Share News

మేడిగడ్డ పాట్లన్నీ అన్నారం, సుందిళ్లకూ తప్పవు!

ABN , Publish Date - May 01 , 2024 | 06:10 AM

రాష్ట్ర నీటి పారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) అన్ని డిజైన్లను సిద్ధం చేయడానికి కేంద్ర విభాగంగా ఉంటుంది. డిజైన్లపై తుది నిర్ణయం

మేడిగడ్డ పాట్లన్నీ అన్నారం, సుందిళ్లకూ తప్పవు!
హద్దు దాటిన పీడనం వల్ల ఇసుక హరించుకుపోయి బ్యారేజీ కుంగుతుంది.

రాష్ట్ర నీటి పారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) అన్ని డిజైన్లను సిద్ధం చేయడానికి కేంద్ర విభాగంగా ఉంటుంది. డిజైన్లపై తుది నిర్ణయం సీడీవోదే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వంటి బ్యారేజీలకు డిజైన్లు, డ్రాయింగ్‌లను తయారు చేసే సామర్థ్యం సీడీవో విభాగానికి పూర్తిగా ఉన్నది. అయితే ఈ సందర్భంలో సీడీవోకు డిజైన్ల తయారు చేసేందుకు తగినంత సమయం ఇవ్వలేదు. డ్రాయింగ్‌లను పునఃసమీక్షించడానికి లేదా సవరించడానికి తగినంత సమయం ఇవ్వకుండా అడపాదడపా మార్పులు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులు పలుమార్లు జోక్యం చేసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ యూనిట్‌తో పాటు కలిసి పని చేయడానికి సీడీవోను అనుమతించలేదు. దీనివల్ల డిజైన్లు, డ్రాయింగ్లలో లోపాలు ఏర్పడ్డాయి. అంతేగాక, ఆ డిజైన్లు, డ్రాయింగుల అమలు నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు.

నీటి పారుదల శాఖకు చెందిన సీడీవో విభాగం మూడు బ్యారేజీల హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లను చేపట్టింది. డిజైన్ డాక్యుమెంట్లు, డ్రాయింగ్స్‌‍‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. పైగా నీటీ పారుదల శాఖలో వివిధ యూనిట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సీడీవో ఇచ్చిన డ్రాయింగ్‌లను ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ సరిగ్గా అనుసరించలేకపోయింది. కొన్ని ఉదాహరణలను చూస్తే– బ్యారేజీ సైట్ వద్ద ఏదైనా డిజైన్, మోడల్ అధ్యయనానికి ప్రాథమికమైన గేజ్ డిశ్చార్జ్ కర్వ్‌ను ప్రాజెక్ట్ నిర్మాణ యూనిట్ లేదా సీడీవో యూనిట్ ధ్రువీకరించాలి. ఇక్కడ అది జరగలేదు. దిగువన ఉన్న ఆర్‌సిసి రాఫ్ట్ (raft) కాంక్రీట్ కోటింగ్‍ మూడు బ్యారేజీలలో అనేక చోట్ల చెల్లాచెదురుగా కనిపించింది. దీనికి డిజైన్లు, డ్రాయింగ్‌లలో లోపాలు, లోపభూయిష్టమైన నిర్మాణం కారణం.


ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్, నిర్మాణాల్లో సీడీవో ఎలాంటి పాత్ర పోషించలేదు. సీడీవో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూంటేనే అది ఇచ్చిన డిజైన్లను, డ్రాయింగ్లను ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ క్షేత్రస్థాయిలో సరిగా పాటిస్తున్నారో లేదో తెలుస్తుంది. నిర్మాణంలో ఉన్న బ్యారేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం సీడీవో పరిధిలో లేకపోవడం దురదృష్టకరం. అందువల్లనే సీడీవో విభాగం ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసిన బ్యారేజీలను అందుకు అనుగుణంగా నిర్మించలేదు. వాటిని రిజిడ్ స్ట్రక్చర్లుగా నిర్మించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో విభాగాల మధ్య అత్యుత్తమమైన సమన్వయం అవసరం. అది ఇక్కడ జరగలేదు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎగువ, దిగువ పైల్ కటాఫ్ లను రాఫ్ట్‌తో అనుసంధానం చేయగా, మేడిగడ్డ బ్యారేజీలో కనెక్షన్ జాయింట్‌ను ప్రధాన రాఫ్ట్ నుంచి వేరు చేశారు. మూడు బ్యారేజీల్లోని మిగతా అన్ని భాగాల డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పుడు ఈ ఒక్క విషయంలోనూ వేర్వేరు ఏర్పాట్లు చేయడంలో హేతుబద్ధత లేదు. ప్రాజెక్టు నిర్మాణ విభాగం చేసిన అభ్యర్థనలకు అనుగుణంగా సీడీవో విభాగం డిజైన్‌లో పలు మార్పులు చేసింది. ఆర్‌సిసి రాఫ్ట్‌లో స్తంభాల కింద ఉన్న లాక్స్‌ను తొలగించడం, రాఫ్ట్ లోతు పెంచడం, సిసి బ్లాక్‌ల సైజు పెంచడం... వంటివి కొన్ని ఉదాహరణలు. సీడీవో కోరిన అన్ని జియోటెక్నికల్ వివరాలను ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ యూనిట్ అందించి ఉంటే, సీడీవో ఇచ్చిన డిజైన్లు డ్రాయింగ్‌లను ప్రాజెక్టు నిర్మాణ విభాగం పూర్తిస్థాయిలో పాటించి ఉంటే అన్నీ సక్రమంగా జరిగేవి. ఈ రెండూ ఇక్కడ జరగలేదు. ఇందుకు కారణం ఉన్నతాధికారులు సీడీవోతో జోక్యం చేసుకోవడమే!


