Share News

Tamilnadu: ఆ పిల్లలకు ‘స్టెప్పింగ్‌ స్టోన్‌’

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:40 AM

చాలామందికి జీవితంలో తమదైన లక్ష్యం ఉంటుంది. కానీ మలుపు వారిని వేరే దారిలోకి మళ్ళిస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ముందుగా నా గురించి పరిచయం చేసుకుంటాను. మాది తమిళనాడులోని మదురై. బిటెక్‌లో గోల్డ్‌ మెడలి్‌స్టని. చదువు పూర్తయ్యాక చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అప్లికేషన్‌ డెవలపర్‌గా చేరాను.

Tamilnadu: ఆ పిల్లలకు ‘స్టెప్పింగ్‌ స్టోన్‌’

  • టీచర్‌ కావాలనుకొని టెకీ అయిన ఆమె.. ఆటిజం బాధిత పిల్లలకు

  • ఆశాకిరణంగా మారారు. 1,200మందికి పైగా బాలల్లో మార్పునకు

  • దోహదపడ్డారు.‘వారిలో సమగ్రాభివృద్ధే నా ఆశయం’

‘‘చాలామందికి జీవితంలో తమదైన లక్ష్యం ఉంటుంది. కానీ మలుపు వారిని వేరే దారిలోకి మళ్ళిస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ముందుగా నా గురించి పరిచయం చేసుకుంటాను. మాది తమిళనాడులోని మదురై. బిటెక్‌లో గోల్డ్‌ మెడలి్‌స్టని. చదువు పూర్తయ్యాక చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అప్లికేషన్‌ డెవలపర్‌గా చేరాను. నాకు చిన్నప్పటినుంచీ టీచింగ్‌ అంటే ఇష్టం. కానీ కుటుంబం ఒత్తిడి వల్ల నా అభిరుచికి విరుద్ధమైన కెరీర్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది.

పెద్దగా ఉత్సాహం కానీ, ఉత్తేజం కానీ కలిగించని రొటీన్‌తో విసుగ్గా ఉండేది. కొన్నాళ్ళకు బెంగళూరులో మరో కంపెనీలోకి మారాను. బోధనా వృత్తిలో నా ఆసక్తిని తీర్చుకోవడం ఎలా? అనే ఆలోచనలో ఉండగా... నేను కొందరు మిత్రులతో కలిసి బెంగళూరులోని ‘స్పాస్టిక్‌ సొసైటీ ఆఫ్‌ కర్ణాటక’ను సందర్శించాను. అదే నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆటిజంతో ఉన్న పిల్లలను మొదటిసారిగా అక్కడ చూశాను.

నేను బాగా చదువుకున్నాను. కానీ పిల్లల పెరుగుదలలోని లోపాల గురించి నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ అని అర్థమయింది. ‘ఏదో ఒక రోజు నేనూ తల్లిని అవుతాను. కానీ బిడ్డను కనే ముందు... గర్భంలో ఉన్నది మొదలు కాస్త ఎదిగే వరకూ పిల్లలకు ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకోవాలి’ అనుకున్నాను. ఆటిజం గురించి అధ్యయనం చేశాను. ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు ఆటిజం బాధితులనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం వందమంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య ఉందనీ ఒక అధ్యయనాన్ని చదివాను. అలాంటి పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. 2013లో ‘స్టెప్పింగ్‌ స్టోన్స్‌ సెంటర్‌’ పేరిట ఒక సంస్థను స్థాపించాను. ‘ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌’

(ఎఎస్‌డి) ఉన్న పిల్లల సమగ్రాభివృద్ధికి దోహదం చెయ్యడం క్రమంగా విద్యావ్యవస్థతో వారిని అనుసంధానించడం దీని ఉద్దేశం.

