Share News

సాధికారత ఎవరికి?

ABN , Publish Date - May 05 , 2024 | 12:18 AM

చుట్టూ మోహరించిన కార్పొరేట్‌ బలాల నిఘాలో ఈవీఎంలలో నిక్షిప్తమైన మన వర్తమాన దేశ భవిష్యత్తు,...

సాధికారత ఎవరికి?

చుట్టూ మోహరించిన

కార్పొరేట్‌ బలాల నిఘాలో

ఈవీఎంలలో నిక్షిప్తమైన

మన వర్తమాన దేశ భవిష్యత్తు,

మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ–

ఊగిసలాటలో మోకరిల్లిన దుర్దశలో

భయం నీడలో మూలుగుతున్న

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం,

నిత్యావసర ధరల సుడిగుండంలో చిక్కి

విలవిలలాడుతున్న పౌరజీవితం

ఏ కూటమి గెలిచినా

వొరిగేదేమిటనే సామాన్యుడి నిర్వేదం,

ఉపాధి–మనుగడకు గ్యారంటీ ఇవ్వలేని

ఒకే ఒక వ్యక్తి ఆరాధనాస్వామ్యంలో

లోక్‌సభ నామినేషన్ల పరుగులో

కోటీశ్వరులదే ముందంజ–

నిజంగానే ఇది

శ్రమవిలువను కాజేస్తున్న సంపన్నుల దేశం!

నిత్యం గంగ కావేరీ తీరాలలో

మహాహారతిలో కరిగిపోతున్న కోట్ల ఆశలు,

కృష్ణాగోదావరి ప్రవాహాల సాక్షిగా

వ్యక్తిగత క్షుద్ర రాజకీయాల బురదను

పోటీపడుతూ మోస్తున్న ఊరేగింపులు,

ఇంతకు ఎవరికోసమీ సాధికారత?

వోటర్లకా? రాజకీయ దళారులకా?

నిఖిలేశ్వర్‌

Updated Date - May 05 , 2024 | 12:18 AM