Share News

వ్యర్థ జలాలు – జలభద్రత

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:15 AM

నీరు నీరు వంకకే పారుతుంది... ఇది మన ఇంగిత జ్ఞానం. నీరు నీటికే చేరాలిగాని వ్యర్థమై పోకూడదు అనేది నేడు మనం నేర్చుకోవాల్సిన ఒక ఆవశ్యక పాఠం....

వ్యర్థ జలాలు – జలభద్రత

నీరు నీరు వంకకే పారుతుంది... ఇది మన ఇంగిత జ్ఞానం. నీరు నీటికే చేరాలిగాని వ్యర్థమై పోకూడదు అనేది నేడు మనం నేర్చుకోవాల్సిన ఒక ఆవశ్యక పాఠం.

స్వచ్ఛమైన నీరు మనకు అందుబాటులో లేకపోతే మన ఆరోగ్యం దెబ్బ తింటుంది, జీవితం దుర్భరమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా గ్రామీణ ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని సమకూర్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. వాస్తవంలో జరుగుతున్నదేమిటి? నీటి సరఫరా సదుపాయాలు గ్రామాలకు సమకూరుతున్నా గ్రామస్తులకు నీరు అందుబాటులో లేని గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? నీటి సరఫరా అనేది కేవలం పైప్‌లైన్‌ల నిర్మాణ వ్యవహారం మాత్రమే కాదు, సరఫరా వ్యవస్థకు మూలమైన జలవనరు నిరంతరాయంగా నీటిని సమకూర్చేదిగా ఉండేలా మనం జాగ్రత్తపడాల్సిన అవసరమున్నది. నీటి సరఫరా సదుపాయాలు ఉండవచ్చు. అయితే సరఫరాకు మూలమైన జలవనరు ఎండిపోయినా, కలుషితమయినా నీటి పంపిణీ యంత్రాంగం నిరుపయోగమైపోతుంది.

నీటి సరఫరా వ్యవస్థ నిరంతరం పని చేసేలా చూడడం, ముఖ్యంగా సరఫరాకు ప్రధాన ఆధారమైన జలవనరు శాశ్వతంగా ఉండేలా చేయడమనేది చాలా అవసరం. ఇందుకు చేపడుతున్న చర్యలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. భారత ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్) ఈ మౌలిక లోపాన్ని గుర్తించి, దాన్ని తొలగించేందుకు ప్రాధాన్యమిచ్చింది. పైప్‌లు, ట్యాప్‌ల ద్వారా నీరు నిరంతరం ప్రవహించేలా చేయడమే జెజెఎమ్ లక్ష్యంగా ఉన్నది. ప్రతి గృహంలోనూ ట్యాప్ నేర్పాటు చేయడమే కాకుండా, ఆ ట్యాప్ అవిశ్రాంతంగా పనిచేస్తుండడం అంటే నీటి సరఫరాను అన్ని వేళలా కొనసాగిస్తుండడమే జెజెఎమ్ అతి ముఖ్య లక్ష్యంగా ఉన్నది.


ఈ లక్ష్యం నెరవేరాలంటే జల వనరుల మన్నికను మెరుగుపరచడంపై దృష్టిని కేంద్రీకరించవలసి ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుంట, చెరువు, సరస్సు ఎట్టి పరిస్థితులలోను అక్రమ ఆక్రమణలకు గురికాకుండా జాగ్రత్తపడాలి. వాటర్ షెడ్ (సరస్సు, నది మొదలైన కేంద్ర స్థానాలకు నీరంతా ప్రవహించే భూభాగం) సురక్షితంగా ఉండాలి. నీటి వనరు నది, సరస్సు లేదా చెరువు ఏదైనప్పటికీ అది సదా పునశ్శక్తిమంతమవుతూ ఉండాలి. భూమిపై విసర్జించిన మల మూత్రాలు లేదా టాయ్‌లెట్లు, ట్యాప్‌లు ఉన్న గృహాలలో వినియోగించి వదిలివేసిన నీటి మూలంగా జలవనరులు కలుషితం కాకుండా ఉండాలి.

గృహావసరాలకు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతాన్ని వ్యర్థ జలంగా వదిలివేస్తున్నాం. ఇది విస్మరించలేని వాస్తవం. గ్రామీణ గృహాలలో కనిష్ఠ పరిమాణంలో నీటిని వినియోగించే టాయ్‌లెట్ల నిర్మాణానికే ప్రభుత్వాలు అమలుపరుస్తున్న పారిశుధ్య కార్యక్రమాలు ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యర్థ జలంలో చాలా భాగం గ్రే వాటర్ (స్నానాలకు, బట్టలు ఉతకడానికి లేదా వంట పాత్రలు కడగడం మొదలైన పనులకు ఉపయోగించగా వెలువడిన నీరు). ఈ నీటిని వీధుల్లోకి వదిలివేయడం కద్దు. ఆ వ్యర్థ జలాలతో వీధుల్లో మడుగులు ఏర్పడుతాయి. అవి రోగకారక క్రిములకు నెలవులై అంటువ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా ఆ నీటి మడుగులు, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు కలుషితమయ్యేందుకు కూడా కారణమవుతున్నాయి. ఈ వ్యర్థ జలాలను సాగు ప్రయోజనాలకు ఉపయోగించడం లేదా భూగర్భ జలాలను పునశ్శక్తిమంతం (రీఛార్జ్) చేసేందుకు వినియోగించడమనేది చాలా ముఖ్యం. అప్పుడే నీటి సరఫరా నిరంతరాయంగా జరుగుతుంది. ఇది నీరు నీటికి చేరడమే. ఆ నీరు వ్యర్థమైపోదు.

