Share News

పని గంటలపై పోరాటం ఇంకా ముగియలేదు!

ABN , Publish Date - May 01 , 2024 | 06:17 AM

కార్మికుణ్ణి ‘మాట్లాడే యంత్రం’గా దిగజార్చిన పెట్టుబడిదారీ యుగనీతిపై ఓ తిరుగుబాటు బావుటా మే డే! కార్మికుణ్ణి కూడా మనిషిగానే చూడాలంటే, అతడు

పని గంటలపై పోరాటం ఇంకా ముగియలేదు!

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన నేపథ్యంలో

నిజానికి 8 గంటల పనిదినం క్రమక్రమంగా 7 గంటల, 6 గంటల,

5 గంటల, 4 గంటల పనిదినంగా మారాలి. కానీ 8 నుండి

10, 12, 14, 15, 16 గంటలుగా మారడం ఏమిటి? భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉన్నది. ఈ రోజు కార్మిక పోరాటం జీతభత్యాల వరకే పరిమితం కాక, పని గంటల సమస్యపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.

కార్మికుణ్ణి ‘మాట్లాడే యంత్రం’గా దిగజార్చిన పెట్టుబడిదారీ యుగనీతిపై ఓ తిరుగుబాటు బావుటా మే డే! కార్మికుణ్ణి కూడా మనిషిగానే చూడాలంటే, అతడు/ ఆమె రోజుకు ఏఏ విధులకు ఎన్నెన్ని గంటల్ని కేటాయించాలో నిర్వచించింది మేడే పోరాటం. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, మరో 8 గంటలు తన కోసం. ఈ ఆఖరిది ఆచరణలో వినోదం కోసం. లేదా కుటుంబ జీవితం కోసం. ఇదే అత్యంత ప్రాధాన్యత గలది. అదే 1886లో ప్రధానంగా పొందిందీ, నేడు ప్రధానంగా కోల్పోయేదీ!

రోజుకు 24 గంటలు. దాన్ని మూడు సమ భాగాలు చేస్తే 8 గంటలౌతుంది. ఓ 8 గంటలు పెట్టుబడిదార్ల వద్ద పని కోసం. ఇంకో 8 గంటలు పని ద్వారా కోల్పోయిన శరీర శక్తిని తిరిగి పొందేందుకు నిద్రకోసం. మరో ముఖ్యమైన 8 గంటలు తన కోసం. అంటే కార్మికుడి కోసం. ఆచరణలో కుటుంబం కోసం. అదే సాంఘిక జీవితం. సోషల్ లైఫ్. ఓ మనిషిగా కార్మికుణ్ణి మార్పుకు గురి చేసే ముఖ్యమైన ప్రక్రియ అదే!


మనిషికి అవసరమైన 8 గంటల నిద్రా కాలాన్ని కూడా పారిశ్రామిక వర్గం కబ్జా చేసిన దశ ఉంది. అది కార్మికవర్గాన్ని ‘టాకింగ్ టూల్’గా; ‘లివింగ్ యానిమల్’గా ఫ్యాక్టరీల్లో 16 గంటలకు మించి పని చేయించింది. ఫలితంగా ఆకలి, రోగాల కంటే, నిద్ర చాలని కారణంగా అకాల మరణాలు జరిగిన దశ ఒకటుంది. అలా మరణించిన వారిని పశువుల శవాల్లా అవతలకు ఈడ్చివేసి రిజర్వుడ్ నిరుద్యోగులతో పని చేయించుకుంది. అలా పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ శవ రాశుల పునాది మీద బలపడింది.

