు, వెనుకబడ్డ వర్గాలవారు, ఓబీసీల మీద అత్యాచారాలు, అణచివేతలు తీవ్రంగా సాగాయనీ విపక్షాల ఆరోపణ.

దీనికి పరోక్షంగానైనా మీసా భారతి మద్దతు ఉందనే వాదనా ఉంది. ఒక అణచివేతపై ధిక్కారానికి చిహ్నంగా చెప్పుకొనే వ్యక్తే... మరో అణచివేతకు దోహదం చేయడం... మీసా కథలోని రాజకీయ వైచిత్రి

Updated Date - Apr 29 , 2024 | 06:08 AM