Share News

అప్పటి ఆధిక్యం నిలిచేనా?

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:18 AM

లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన సమస్య నెదుర్కొంటున్నది. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి....

అప్పటి ఆధిక్యం నిలిచేనా?

లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన సమస్య నెదుర్కొంటున్నది. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. నేడు పోలింగ్ జరగనున్న 87 స్థానాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 2019లో 62 కైవసం చేసుకోగా, కేవలం 24 సీట్లలో మాత్రమే ఇండియా కూటమి విజయం సాధించింది. ఆ ఆధిక్యతతో అధికార కూటమి ప్రస్తుత ఎన్నికలలో కూడా అత్యధిక సీట్లను గెలుచుకోగలదనుకోవడం భ్రమే అవుతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. 2019 నాటి సంఖ్యాబలం ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించడం లేదు. 2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూసినప్పుడు అధికార ప్రతిపక్ష కూటముల బలాబలాల్లో చోటుచేసుకున్న మార్పులు తెలియవస్తాయి. 2019 అనంతర అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన ఆధిక్యతలతో సర్దుబాటు చేసినప్పుడు ఉభయ కూటముల మధ్య పోటీ ఇంచుమించు సమస్థాయిలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ ప్రకారం ఎన్‌డీఏ 44 సీట్లలోను, ఇండియా కూటమి 43 సీట్లలోను ముందంజలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. బీజేపీకి మరో సమస్య కూడా ఉన్నది. రెండు రాష్ట్రాలలో మినహా బీజేపీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో ఆ పార్టీ వివిధ స్థాయిలలో బలహీనంగా ఉన్నది. కాగా ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఇప్పటికీ ఆ ప్రతిపక్ష కూటమికి కంచుకోటలుగా ఉన్నాయి. బీజేపీ ఎట్టి పరిస్థితులలోను ఆ కోటల్లో పాగా వేయలేదు. చెప్పవచ్చిన దేమిటంటే ఈ రెండో దశ ఎన్నికలలోను బీజేపీ నష్టాలను చవి చూడనున్నది. ఎన్‌డీఏ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో పోలింగ్ శాతం, ఇండియా భాగస్వామ్యపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలలో కంటే తక్కువగా ఉంటే అధికార కూటమికి సంభవించే నష్టాలు గణనీయమైనవిగా ఉంటాయి.


రెండో దశ ఎన్నికలు జరగనున్న స్థానాలలో ఇండియా కూటమి గతంలో వలే ఇప్పుడూ బలోపేతంగా ఉండడానికి ప్రధాన కారణం కేరళ. ఈ రాష్ట్రంలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలలోనూ నేడు పోలింగ్ జరగనున్నది లోక్‌సభ ఎన్నికలలో ఇంతవరకు ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. అయితే తన ఓట్ల శాతాన్ని మెరుగుపరచుకుంటూ వస్తోంది. 2019లో ఒక నియోజకవర్గం– తిరువనంతపురంలో బీజేపీ రెండవ స్థానంలో ఉన్నది. స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది. మరో రెండు నియోజకవర్గాలలో ఓట్ల వాటాలో నాలుగో స్థానంలో ఉన్నది. కేరళలో బీజేపీ తన ప్రప్రథమ విజయాన్ని సాధించగలిగితే ఆ పార్టీ మహదానందభరితమవుతుంది అయితే కేరళలో గెలుచుకునే సీట్లు బీజేపీ మొత్తంగా గెలుచుకునే సీట్ల సంఖ్యను పెద్దగా పెంచలేవు.