1789 ఫ్రెంచ్ విప్లవం, 1886 మేడే పోరాటం మధ్య 97 ఏళ్ల వ్యవధి ఉంది. శతాబ్ది తేడాలో సంభవించిన రెండు ప్రాపంచిక ఘటనలు రెండు భిన్నమైన మానవ విలువల్ని అందించిన నేపథ్యం ఉంది. ఈ రెండింటికి కర్త పాత్రను మొదట సందర్భంలో రైతాంగం, తర్వాతి సందర్భంలో కార్మికవర్గం చేపట్టి విజయవంతం చేశాయి. ఆ కాలాల్లో వాటికి ఏఏ వర్గాల జనం కర్తలుగా మారినా, అవి అందించిన ఫలితాలు మాత్రం అంతిమంగా ఆనాటి సగటు సమాజాల విలువలుగానే మారాయి. ఆ విలువలను కోల్పోయే ప్రమాదం ఏర్పడితే ఆ నిర్దిష్ట వర్గాల ప్రజల వరకే పరిమితం కాకుండా మొత్తం ప్రజలు కూడా నష్టపోతారు. ఈ వెలుగులో మరో 8 గంటల పని దినానికి ఎదురయ్యే నేటి ప్రమాదం పట్ల సకల రంగాల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సి ఉంది.


మేడే పోరాటంతో దక్కిన 8 గంటల పని దినం కార్మికుణ్ణి మనిషిగా మార్చింది. పని, నిద్ర పోగా మరో 8 గంటలు కార్మికవర్గానికి దక్కింది. దీంతో భార్యాబిడ్డలతో కార్మికవర్గం సామాజికంగా వినోదభరిత జీవితాన్ని పొందింది. తద్వారా కార్మికుడు యంత్రంగా కాక, మనిషిగా రూపొందాడు. ఈ మరో 8 గంటల సాంఘిక జీవితం కార్మికవర్గాన్ని పూర్తి స్థాయిలో మార్చివేసింది.

వినోద జీవితం గడపడానికి సమయం దొరికిన తర్వాతనే నాటి ప్రజలందరి వలెనే తమ భార్యాబిడ్డలతో కార్మికవర్గం వీధుల్లో, పార్కుల్లో, వినోద క్రీడల్లో, పండగ పబ్బాలలో, సంబరాలలో, గ్రంథాలయాల్లో భాగమైంది. తన పూర్వ పశుబంధం స్థానంలో కొత్తగా మనిషిబంధం రూపొందింది. ఏ నిర్వచనాన్ని ఎవరు ఎలా ఇచ్చినా, వాస్తవ ఆచరణలో నాటి కార్మికుణ్ణి యాంత్రిక జీవితం నుండి వేరు పరిచింది మేడే పోరాటమే.

మేడే పేరు వింటే ఎర్రజెండా రెపరెపలు, జండా గద్దెలు, స్థూపాలంకరణలు, విప్లవ గానాలు, పోరాట నాదాలు, కార్మిక ప్రదర్శనలు, శ్రామికవర్గ కవాతులు, ప్రభాత భేరీలు, ఉద్వేగభరిత ప్రసంగాలు గుర్తుకు వస్తాయి. ఇంతకంటే భిన్నమైన మానవీయ కోణం కూడా మేడేలో దాగి ఉంది. దాన్ని ప్రాచుర్యంలోకి తేవడం నేటి తక్షణ, ప్రధాన కర్తవ్యం.


శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన నేపథ్యంలో నిజానికి 8 గంటల పనిదినం క్రమక్రమంగా 7 గంటల, 6 గంటల, 5 గంటల, 4 గంటల పనిదినంగా మారాలి. కానీ 8 నుండి 10, 12, 14, 15, 16 గంటలుగా మారడం ఏమిటి? కోవిడ్‌లో 12 నుండి 14 కోట్ల మంది వలస కార్మికుల వెతలు లోకం ఎదుట బహిర్గతమైనవి. భారత్‍లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉన్నది.

