Share News

విద్యార్థుల గర్జన

ABN , Publish Date - May 02 , 2024 | 02:56 AM

గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలమీద పోలీసు దాడులు తీవ్రమవుతున్నాయి. ఆపాదమస్తకం రక్షణకవచాలు ధరించి, ఆయుధాలు, లాఠీలు చేబూనిన పోలీసులు...

విద్యార్థుల గర్జన

గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలమీద పోలీసు దాడులు తీవ్రమవుతున్నాయి. ఆపాదమస్తకం రక్షణకవచాలు ధరించి, ఆయుధాలు, లాఠీలు చేబూనిన పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్‌లలోకి చొరబడి విద్యార్థులను వెంటాడివేటాడి అరెస్టు చేస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రపంచమంతా చూస్తున్నది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మారుపేరుగా చెప్పుకొనే అమెరికాలో ఆ స్థాయిలో అణచివేత ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నది. నిరసన హక్కుకూ, భావప్రకటనా స్వేచ్ఛకూ దక్కుతున్న గౌరవాన్ని చూసి విస్తుపోతున్నది.


ఒక భయంకరమైన, అమానవీయమైన యుద్ధానికి వ్యతిరేకంగా యువత నోరువిప్పుతున్నందుకు, అపమని అడుగుతున్నందుకు అమెరికా ప్రభుత్వం, అక్కడి వ్యవస్థలు ఇంత వణికిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్రవాదులను అంతం చేస్తానంటూ గాజాలోకి ఇజ్రాయెల్‌ చొరబడినప్పుడు విద్యార్థులు ఇంతగా ఆగ్రహించలేదు. కానీ, ఈ ఆర్నెల్లకాలంలో అక్కడ జరిగింది మానవహననమే. నలభైవేలమందిని చంపేసి, లక్షలాదిమందిని నిరాశ్రయులను చేసి, ఆస్పత్రులను స్మశానాలుగా మార్చేసి, మిగిలినవారికి అన్నం నీరు దక్కకుండా చేసినా కూడా నెతన్యాహూ కసి ఇంకా చల్లారడం లేదు. వందలాదిమంది రోగులను కాల్చిచంపడమో, సజీవంగా పాతిపెట్టడమో జరిగిందని ఇటీవల ఇజ్రాయెల్‌ సేనలు వదిలిపెట్టిన రెండు ప్రధాన ఆస్పత్రుల పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో స్పష్టమైంది. గాజాలో ఇజ్రాయెల్‌ హమాస్‌ను అంతం చేయడం పేరిట జాతిహననానికి పాల్పడుతున్నది. ఇప్పటివరకూ సాగించిన ఘాతుకాలు చాలవన్నట్టుగా ఇప్పుడు రఫా నగరంలోకి ప్రవేశించి, అక్కడ తలదాచుకుంటున్న పదిలక్షలమందిని హతమార్చడానికి సిద్ధపడుతున్నది. ఇజ్రాయెల్‌ పాపాలు ఇలా పతాకస్థాయికి చేరిన తరువాతే అమెరికాలో విశ్వవిద్యాలయాలు వేడెక్కాయి. ఇజ్రాయెల్‌ దమనకాండనీ, దానికి అండదండలు దండీగా అందిస్తున్న అమెరికా సహా ఇతర అగ్రదేశాలను ప్రశ్నించడానికి మిగతా ప్రపంచం వణికిపోతున్న తరుణంలో, యుద్ధానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు.


అమెరికా విద్యాసంస్థలు యుద్ధంలో భాగస్వాములు కాకూడదని కోరుతున్నారు. అమెరికన్‌ యూనివర్సిటీలు వందలకోట్ల డాలర్లు ఆయుధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన లాభాలనూ వడ్డీనీ తన అవసరాలకు వాడుకుంటున్నందున, యుద్ధంతో లాభపడుతున్న ఆయా కంపెనీలనుంచి డబ్బు వెనక్కుతీసుకోవాలనీ, ఆ పాపపు సొమ్ము తమకు వద్దని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో అకడమిక్‌ సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కోరుతున్నారు. గతంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలకులతో సంబంధాలున్న సంస్థలనుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని, సంబంధాలు సైతం తెంచుకున్న చరిత్ర ఈ యూనివర్సిటీలకు లేకపోలేదు. కానీ, ఇప్పుడు ఈ విద్యార్థి నిరసనలమీద దుష్ప్రచారం అధికంగా చేస్తూ, దానిని యూదువ్యతిరేక ఆందోళనగానూ, మతోన్మాదుల, ఉగ్రవాదుల దుశ్చర్యగానూ చిత్రీకరించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. బయటివారు వచ్చి తమ విద్యార్థుల మనసుల్లో విషం నింపుతున్నారనీ, యూదులకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొడుతున్నారని ప్రకటించడం ద్వారా కొన్ని యూనివర్సిటీలు పోలీసుచర్యకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. నిరసనలను దీర్ఘకాలం వదిలివేస్తే, అవి ప్రశాంతంగా సాగినా కూడా ప్రమాదమేనని శ్వేతసౌధం భయపడుతోంది. ఇప్పటికే నిరసనలు యూరప్‌కు విస్తరించాయి, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత వేగంగా, తీవ్రంగా అణచివేత ఉండాలని, లేనిపక్షంలో అది తనకూ తన మిత్రదేశాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు ఉంది. ‘నువ్వు యుద్ధం చేస్తున్నది మా దేశాన్ని రక్షించడానికి కాదు, బందీలుగా చిక్కిన నా బంధువులను కాపాడటానికీ కాదు, నీ అధికారదాహానికి ఓ నమస్కారం, ఇక దిగిపో’ అని నెతన్యాహూకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో వేలాదిమంది నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. కానీ, అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్‌ దురాగతాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులకు శిక్ష తప్పడం లేదు.

Updated Date - May 02 , 2024 | 02:56 AM