ముందుగా చెప్పినట్లుగా డీపీఆర్‌లో సూచించిన షీట్ పైల్స్‌ను డిజైన్ల సమయంలో సెకెంట్‌ పైల్స్‌గా మార్చారు. ప్రైమరీ (పీసీసీ), సెకండరీ (ఆర్సీసీ) సెకెంట్ పైల్స్ డ్రైవింగ్ నాణ్యంగా జరగాలంటే అందుకు సరైన ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. అలా జరిగితేనే సెకెంట్ పైలింగ్ ద్వారా సృష్టించబడిన కట్ ఆఫ్ గోడ నిలువుగా, గట్టిగా ఉంటుంది. ఈ మూడు బ్యారేజీల్లో నిర్మాణ కాలపరిమితిని అందుకోవడానికి, ముందుగా నిర్ణయించిన మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే పైల్స్‌ను నడపడానికి అనేక యంత్రాలను ఉపయోగించారు. ఒక చిన్న పొరపాటు పగుళ్ళకు దారితీయవచ్చు. ఎందుకంటే పైలింగ్‌లో నిమగ్నమైన ప్రతి బృందంలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరగవచ్చు. మెథడ్ స్టేట్‌మెంట్ ప్రకారం కటాఫ్ గోడల నీటిని ఆపే బిగుతును తనిఖీ చేయడానికి, నిర్ధారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

మూడు బ్యారేజీల విషయంలోనూ పలు కీలకమైన డాక్యుమెంట్లను నీటిపారుదల శాఖ ఆమోదించలేదు (ఉదా: క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్లాన్ అండ్ ఇన్‌స్పెక్షన్ అండ్ టెస్టింగ్ ప్లాన్, పరీక్షల ఫ్రీక్వెన్సీ, ఏజెన్సీ చేపట్టిన డిజైన్ మిక్స్, వివిధ పనుల మెథడ్ స్టేట్‌మెంట్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు). నీటి పారుదల శాఖకు నాణ్యత, నియంత్రణ యంత్రాంగాలను నిర్వహించడానికి తగినంత సామర్థ్యం లేదు. కేవలం పైపై పర్యవేక్షణ చేస్తూ నేరుగా నిర్మాణ సంస్థలకే ఈ బాధ్యత అప్పగించారు. అంటే తమ పనిని తనిఖీ చేసుకునే బాధ్యతను నిర్మాణ సంస్థలకే వదిలివేశారన్నమాట! ఇది తీవ్రమైన లోపం. బ్యారేజీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టులో క్వాలిటీ కంట్రోల్ అండ్ అస్యూరెన్స్ యూనిట్ మరింత క్రియాశీలకంగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకెంట్ పైల్‌తో కటాఫ్ గోడ నిర్మాణానికి సంబంధించిన నాణ్యతా నియంత్రణ పరీక్షలను క్వాలిటీ కంట్రోల్ యూనిట్ గానీ, నిర్మాణ సంస్థలు గానీ చేపట్టలేదు. నిర్మాణ సంస్థలు సమర్పించిన మెథడ్ స్టేట్‌మెంట్‌లో కూడా పైల్ కటాఫ్ గోడలకు నాణ్యతా నియంత్రణ, భరోసాలకు సంబంధించిన ప్రస్తావన లేదు.

నిష్క్రమణ (గ్రేడియంట్) లేదా అవశేష పీడనం విషమించినప్పుడు, ఇసుక కణాలు అవశేష పీడనం ద్వారా పైకి తోసుకుపోతాయి. ఈ ఇసుక d/s పైల్ పైన మరుగుతుంది. దీన్నే బాయిలింగ్ అంటారు. నియంత్రణలో లేని బాయిలింగ్ చివరకు పైపింగ్‌కు దారితీస్తుంది. అంటే దిగువ మట్టి హరించుకుపోయి క్రమంగా బ్యారేజీ కుంగిపోతుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇదే జరిగింది.


