Share News

మధ్యప్రదేశ్‌కే ఎందుకు?

ABN , Publish Date - May 04 , 2024 | 04:53 AM

దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్‌కే కేసును ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా ఎందుకు పిటిషన్‌ దాఖలు చేశారని

మధ్యప్రదేశ్‌కే ఎందుకు?

ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్న

న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం

న్యూఢిల్లీ, మే 3(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్‌కే కేసును ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా ఎందుకు పిటిషన్‌ దాఖలు చేశారని అడిగింది. కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, మహబూబ్‌ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంలో పిటిషన్‌ వేశారు. దీనిని శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సతీ్‌షచంద్రశర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ దవే, దామ శేషాద్రినాయుడు, మోహిత్‌ రావు హాజరయ్యారు. ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, ఇతరుల పక్షాన సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గి, సిద్దార్థ లూథ్రా, మేనకాగురుస్వామి, తెలంగాణ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. శుక్రవారం రిజిస్ట్రార్‌ కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నదని, పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగానే రెగ్యులర్‌ బెంచ్‌ ముందు మెన్షన్‌ చేశారని ముకుల్‌ రోహిత్గి, మేనక అభ్యంతరం తెలిపారు. రాజకీయ ప్రమేయం ఉన్న ఈ కేసును ఉద్దేశ పూర్వకంగానే కోర్టు ముందుకుతెచ్చారని వాదించారు.


ఈ వాదనలపై సిద్ధార్థదవే అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తొలుత తాము మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీ్‌సగఢ్‌కు బదిలీ చేయాలని కోరామని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బదులిచ్చారు. అయితే, ఏదైనా ఒక రాష్ర్టాన్నే కోరాలని రిజిస్ట్రార్‌ తెలిపారని ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలైకు వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం తొలి మాసంలో విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఓటుకు నోటు కేసును బదిలీ పిటిషన్‌పై ఇరు పక్షాల న్యాయవాదులు తీవ్రస్థాయిలో వాదనలు వినిపించారు. ఈక్రమంలో ముకుల్‌ రోహత్గి, సిద్థార్థ దవే ఒకరి వాదనలకు మరొకరు అడ్డుపడే ప్రయత్నం చేశారు. పిటిషనర్‌ కాబట్టి తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ దవే తన వాదనలు కొనసాగించారు. ఇదే సమయంలో సిద్థార్థ లూథ్రా ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘నాకు పలు హైకోర్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. సీనియర్‌ న్యాయవాదుల ప్రవర్తన ధర్మాసనానికి కొత్తగా ఉంది. మీ వాదనలను నియంత్రించడం క్లిష్టంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - May 04 , 2024 | 04:54 AM