Share News

మారుతున్న మోదీ ప్రచార సరళి

ABN , Publish Date - May 01 , 2024 | 06:22 AM

దేశ రాజధాని ఢిల్లీ పొలిమేరల్లోని ఘజియాబాద్, ఎక్కడ చూసినా వేలాది అపార్ట్‌మెంట్లు, మాల్స్‌తో ఒక కాంక్రీట్ జంగిల్‌లా ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా

మారుతున్న మోదీ ప్రచార సరళి

దేశ రాజధాని ఢిల్లీ పొలిమేరల్లోని ఘజియాబాద్, ఎక్కడ చూసినా వేలాది అపార్ట్‌మెంట్లు, మాల్స్‌తో ఒక కాంక్రీట్ జంగిల్‌లా ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా ఎక్కువగా ఢిల్లీలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నా అత్యధికులు ఉత్తరప్రదేశ్ ఓటర్లే. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజు ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆటోలు, కార్లపై కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. దాదాపు ప్రతి అపార్ట్‌మెంట్‌లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామమందిరం కోసం ప్రజల శతాబ్దాల పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమంతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉత్కంఠతో విన్నారు. అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. పేదలకు అన్నదానాలు చేశారు. భారతదేశం పూర్తిగా మారిపోతోందన్న అభిప్రాయం ఈ దృశ్యాలు చూసినప్పుడు అనిపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశారు. ‘శ్రీరాముడు తన స్వంత నివాసానికి తిరిగి వచ్చారు. ఈసారి బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం’ అని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రసంగించారు.


కాని ఆశ్చర్యకరమేమంటే ఇదే ఘజియాబాద్‌లో ఏప్రిల్ 26న రెండవ విడత ఎన్నికల్లో గత మూడు ఎన్నికల్లో కంటే అత్యంత తక్కువ శాతం పోలింగ్ జరిగింది. అపార్ట్‌మెంట్లనుంచి జనం బయటికి రాలేదు. ఎందుకో గాని భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకున్న నగర ప్రజలు ఓటింగ్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగినప్పటికీ ఓటింగ్ శాతం 49.65 శాతానికి మించలేదు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను అంత ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు ఎందుకు అంతే ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారో బీజేపీ నేతలే కారణాలు చెప్పలేకపోతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికీ, రాజకీయాలకూ సంబంధం లేదని జనం భావించారో లేదో కూడా చెప్పలేం. అదే సమయంలో దేశంలో జరుగుతున్న రాజకీయాలను వారు చర్చించుకోవడం లేదని కూడా చెప్పలేము. అన్నిటికన్నా ముఖ్యం ఈ దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియను ప్రజలు అంత సీరియస్‌గా, చైతన్యవంతంగా తీసుకుంటున్నారా లేదా అన్నది చర్చనీయాంశం. ఎన్నికల పుణ్యమా అని వచ్చిన ఒక రోజు సెలవును విశ్రాంతిగా గడపకుండా ఎండన పడి ఓటింగ్‌కు ఎందుకు వెళ్లాలని భావించేవారు అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ సమయంలో గంటలు కొట్టించి, దీపాలు వెలిగించి, ‘గో గో కరోనా’ అన్న నినాదాలు చేయించిన, వాక్సినేషన్ సర్టిఫికెట్లపై కూడా తన ఫోటోను వేయించుకుని ప్రోత్సహించిన నాయకుడు ఎన్నికల పట్ల ప్రజలను ఎందుకు ఉత్తేజవంతుల్ని చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. అంత మాత్రాన ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్నీ పూర్తిగా విశ్వసించలేము. అదే సమయంలో తక్కువ శాతం పోలైనా ఆ ఓట్లన్నీ తమకేనని బీజేపీ నేతలు చెబుతున్న మాటల్నీ నమ్మడానికి వీల్లేదు. రెండింటి మధ్య సత్యం వేరే ఉన్నదని మాత్రం అనుకోవడానికి వీలుంది.


అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీకి తిరుగులేదని, ఆయనను ఓడించగల శక్తులు లేవనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. టీనా (దేర్ ఈజ్ నో అల్టర్‌నేటివ్– ప్రత్యామ్నాయం లేదు) అన్న ఒకే ఒక కారణంగా ఆయన అజేయుడనే అభిప్రాయం కలిగింది. ప్రతిపక్షాలు వివిధ రాష్ట్రాల్లో కొంత ఏకం అయినా మోదీని ఏమీ చేయలేరనే చాలా మంది భావించారు. ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లుగా మోదీ వ్యతిరేక చర్చ వేడెక్కింది. ప్రతిపక్షాలపై ఏజెన్సీల దాడులు, కేజ్రీవాల్ అరెస్టు తదితర పరిణామాలతో మోదీ ఏకపక్ష చర్యలు సరైనవా అన్న చర్చా మొదలైంది. తటస్థంగా ఉన్న వర్గాలు కూడా మోదీ విధానాలపై సందేహాలను వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. అయినప్పటికీ మోదీ విజయాన్ని అడ్డుకోవడం సాధ్యమా అన్న సందేహాలు ఇప్పటికీ మాయం కాలేదు. మోదీ అనుకున్నంతగా 400 సీట్లు సాధించలేకపోవచ్చేమో కాని ఆయన మళ్లీ ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు ఆపలేరనే అభిప్రాయం చాలా మందిలో మారలేదు. ఆయన శక్తియుక్తులను తక్కువ అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణం.


ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మోదీ ఎన్నికల ప్రచారం రకరకాల మలుపులు తిరుగుతోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ చేసిన నరేంద్రమోదీ ఆ విషయాన్ని కూడా రానురానూ ప్రస్తావించడం తగ్గించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే ఎన్నికల షెడ్యూలు ప్రకటించి ఉంటే బీజేపీ ఘనవిజయం సాధించేదనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కాని మోదీయే పూర్తిగా రామమందిరంపై దృష్టి కేంద్రీకరించకుండా తన స్వంత పేరుతో ప్రచారం ఉధృతం చేశారు. గత ఎన్నికల్లో చౌకీదార్ అని చెప్పుకున్న మోదీ ఈ ఎన్నికల్లో ‘మోదీ కా గ్యారంటీ’ అన్న పదాలకు విస్తృత ప్రాధాన్యత కల్పించారు. ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదు, ప్రచార ప్రకటనల్లోనూ మోదీ గ్యారంటీ అన్న పదాలను ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేలా చూసేందుకు ప్రయత్నించారు. వికసిత్ భారత్, అమృత కాల్, ఆత్మనిర్భర్, విశ్వగురు వంటి అంశాలను ప్రస్తావించి భారత్‌ను గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తుంది తానేనని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు నేరుగా అందేలా చేస్తోంది తానేనని మోదీ చెప్పుకున్నారు. ఇదే అంశంపై ఆయన ప్రచారం పూర్తిగా కొనసాగించి ఉంటే ఎన్నికలు ఆసక్తికరంగా మారేవి. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధినీ, పది సంవత్సరాల్లో మోదీ సాధించిన అభివృద్ధినీ బేరీజు వేసుకునేందుకు అవకాశం ఉండేది.


కాని క్రమంగా మోదీ ఈ ధోరణి కూడా తగ్గించి కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు పెంచారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే అందులో ఉన్న అంశాలపై తీవ్ర దాడులు చేయడం మొదలుపెట్టారు. తద్వారా మోదీ చేస్తున్న ఆరోపణలు నిజంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయా అన్న ఆసక్తి అనేకమందిలో పెరిగింది. తాము సామాజిక న్యాయం గురించి అద్భుతమైన ఎన్నికల ప్రణాళిక రూపొందించినా దానిపై జనం దృష్టి పెద్దగా పడడం లేదని మొదట్లో జై రాంరమేశ్, కొప్పుల రాజు వంటి నేతలు వాపోయేవారు. కాని ఉన్నట్లుండి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు ప్రచారాన్ని మోదీయే కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందర్నీ దోచి, మైనారిటీలకు పంచిపెడుతుందనే మోదీ చేసిన ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ మేనిఫెస్టోపై పలువురి దృష్టి మళ్లింది. దానిపై ఎన్నికల కమిషన్ బీజేపీకి నోటీసులు ఇచ్చిన తర్వాత విషయంపై మరింత చర్చ జరిగింది.


