Share News

గవర్నర్‌ లైంగికంగా వేధించారు!

ABN , Publish Date - May 04 , 2024 | 02:40 AM

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ తీవ్రంగా స్పందించారు.

గవర్నర్‌ లైంగికంగా వేధించారు!

బెంగాల్‌ గవర్నర్‌పై రాజ్‌భవన్‌ ఉద్యోగిని ఫిర్యాదు

నాపై మరో భయంకర కుట్ర: గవర్నర్‌ ఆనందబోస్‌

కోల్‌కతా, మే 3: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ తదుపరి గ్రెనేడ్‌, దాచిపెట్టిన బుల్లెట్ల గురించి ఎదురుచూస్తున్నా. దయచేసి కాల్చండి’’ అని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. గవర్నర్‌ బోస్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో గవర్నర్‌ తనను వేధించారని అందులో ఆరోపించారు. ఈ ఘటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ‘‘సందేశ్‌ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. గవర్నర్‌ పదవికి అప్రతిష్ఠ తెచ్చారు’’ అంటూ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌ సందర్శనకు కొద్ది గంటల ముందు ఆమె గవర్నర్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే.. వీటిని తీవ్రంగా ఖండిస్తూ రాజ్‌భవన్‌ వెంటనే వరుస ట్వీట్లు చేసింది. ఈ అంశంపై శుక్రవారం గవర్నర్‌ బోస్‌ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ప్రియమైన రాజ్‌భవన్‌ ఉద్యోగులారా.. రాజకీయ శక్తుల ప్రేరణతో నాపై చేస్తున్న నిరాధార ఆరోపణలను స్వాగతిస్తున్నా. ఇలాంటివి ఇంకా ఉంటాయన్న విషయం నాకర్థమైంది. కానీ, ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. ఇలాంటి తెలివితక్కువ డ్రామాలు ఎన్ని చేసినా.. అవినీతిని, హింసను అరికట్టే విషయంలో నన్నెవరూ అడ్డుకోలేరు’’ అని బోస్‌ పేర్కొన్నారు. ‘‘నా దగ్గర ఓ ముఖ్యమైన సమాచారం ఉంది. రాజ్‌భవన్‌లో స్నేహితులు మరో భయంకరమైన కుట్రకు తెరలేపారు. దానికి ఎవరు బాధ్యులనేది కూడా నాకు తెలుసు’’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్యకు కోల్‌కతా, డార్జిలింగ్‌, బారక్‌పోర్‌లలోని రాజ్‌భవన్‌ ప్రాంగణాల్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ రాజ్‌భవన్‌ ఆదేశాలు జారీచేసింది. మహిళా ఉద్యోగిని గవర్నర్‌పై లైంగిక వేధింపులపై ఆరోపణలు చేయడాన్ని మంత్రి విలేకరులతో ప్రస్తావించారు. దీంతో ‘పరువునష్టం కలిగేలా, రాజ్యాంగ వ్యతిరేక మీడియా ప్రకటనలు చేశారు’ అని పేర్కొంటూ ఆమెకు రాజ్‌భవన్‌లోకి అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఆదేశాలతో అనధికారికంగా విచారణలు జరుపుతున్నందున పోలీసులకు కూడా రాజ్‌భవన్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 04 , 2024 | 02:40 AM