ముందుగా గుర్తించడమే కీలకం వివిధ దశల్లో పిల్లల ఎదుగుదల.. ముఖ్యంగా ఆరేళ్ళ లోపువారిలో ఎలా ఉండాలో, ఎలా ఉందో గ్రహించడం చాలా అవసరం. తొలి దశలోనే లోపాలను, జాప్యాలను గుర్తిస్తే... వాటిని పరిష్కరించడానికి ముందుగానే చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది. ఇది చాలా కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మాట్లాడే, ఆవశ్యకమైన విషయాలు, అలవాట్లు నేర్చుకొనే నైపుణ్యాలు లేకపోవడం, శరీరం కదలికల్లో లోపాలు, అతి చురకుతనం, మందకొడిగా ఉండడం, దేని మీదా ధ్యాస లేకపోవడం.. ఇలాంటివి ఆటిజంలో ముందుగా గుర్తించగలిగే చిహ్నాలు.

పుట్టిన తరువాత పిల్లల మెదడు అభివృద్ధికి మొదటి వెయ్యి రోజులను ‘గోల్డెన్‌ పీరియడ్‌’గా చెప్పవచ్చు. ఈ కీలకమైన దశలో లోపాలేవైనా కనిపించినట్టయితే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. ఈ నేపథ్యంలో మేము ఎర్లీ ఇంటర్వెన్షన్‌ ప్రోగ్రామ్‌ అమలు చేస్తున్నాం. పిల్లల భౌతిక, భాషా, ప్రవర్తనా, సామాజిక, విజ్ఞానపరమైన ఎదుగుదలను పరిశీలిస్తాం. ఆ పిల్లల అవసరాలేమిటనేది నిర్ధారిస్తాం. తరువాత నిపుణుల సాయంతో... ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందిస్తాం.

స్పీచ్‌ థెరపీ, బిహేవియర్‌ థెరపీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫిజికల్‌ డెవల్‌పమెంట్‌... ఇలా వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులు వీటిని నిర్వహిస్తారు. తల్లితండ్రులను కూడా దీనిలో భాగస్వాములుగా చేస్తాం. ప్రతిరోజూ పిల్లలతో చేయిస్తున్న యాక్టివిటీ్‌సను, వాటికి వారు ప్రతిస్పందించిన తీరును, వారిలో వస్తున్న మార్పులను నమోదు చేస్తాం. వారానికి ఒకసారి వాటిని సమీక్షించి... మార్పులూ, చేర్పులూ చేస్తూ ఉంటాం.


తల్లితండ్రుల పాత్ర కీలకం..

ఇప్పుడు మా సంస్థలో 72 మంది నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకూ ఆటిజం ఉన్న 1,200 మందికి పైగా పిల్లలకు సాయం అందించాం. ప్రస్తుతం మా దగ్గర 48 మంది ఉన్నారు. వీరికి యోగా, నృత్యం, క్రీడలు, ఆర్డ్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లాంటివి కూడా నేర్పిస్తున్నాం. మా దగ్గర చికిత్స, శిక్షణ పొందుతున్న పిల్లలను చేర్చుకోవడానికి స్కూళ్ళను వెతకడం పెద్ద సమస్య. చాలా పాఠశాలల్లో ఇలాంటి పిల్లలకు సౌకర్యాలు, వాటికి బోధన చేసే పాఠ్యప్రణాళిక లేవు. బెంగళూరులో నాలుగు పాఠశాలలు మాతో కలిసి పని చేస్తున్నాయి. సెషన్స్‌ వారీనైనా లేదా ఏడాదికి ఒకేసారైనా ఫీజు చెల్లించి... వివిధ సేవలను ఉపయోగించుకోవచ్చు.

సాధారణ పాఠశాలల్లో చదివే తమ వయసు పిల్లల స్థాయి అవగాహనను ఆటిజం పిల్లల్లో కల్పించాలన్నదే నా ప్రయత్నం. దీనిలో తల్లితండ్రుల పాత్ర కీలకం. ఎందుకంటే పిల్లలతో ఎక్కువసేపు గడిపేది వాళ్ళే. కాబట్టి వారికోసం ఆరు వారాల పేరెంట్‌ ప్రోగ్రామ్‌ కూడా నిర్వహిస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కన్నా ఇది నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆటిజం పిల్లలకు బోధిస్తున్నప్పుడు... నావంతుగా సమాజానికి కొంత సేవ చేయగలుగుతున్నానే సంతృప్తి వెలకట్టలేనిది.’’

Updated Date - Apr 24 , 2024 | 12:43 AM