గత పదేళ్లుగా మోదీ హయాంలో కష్టించి సాధించామని బీజేపీ చెప్పుకుంటున్న విజయాలకు ప్రచారంలో క్రమంగా ప్రాధాన్యత తగ్గిపోతోంది. పెద్దనోట్ల రద్దు, నల్లధనానికి అడ్డుకట్ట వేయడం, పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ రద్దు, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ, జన్‌ధన్ యోజన, 80 కోట్లమందికి ఉచిత ఆహార ధాన్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై బీజేపీ నేతలు తక్కువగా మాట్లాడుతున్నారు. వాటి బదులు కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలకు మోదీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పిగొట్టేందుకు మోదీ, ఆయన అనుయాయులు రంగంలోకి దిగారు. ఈ అంశాలపై ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటడంలో కాంగ్రెస్ విజయవంతం కాగలిగిందా? లేకపోతే 2019 ఎన్నికల్లో కేవలం 52 సీట్లు సాధించిన కాంగ్రెస్‌కు మోదీ ఎందుకు ఎన్నికల ప్రచారంలో అంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఊసులో లేకుండా పోవాల్సిన పార్టీ మోదీ నాలుకపై పదే పదే ఎందుకు తచ్చాడుతోంది?


ఈ దేశ సంపద కొన్ని వర్గాల చేతుల్లోనే పరిమితం కాకుండా ప్రజలకు పంచడం గురించి రాజకీయ పార్టీలు హామీలు గుప్పించడం కొత్త విషయం కాదు. ప్రపంచంలో సంపద విషయంలో నెలకొన్న అసమానతలను థామస్ పికెటీ లాంటి ఆర్థికవేత్తలు ఎప్పుడో ప్రస్తావించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకువచ్చి ప్రజలకు పంచుతానని మోదీ 2014లో చేసిన ప్రచారం ఆయనకు ఎంతో జనాదరణ కల్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్ర ఏజెన్సీలు స్వాధీనపరుచుకున్న డబ్బును ప్రజలకు పంచిపెడతానని కూడా ఆయన ఇటీవల హామీ ఇచ్చారు. కాని గత పదేళ్లలో మోదీ సంపదను ప్రజలకు పంచారా, కొన్ని వర్గాలకు కేంద్రీకృతం చేశారా అన్న చర్చను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అదానీ, అంబానీలకు దోచి పెట్టారని రాహుల్‌గాంధీ ప్రతి సభలోనూ ప్రస్తావించారు. చివరకు సంపదను పంచడం గురించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. మోదీ ఈ చర్చను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్చడంలో ఎంతమేరకు సఫలీకృతులవుతారన్నది చెప్పలేం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధనవంతుల ఆస్తులను పేదలకు పంచుతారని, వారసత్వ పన్ను విధిస్తారని మోదీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారుతుందా లేదా సానుకూలంగా మారుతుందా అన్న అనుమానాలకు దారితీస్తోంది. ప్రైవేట్ ఆస్తులను ప్రజల ఆస్తులుగా పరిగణించేందుకు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39(బి)ని అన్వయించడంపై 9 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ కూడా ఇదే సమయంలో విచారణ జరుపుతుండడం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రభుత్వ ఏజెన్సీల దాడులు, కోర్టు కేసులు, పోలీసుల సమన్లు వంటి అంశాలను పక్కన పెడితే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లు, సంపదను పంచడం, అభివృద్ది, సంక్షేమం వంటి విషయాలపై చర్చ జరగడం ఆరోగ్యకరమైన పరిణామమే.

మోదీ ఎన్నికల ప్రచారం రకరకాల మలుపులు తిరుగుతోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ చేసిన నరేంద్రమోదీ ఆ విషయాన్ని రానురానూ ప్రస్తావించడం తగ్గించారు.

తన స్వంత పేరుతో ప్రచారం ఉధృతం చేశారు. గత ఎన్నికల్లో చౌకీదార్ అని చెప్పుకున్న మోదీ ఈ ఎన్నికల్లో

‘మోదీ కా గ్యారంటీ’ అన్న పదబంధానికి విస్తృత ప్రాధాన్యం కల్పించారు.

అభివృద్ధి అంశంపై ఆయన ప్రచారం

పూర్తిగా కొనసాగించి ఉంటే ఎన్నికలు ఆసక్తికరంగా మారేవి. మోదీ క్రమంగా

ఈ ధోరణినీ తగ్గించి కాంగ్రెస్‌పై విమర్శలు ముమ్మరం చేశారు.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - May 01 , 2024 | 06:22 AM