శారీరక శ్రమ చేసే కార్మికవర్గం మాటే కాదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగవర్గం మాట కూడా ఇదే! ఈ మానసిక శ్రమ చేసే ఉద్యోగ వర్గాలతో సైతం గతం కంటే ఎక్కువ గంటల పని చేయించే స్థితి ఏర్పడింది. ఇదెక్కడి వరకు వెళ్లిందంటే ఉన్నత విద్యావంతులే కాక, సాంకేతిక నిపుణులై అధిక రాబడి గల సాఫ్ట్‌వేర్ వంటి ఉద్యోగులు సైతం నేడు అధిక సమయం పనిచేయాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఐటి ఉద్యోగవర్గపు సాంఘిక జీవితం తీవ్ర కల్లోలభరితమవుతున్నది. వారు మానసిక రోగులుగా మారుతున్న దుస్థితిని చూస్తున్నాం. వారి వైవాహిక కుటుంబ జీవితంపై దుష్ప్రభావం పడుతోంది. ఎంత జీతాలు వచ్చినా సాంఘిక జీవితాన్ని కోల్పోతే సుఖం ఏమిటి? ఈ రోజు కార్మిక పోరాటం జీతభత్యాల వరకే పరిమితం కాక, పని గంటల సమస్యపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఈ కర్తవ్యం శ్రామికవర్గ, ఉద్యోగ సంఘాలపై ఉంది.

మేడే సందర్భంగా శ్రామికవర్గ సంస్థల నేతలు, ఆర్గనైజర్లు, కార్యకర్తలు ప్రత్యేక బాధ్యతని నిర్వహించాల్సి ఉంది. వారికి మేడే కార్మికవర్గ వ్యవహారంగా కాకుండా, యావత్తు సమాజ వ్యవహారంగా మార్చడానికి ఓ అవకాశం ఉంది. వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారు మేడేని విశాల ప్రజాల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ సావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇప్పటికే కొంత వైఫల్యం ఉంది. ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు సాటి శ్రామికవర్గ సహచరునిగా బాధతో పాటు విచారం వ్యక్తం చేస్తున్నాను.


పని గంటల కాలపరిమితి పెరిగిన మేరకు కార్మికవర్గం తమ సాంఘిక జీవితాన్ని కోల్పోతుంది. కారల్ మార్క్స్ చెప్పినట్లు కార్మికవర్గం తీవ్ర పరాయీకరణకి గురౌతుంది. తన ఎదుట గల అన్ని శక్తుల్ని శత్రువులుగా చూస్తోంది. ఆ అందరి దృష్టిలో కార్మికవర్గం కూడా తేలికైపోతుంది. దాన్ని వారు కూడా శత్రువుగా చూసే స్థితి ఏర్పడుతుంది. తుదకు ఆ నష్టం కేవలం కార్మికవర్గానికే పరిమితం కాకుండా మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ విధంగా దేశంలో నలభై కోట్లకి పైగా కార్మిక కుటుంబాలది యాంత్రిక జీవితంగా మారితే, భావి సామాజిక సంక్షోభస్థితి ఏ స్థాయిలో ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు. ఈ కారణంగా రేపటి సంక్షోభాన్ని నివారించడం కోసం కార్మిక కుటుంబాల్ని చైతన్యపరిచి పోరాటానికి సిద్ధం చేయడం ఓ కర్తవ్యం కావాలి. అందుకే 138వ మేడే సందర్భంగా కార్మికోద్యమ శక్తులతో పాటు ప్రజాతంత్ర, వామపక్ష, లౌకిక, ప్రగతిశీల శక్తులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

జీతభత్యాలు, సౌకర్యాలు, హక్కులు, జీవన ప్రమాణాలు, ఉద్యోగ భద్రత వంటి వివిధ కోర్కెల సాధనకై పోరాడుతూ అంతకంటే ప్రాధాన్యతని పని గంటలపై ఇవ్వాల్సి ఉంది. మన మీద ఇది చరిత్ర మోపిన బాధ్యత! రేపు ముందుకు వెళ్లాలంటే నేడు మనం వెనక్కి వెళ్లాల్సిందే. 2025 వైపుకూ, ఇంకా ముందుకూ వెళ్లాలంటే, మంచి భవిష్యత్తును మనం నిర్మించుకోవాలంటే, 1886 వైపుకు చూపును సారిద్దాం. చికాగో విప్లవ స్ఫూర్తిని పొంది ముందడుగు వేద్దాం.

పి. ప్రసాద్ఐ .ఎఫ్.టి.యూ.

Updated Date - May 01 , 2024 | 06:17 AM