నీటి సరఫరాను పారిశుధ్య, వ్యర్థ జల ఉత్పాదన వ్యవస్థతో అనుసంధానం చేయవలసి ఉన్నది. మనం నీటిని కలుషితం చేస్తున్నామంటే దానిని వృథా చేస్తున్నామన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. నిజమేమిటంటే వ్యర్థ జలాలను సురక్షితంగా వదలివేయడం జరగనంతవరకు టాయిలెట్ నిర్మాణ కార్యక్రమం పరిపూర్ణం కాదు. టాయిలెట్ గుంటలలోని మల పంకాన్ని అదే విసర్జన స్థలంలోనే శుద్ధి చేయాలి లేదా మలాన్ని సేకరించి శుద్ధికేంద్రాలకు తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. అలా శుద్ధి చేసిన మలాన్ని నీరు లేదా నేల కలుషితం కాకుండా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. శుద్ధి చేసిన తరువాత దానిని నేలపై పునః ఉపయోగించాలి.

మనం తిన్న తరువాత విసర్జించే ఆహారమే మల పదార్థం. పోషకాలు సమృద్ధిగా ఉండే నత్రజని, భాస్వరాన్ని మన ఆహార వనరులు నేల నుంచి తీసుకుంటాయి. ఆహారాన్ని తిని విసర్జించిన తరువాత ఆ మలపదార్థాన్ని మళ్లీ భూమిలో కలిసిపోయేలా చూడాలి. అయితే శుద్ధి చేసిన తరువాత మాత్రమే అలా చేయాలి. వ్యర్థ పదార్థాల పునర్వినియోగమనేది మన ఆరోగ్యానికి హానికరం కాకూడదు.


మరో ముఖ్యమైన వాస్తవమేమిటంటే ప్రజాసమూహాలు భాగస్వాములు కానంతవరకు నీటి సరఫరా పథకాలు సక్రమంగా పని చేయనివిగా మిగిలిపోతాయి. నిజానికి పూర్తిగా నిష్ప్రయోజనమవుతాయి. సమస్యమిటంటే నీటి వనరుల నిర్వహణ, భూముల వ్యవహారాల సంబంధిత అధికార వ్యవస్థలు వేర్వేరుగా ఉండడమే. నీటి వనరుల నిర్వహణ బాధ్యత, నీటిపారుదల వ్యవస్థపై నియంత్రణ వేర్వేరు ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉంటాయి. ఆరగాణి ప్రాంతం మరో విభాగం పరిధిలో ఉంటుంది. జల భద్రత సమకూరాలంటే ఈ పరిస్థితి మారాలి. జలవనరులపై స్థానిక ప్రజా సముదాయాలకు యాజమాన్య హక్కులు కల్పించాలి. అధికారాల వికేంద్రీకరణే నీటి వనరుల నిర్వహణకు సరైన మార్గం. స్వచ్ఛమైన నీరు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా అధికారాల వికేంద్రీకరణ తప్పనిసరిగా జరగాలి.

వాతావరణ మార్పు ప్రభావాలు తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో నేటి సమాజాలకు ఈ వికేంద్రీకరణ చాలా ముఖ్యం. సమీప కాలంలోనే ప్రాకృతిక వైపరీత్యాలను మనం మరింత తీవ్ర స్థాయిలో చూడనున్నాం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల నిర్వహణలో పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరమున్నది. జల ప్రళయం లాంటి కుంభవృష్టిని సైతం తట్టుకుని సురక్షితంగా ఉండగలగాలి. ఈ విషయంలో మన కృషిని మరింత వేగవంతం చేయవలసిన అవసరమున్నది. లేని పక్షంలో వాతావరణ మార్పు ప్రభావంతో తరచు అతివృష్టి లేదా సుదీర్ఘ అనావృష్టిని చవిచూడవలసి వస్తుంది. వాననీటిని మరింత భద్రంగా పట్టుకుని కాపాడుకోవల్సి ఉన్నది. ఎక్కడ పడిందో అక్కడే పట్టుకోవాలి. అక్కడే నిల్వ చేసి ఆ ప్రాంత భూగర్భ జలాలను పునశ్శక్తిమంతం చేయాలి.

నదులు, సరస్సులు, చెరువులు మొదలైన జల వనరులను కాపాడుకునేందుకు మనం చూపే శ్రద్ధాసక్తులపై మన జల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నీటి కొరత అంటే కేవలం వర్షాలు పడకపోవడం కాదు. ప్రకృతి మనకు ప్రసాదించే జీవధార అందరిదీ. సకల ప్రజలకూ దానిపై హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరికీ ఆ హక్కును న్యాయబద్ధంగా అమలుపరచాలి. దురదృష్టవశాత్తు మన సమాజం ఈ విషయంలో విఫలమవుతోంది. ఆ వైఫల్య పర్యవసానమే జల సంక్షోభాలు.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Apr 26 , 2024 | 06:15 AM