Share News

దగ్ధ వనాలు

ABN , Publish Date - May 01 , 2024 | 06:05 AM

ఉత్తరాఖండ్‌లో అడవులు తగలబడుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నాలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ, కొత్తకార్చిచ్చులు పుట్టుకొస్తున్నాయి.

దగ్ధ వనాలు

ఉత్తరాఖండ్‌లో అడవులు తగలబడుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నాలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ, కొత్తకార్చిచ్చులు పుట్టుకొస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే భారీ, అతిభారీ దావానలాల సంఖ్య ఈ ఏడాది ఎక్కువగా ఉంది. గత పదిరోజుల్లో రెండువందలకు పైగా తీవ్రస్థాయి కార్చిచ్చులు నమోదైతే, గత ఏడాది ఇదే కాలంలో పదకొండుమాత్రమే నమోదైనాయట. మంటలు ఆర్పేందుకు, వ్యాప్తిని నిరోధించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో విశ్వప్రయత్నం చేస్తున్నది. హెలికాప్టర్లు బాంబీ బకెట్లతో నీళ్ళు కుమ్మరిస్తున్నాయి. అయినప్పటికీ, విద్యాలయాలకూ, జనావాసాలకు కూడా ఈ కార్చిచ్చుల బాధ తప్పడం లేదని వార్తలు వస్తున్నాయి.


ఈ కార్చిచ్చులమీద సర్వోన్నత న్యాయస్థానం ముందు మూడేళ్ళుగా నాలుగుపిటిషన్లు విచారణకోసం ఎదురుచూస్తున్నాయని, వాటిని వెంటనే స్వీకరించాలని సోమవారం ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రధాన న్యాయమూర్తికి మొరబెట్టుకుంది. వేలాది హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి అయిపోతున్నదని, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారమే యాభైవేల హెక్టార్ల అడవి తగలబడిపోయిందని ఈ సంస్థ తన బాధ వ్యక్తంచేసింది. ప్రకృతికంటే మానవకార్యకలాపాలే ఈ దావానలాలకు ముఖ్య కారణమని ఆ సంస్థ ఆరోపిస్తున్నది. 2019లో ౨,981 హెక్టార్లు తగలబడితే, ఆ మరుసటి ఏడాది, అంటే కరోనా ఆంక్షలు అమలులో ఉన్నప్పుడు 172 హెక్టార్లు మాత్రమే అగ్నికి ఆహుతి అయిన విషయాన్ని ఈ సంస్థ చీఫ్‌జస్టిస్‌ దృష్టికి తీసుకువచ్చింది. ఈ డేటాను లోతుగా గమనించినప్పుడు, 2021లో 3,576 హెక్టార్లు, 2022లో 3,425 హెక్టార్లు మంటల్లో మాయంకావడం ఆశ్చర్యం కలిగించదు. ఏటా ఫిబ్రవరినుంచి దావానలాలు ఆరంభమవుతాయి కనుక ఆర్నెల్లు ముందునుంచే నిర్దిష్టమైన చర్యలతో వాటిని నియంత్రించవచ్చునని పిటిషన్‌దారు వాదన.


కార్చిచ్చులపై పిటిషన్లను సత్వరమే విచారణకు చేపడతామన్న చంద్రచూడ్‌ హమీని అటుంచితే, ఈ దావానలాలకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. స్థానికులు, పర్యాటకులు కాలుతున్న సిగరెట్లను నిర్లక్ష్యంగా విసిరేయడం, ఎక్కడపడితే అక్కడ వండుకొని, నిప్పు సరిగా ఆర్పకపోవడం, వ్యవసాయక్షేత్రాల్లో వ్యర్థాలను తగలబెట్టడం ఇత్యాది చర్యలతో పాటు, స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగా అడవులకు నిప్పంటిస్తున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటూ, వాతావరణం మరింత పొడిగా మారిపోయిన నేపథ్యంలో కార్చిచ్చుల సంఖ్య పెరిగివుండవచ్చు. కానీ, వేసవి ప్రవేశం కంటే ముందుగానే వందలాది హెక్టార్ల అడవి నాశనమైన అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పును పూర్తిగా వాతావరణ మార్పులమీదకు నెట్టివేయడం సరికాదు. మనిషి అత్యాశకు అడవులు బలైపోతుంటే, మానవ నిర్లక్ష్యం కారణంగా పెరిగిన భూతాపం మిగిలిన వనాలను మింగేస్తోంది.


కార్చిచ్చు ఘటనల సంఖ్య ఉత్తరాఖండ్‌లో గత రెండుదశాబ్దాల్లో బాగా పెరిగాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో అడవుల విధ్వంసం ఒకపక్కన జరిగిపోతుంటే, పర్యాటకాన్ని పెంచడం, అభివృద్ధి సాధించడం పేరిట చేపట్టిన చర్యలు మరింత నష్టాన్ని చేకూర్చుతున్నాయి. అడవుల నిర్వహణలో స్థానికుల పాత్ర గతంతో పోల్చితే బాగా తగ్గిపోయిందని, దావానలాలను అరికట్టడంలో పూర్వపు తరాలవారు ప్రదర్శించిన చొరవ ఇప్పటివారిలో లేకుండాపోయిందని, ప్రభుత్వాలు సైతం ప్రజా‌భాగస్వామ్యం విషయంలో శ్రద్ధచూపడం లేదని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. 90శాతం కార్చిచ్చులు మానవ ప్రేరేపితాలేనని అంటున్నప్పుడు, వాటిని నివారించడానికీ, నిరోధించడానికీ స్థానికుల సాయం చాలా అవసరం. వేసవి సమీపించి, వేడి పెరిగి, వాతావరణం పూర్తిగా పొడిబారి అగ్గిరాజుకున్న తరువాత ప్రజలను హెచ్చరించడమో, అభ్యర్థించడం కాక, ముందుగానే వారి భాగస్వామ్యంతో నివారణ చర్యలు ఆరంభం కావాలి. ఎండుటాకులనుంచి పైన్‌ వృక్షాల వరకూ అగ్గిపుట్టించే ఏ అంశాన్నీ వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెబ్బయ్‌శాతం అడవులున్న ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో దావానలాలను సమర్థంగా ఎదుర్కోవడానికి సిబ్బందికి ఆధునిక పరికరాలు ఉండాలి, ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరగాలి.

Updated Date - May 01 , 2024 | 06:05 AM