ఈ రెండో దశ ఎన్నికలలో బీజేపీ అదృష్ట దురదృష్టాలు కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రలో నిర్ణయమవనున్నాయి. గత సార్వత్రక ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి గట్టి పోటీ నెదుర్కొంటున్నది. కర్ణాటకలో రెండో విడత పోలింగ్ జరగనున్న 14 స్థానాలు రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. పాత మైసూరు, కూర్గ్, కోస్తా ప్రాంతాలలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. కోస్తా ప్రాంతాలలో బీజేపీకి మొదటి నుంచీ మంచి ఆదరణ ఉన్నది. పాత మైసూరు సంస్థానంలో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదు. గత సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న ఒకే ఒక్క స్థానం మైసూరు ప్రాంతంలోనే ఉన్నది. మిగతా రెండు నియోజకవర్గాలను జనతాదళ్ (సెక్యులర్) గెలుచుకున్నది. గ్రామీణ ప్రాంతాలలో ఒక్కలిగ కులస్తులదే పూర్తి ప్రాబల్యం. యూపీలో ఆర్ఎల్‌డీతో పొత్తు దోహదం చేసిన విధంగా ఒక్కలిగల నాయకత్వంలోని జనతాదళ్ (ఎస్)తో మైత్రి కర్ణాటకలో తన విజయావకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. గతంలోని ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు బీజేపీ–జనతాదళ్(ఎస్) పొత్తు ఉభయతారకమైనదని చెప్పవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూస్తే నేడు పోలింగ్ జరగనున్న 14 స్థానాలలో తొమ్మిదిని గెలుచుకోవలసి ఉంటుంది. అయితే బీజేపీ–దళ్(ఎస్)లకు లభించిన ఓట్లను కలిపి లెక్కిస్తే కాంగ్రెస్‌కు ఈ 14 సీట్లలో కేవలం 3 మాత్రమే లభించే అవకాశమున్నది. ఇందుకు బీజేపీ, జనతాదళ్(ఎస్) పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరగవలసి ఉంది. అయితే అది జరిగే అవకాశం లేదు. అంతేకాకుండా సిద్ధరామయ్య ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజాదరణ కాంగ్రెస్‌కు లబ్ధి సమకూర్చనున్నది. ఓటర్లు నిజంగా కాంగ్రెస్ వైపు మొగ్గితే బీజేపీ– దళ్(ఎస్) కూటమి 3 నుంచి 5 స్థానాలను కోల్పోయే అవకాశమున్నది.

రాజస్థాన్‌లో కూడా ఇండియా కూటమి మంచి లబ్ధి పొందే అవకాశమున్నది. అయితే మొదటి దశలో మాదిరిగా ఈ రెండో దశలో లబ్ధి పొందే అవకాశం లేదు. రాజస్థాన్‌లో ఈ రెండో దశ ఎన్నికలు మార్వార్, మేవార్ హరోటి ప్రాంతాలలో జరగనున్నాయి. 2019 సార్వత్రక, 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతాలలోనే బీజేపీ ఘన విజయాలు సాధించింది. ఈ మూడు ప్రాంతాలలోని 13 నియోజకవర్గాలలో కేవలం 4 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్‌కు విజయావకాశమున్నది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు చివరి క్షణంలో భారత్ ఆదివాసీ పార్టీతో ఒక అవగాహనకు వచ్చినందున మరో మూడు సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ మరో 3 నుంచి 5 సీట్లను కోల్పోయే అవకాశమున్నది.


మహారాష్ట్రలో ఈ సార్వత్రక ఎన్నికలు ఐదు విడతలుగా జరగనున్నాయి. సిట్టింగ్ ఎంపీలలో అత్యధికులు, గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినవారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తమ మాతృ పార్టీ పేరు, చిహ్నాన్ని స్వాయత్తం చేసుకోవడంలో సఫలమయ్యాయి. ఈ రెండు పార్టీల మాతృపార్టీలు ఇప్పుడు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే), ఎన్‌సీపీ–శరద్‌చంద్ర పవార్ అనే కొత్త పేర్లతో వ్యవహరింపబడుతున్నాయి. మాతృపార్టీల కార్యకర్తల్లో అత్యధికులు ఈ రెండు పార్టీల పక్షానే ఉన్నారు. అలాగే ఓటర్లు కూడా. గత అసెంబ్లీ ఎన్నికలలో శివసేన, ఎన్‌సీపీలకు లభించిన ఓట్లు సమాన స్థాయిలో చీలిపోతే బీజేపీ, దాని మిత్రపక్షాలు నేడు పోలింగ్ జరగనున్న 8 సీట్లలో మూడింటిని కోల్పోతాయి. వంచిత్ బహుజన్ అఘాది ఈ రెండో విడత ఎన్నికలలో 6 స్థానాలలో పోటీ చేస్తోంది. 2019లో కంటే ఇప్పుడు వీబీఏ బలహీనంగా ఉన్నప్పటికీ పలు స్థానాలలో ఇండియా కూటమికి చెప్పుకోదగిన నష్టాన్ని కలిగించే అవకాశమున్నది. మొత్తం మీద మహారాష్ట్రలో ఈ విడత ఎన్నికలలో ఇండియ కూటమి పరిమిత లబ్ధిని మాత్రమే పొందగలదు.