నిర్మాణం పూర్తయిన తర్వాత 2019లో మేడిగడ్డ రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేశారు. కట్ ఆఫ్ వాల్ దిగువన ఉన్న సీసీ బ్లాకుల దిగువ ప్రాంతంలో నీరు వెంటనే భూమి నుంచి బయటకు రావడం గమనించారు. అయితే జలాశయంలో నిల్వ ఉన్న నీటిని మరమ్మతుల కోసం ఖాళీ చేయకుండా నిర్దేశిత అవసరాలకు వాడుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం వల్ల రిజర్వాయర్ మరమ్మతులను నిర్వహించలేకపోయామని ప్రాజెక్టు నిర్మాణ విభాగం పేర్కొంది.

2019లో మొదటి వర్షాకాలం తర్వాత మూడు బ్యారేజీల్లో సీసీ బ్లాకులకు జరిగిన నష్టాన్ని ప్రాజెక్టు నిర్మాణ యూనిట్, నిర్మాణ సంస్థలు గమనించాయి. సంవత్సరాలపాటు మరమ్మత్తు జరగకపోవటం, క్రమబద్ధమైన నిర్వహణ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల క్రమంగా క్షీణతకు దారితీసింది. సంబంధిత అథారిటీ నుంచి అనుమతులు రాకపోవడంతో రిజర్వాయర్ మరమ్మతులకు నోచుకోలేదని సమాచారం. ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయంలో ఇది ఘోరమైన లోపం.

2019లో మొదటి వర్షాకాలం వచ్చిన వెంటనే మూడు బ్యారేజీల దిగువన సీసీ బ్లాకులకు జరిగిన నష్టం, బ్యారేజీల్లో ఇసుక పైపింగ్... ఇతర సమస్యలు క్రమంగా అభివృద్ధి చెందడం ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల దృష్టికి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఒకరికొకరు ఉత్తర ప్రత్యుత్తరాలు పంపుకోవడం మినహా అటు ఇరిగేషన్ అధికారులు గానీ, ఇటు నిర్మాణ సంస్థలు గానీ సమస్యలను పరిష్కరించడానికి, నష్టాన్ని సరిదిద్దడానికి ఎటువంటి చొరవా చూపించలేదు. దీంతో 2019 నుంచి సీసీ బ్లాకులు, ప్లింత్ స్లాబుల పరిస్థితి క్రమంగా క్షీణించింది. బీఐఎస్ స్టాండర్డ్ ఐఎస్.7349:2012 ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత బ్యారేజీకి దిగువన ఉన్న ఏప్రాన్ ప్రాంతాన్ని పరిశీలించాలి. కానీ ఇలా చేయకపోవడం వల్ల ఏటేటా క్షీణతకు దారితీసి, అంతిమంగా పెద్ద సెటిల్‌మెంట్ వైఫల్యంగా పరిణమించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యూనిట్ తన విధులు, బాధ్యతల్లో ఘోరంగా విఫలమైంది.


ప్రస్తుతం ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డ తరహాలోనే ఉన్నాయి. వాటి నిర్మాణ పద్ధతులు కూడా మేడిగడ్డ తరహాలోనివే. ఈ బ్యారేజీలు కూడా ఇప్పటికే మేడిగడ్డకు ఎదురైన ఎన్నో సమస్యలను చవి చూశాయి. దీనినిబట్టి మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్ నెం.7లో జరిగిన పైపింగ్, రాఫ్ట్ కింద ఖాళీ గొయ్యి ఏర్పడటం వంటి సమస్యలన్నీ ఈ బ్యారేజీల్లో కూడా ఏర్పడవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వైఫల్యం లాంటిదే అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీ విషయంలో కూడా జరిగే అవకాశం ఉన్నది.

ప్రస్తుతం ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డ తరహాలోనే ఉన్నాయి. వాటి నిర్మాణ పద్ధతులు కూడా మేడిగడ్డ తరహాలోనివే.

ఈ బ్యారేజీలు కూడా ఇప్పటికే మేడిగడ్డకు ఎదురైన

ఎన్నో సమస్యలను చవి చూశాయి. దీనినిబట్టి మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్ నెం.7లో జరిగిన పైపింగ్, రాఫ్ట్ కింద ఖాళీ గొయ్యి ఏర్పడటం వంటి సమస్యలన్నీ

ఈ బ్యారేజీల్లో కూడా ఏర్పడవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వైఫల్యం లాంటిదే అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీ విషయంలో కూడా జరిగే అవకాశం ఉన్నది.

వెదిరె శ్రీరామ్

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు

Updated Date - May 01 , 2024 | 06:10 AM