Share News

సునాక్‌ ప్రణాళిక

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:58 AM

బ్రిటన్‌ పార్లమెంటు గతవారం ఆమోదించిన రువాండా బిల్లుతో కన్సర్వేటివ్‌ పార్టీమీద ప్రజాభిప్రాయంలో మార్పువస్తుందని, రాజకీయంగా బలహీనంగా ఉన్న బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌కు...

సునాక్‌ ప్రణాళిక

బ్రిటన్‌ పార్లమెంటు గతవారం ఆమోదించిన రువాండా బిల్లుతో కన్సర్వేటివ్‌ పార్టీమీద ప్రజాభిప్రాయంలో మార్పువస్తుందని, రాజకీయంగా బలహీనంగా ఉన్న బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌కు ఇది సానుకూలతను సాధించిపెడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. అక్రమవలసలతో సతమతమవుతున్న బ్రిటన్‌ను కాపాడుకోవడానికి దీనిని మించిన దారిలేదని వాదిస్తూ, బ్రిటన్‌లోకి చొరబడిన అక్రమ వలసదారులను ఆఫ్రికాదేశమైన రువాండాకు తరలించే విధానాన్ని రిషీ సునాక్‌ తీసుకువచ్చారు. విపక్షాలు అడ్డుపడినా, ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేస్తున్నా ఆయన వెనక్కుతగ్గలేదు. ఆశ్రయం కోరుతున్నవారిని మరోదేశానికి పంపించేయడం చట్టవిరుద్ధం, ఇది ఒక కొత్తతరహా అనుచిత విధానానికి అన్ని దేశాలను పురిగొల్పుతుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తుంది అని ఐక్యరాజ్యసమితి ఒక పక్క హెచ్చరిస్తుంటే, అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇంతకుమించిన అద్భుతమైన విధానం మరొకటి లేదు అని సునాక్‌ వాదిస్తున్నారు.


అనుకున్నదానికంటే ముందుగానే బ్రిటన్‌లో సోమవారం నుంచి గాలింపులు కూడా ఆరంభమైనాయని, అక్రమవలసదారుల వేట మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ ఆఫీసులముందు క్యూలు కడుతున్నవారిని సైతం దొరకబుచ్చుకుంటారట. దేశవ్యాప్తంగా ఓ రెండువారాల పాటు విస్తృతంగా గాలింపులు జరిపి అక్రమవలసదారులను అరెస్టులు చేసి, ప్రత్యేక శిబిరాలకు తరలించడం వంటి పనులు వేగవంతమవుతాయట. ఇంగ్లండ్‌లో గురువారం లోకల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి, ఉన్నవాటిలో సగం సీట్లను టోరీలు కోల్పోతారన్న ప్రచారమూ జరుగుతోంది. అక్రమవలసల నిరోధాన్ని టోరీలు ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల దృష్ట్యా కూడా వలసదారులమీద ప్ర‌భుత్వం అధికంగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇక, అక్రమవలసదారులతో నిండిన ఒకటి రెండు విమానాలు ఆరునూరైనా బ్రిటన్‌నుంచి నాలుగైదువారాల్లో బయలుదేరి రువాండాలో వాలాలని సునాక్‌ పట్టుదలగా ఉన్నారట. తరలింపు ఆరంభమైనపక్షంలో ప్రజల్లో టోరీలమీద నమ్మకం పెరుగుతుందని, మాటకు కట్టుబడినందుకు మెచ్చుకుంటారని సునాక్‌ నమ్మకం. డజను విమానాలు సిద్ధంగా ఉన్నాయి, దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారు ఇక విమానం ఎక్కి రువాండా పోవాల్సిందేనని ఆయన చెబుతున్నారు.


బ్రిటన్‌లోకి అక్రమవలసలు పెరుగుతున్నమాట నిజం. ఇంగ్లీష్‌ చానెల్‌ ఈదుతూ, పడవల్లో ప్రయాణిస్తూ వందలమంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తామంతా బ్రిటన్‌కు కాక, రువాండాకు తరలిపోతామన్న భయం ఉన్నప్పుడు వారు అంతటి సాహసానికి ఉపక్రమించరని, క్రిమినల్ గ్యాంగుల కార్యకలాపాలకు కూడా అడ్డుకట్టపడుతుందని సునాక్‌ వాదన. రువాండా ప్లాన్‌ భయంతో ఇప్పటికే చిన్నచిన్న పడవల్లో వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని టోరీలు చెప్పుకుంటున్నారు. వలసదారులను తరలించగలిగేంత సురక్షితదేశంగా రువాండాను పరిగణించలేమంటూ గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సునాక్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. దానిని దృష్టిలో పెట్టుకొని, ఆ ఆఫ్రికాదేశాన్ని సురక్షితమైనదిగా పేర్కొంటూ సేఫ్టీ ఆఫ్‌ రువాండా బిల్ తయారైంది. అక్రమంగా వచ్చేవారిని ఆరున్నరవేల కిలోమీటర్ల దూరంలోని ఈ దేశానికి విమానాల్లో తరలించి, రాజధాని కిగాలీలోని ప్రత్యేక శిబిరాల్లో ఉంచుతారు. దస్త్రాల పరిశీలనతో పాటు, న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి పాతికకోర్టు రూములు, నూటయాభైమంది న్యాయమూర్తులు అక్కడ ఉంటారు. దాదాపు మూడువందల మిలియన్‌ పౌండ్లను బ్రిటన్‌ ఇప్పటివరకూ ఈ వ్యవహారంకోసం ఖర్చుచేసింది. యుద్ధం, కరువు, తిరుగుబాట్లు, ఆకలి ఇత్యాది అనేకానేక సమస్యలతో తమదేశాలను వదిలి బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్నవారిని మరోదేశానికి తరలించేందుకు సునాక్‌ సిద్ధపడుతున్నారు. బ్రిటన్‌ వెళ్ళగొడుతున్నవారిని తనదేశంలో ఉంచుకొని పోషించేందుకు అంగీకరించి రువాండా ఆర్థికంగానూ ప్రయోజనం పొందుతోంది. నిజానికి, బ్రిటన్‌కు ఏటా అక్రమంగా వలసవచ్చేవారి సంఖ్యతో పోల్చితే, రువాండా ఆశ్రయం కల్పించబోయేవారి సంఖ్య చాలా తక్కువ. తమ దేశాల్లో పరిస్థితులను భరించలేక ప్రాణాలకు తెగించి మరీ బ్రిటన్‌ చేరుతున్న వలసదారులను ఈ నిర్ణయం భయపెడుతుందన్న నమ్మకమేమీ లేదు. శరణార్థుల విషయంలో జర్మనీ మాదిరిగా బ్రిటన్‌ ఉన్నతంగా వ్యవహరించడం లేదని, వలసదారుల ప్రాణాలను డబ్బుతో కొలుస్తూ, ఒక దుర్మార్గమైన దేశానికి వారిని అప్పగిస్తున్నదన్న అప్రదిష్ట, ఖజానాఖాళీకావడం వినా ఈ కార్యక్రమం బ్రిటన్‌కు ప్రయోజనం చేకూర్చదని కొందరి వాదన. రాజకీయంగా కష్టాల్లో ఉన్న సునాక్‌ను ఈ పథకం ఈ ఏడాది ఎన్నికల్లో ఒడ్డునపడేస్తుందో లేదో చూడాలి.

Updated Date - Apr 30 , 2024 | 02:58 AM