ఇతర రాష్ట్రాలలో నేడు పోలింగ్ జరగనున్న కొద్ది నియోజకవర్గాలలో కూడా బీజేపీకి స్వల్ప నష్టం జరిగే అవకాశమున్నది. ఛత్తీస్‌గఢ్‌లో నేడు పోలింగ్ జరగనున్న మూడు నియోజకవర్గాలలోను కాంగ్రెస్ గెలిచే అవకాశమున్నది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్ ప్రాంతపు మూడు నియోజకవర్గాలలో బీజేపీ ఒక ప్రధాన పోటీదారుగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు నియోజకవర్గాలలో రెండిటిపై పూర్తి పట్టును సాధించింది. బిహార్‌లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న సీమాంచల్, భాగల్పూర్ ప్రాంతాలలో నేడు పోలింగ్ జరగనున్నది. ఈ ప్రాంతాలలోని పూర్ణియా నియోజకవర్గంలో ఇండియా కూటమి అంతర్గత విభేదాలు దానికి ప్రతికూలంగా పరిణమించే అవకాశమున్నది. ఇక కిషన్‌గంజ్ నియోజకవర్గంలో ఎఐఎమ్ఐఎమ్ నుంచి ఇండియాకు గట్టి సవాల్ ఎదురవుతున్నది. పశ్చిమ యూపీలో నేడు పోలింగ్ జరగనున్న ఎనిమిది నియోజకవర్గాలలో ఎస్పీ– కాంగ్రెస్ కంటే బీజేపీ–ఆర్ఎల్‌డీకే స్పష్టమైన ఆధిక్యత ఉన్నది. అయితే రెండు అంశాలు బీజేపీకి ప్రతికూలంగా పరిణమించవచ్చు. పశ్చిమ యూపీకి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌ను మాయావతి మళ్లీ తలకెత్తుకున్నారు (ఆర్ఎల్‌డి ఒకప్పుడు ఇదే డిమాండ్ చేస్తుండేది). మరో అంశం బీజేపీ పట్ల రాజ్‌పుట్‌ల అసంతృప్తి. అభ్యర్థుల ఎంపికలో తమ వర్గం వారికి సముచిత ప్రాధాన్యమివ్వనందుకు బీజేపీ పట్ల రాజ్‌పుట్‌లు అసంతృప్తితో ఉన్నారు.

18వ సార్వత్రక ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు అన్నిటిలోను 2019లో 70 శాతం పోలింగ్ జరిగింది. మిగతా దశలలో కంటే రెండో దశలోనే అత్యధిక పోలింగ్ జరిగింది. మరి ఈసారి ఈ దశలో పోలింగ్ శాతం, ముఖ్యంగా హిందీ రాష్ట్రాలలో తగ్గిపోనున్నదా? ఈ సంభావ్య విషయం బీజేపీని అమితంగా కలవరపరుస్తోంది. ఎందుకంటే మొదటి దశలో పోలింగ్ శాతం తగ్గి పోయింది. (మొదటి దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో ఎన్‌డీఏ బలంగా ఉండడంతో పాటు 2019లో వాటిలో సగానికి పైగా సీట్లను గెలుచుకున్నది.) 2019లో ఎన్‌డీఏ గెలుచుకున్న నియోజకవర్గాలలో ఈసారి మొదటి దశ పోలింగ్ 5.1 శాతం తగ్గిపోగా గతంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు గెలుచుకున్న సీట్లలో ఇప్పుడు పోలింగ్ శాతం 2.4 శాతం మాత్రమే తగ్గింది. పోలింగ్ శాతం మొదటిదశలో వలే రెండో దశలో కూడా తగ్గిపోయిన పక్షంలో తరువాయి దశల్లో బీజేపీకి సవాళ్లు ముమ్మరమవుతాయి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త కన్వీనర్, భారత్ జోడో అభియాన్)

(శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో)

Updated Date - Apr 26 , 2024 | 06:18 AM