Share News

బర్మాతో జాగ్రత్త!

ABN , Publish Date - May 03 , 2024 | 04:51 AM

అంతర్యుద్ధం జరుగుతున్న మయన్మార్‌లో సైనికప్రభుత్వం బాగా బలహీనపడిందని, పరిస్థితులు సైన్యానికి అనుకూలంగా లేవని థాయ్‌లాండ్‌ ప్రధాని ఇటీవల ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు...

బర్మాతో జాగ్రత్త!

అంతర్యుద్ధం జరుగుతున్న మయన్మార్‌లో సైనికప్రభుత్వం బాగా బలహీనపడిందని, పరిస్థితులు సైన్యానికి అనుకూలంగా లేవని థాయ్‌లాండ్‌ ప్రధాని ఇటీవల ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మయన్మార్‌తో సరిహద్దులు పంచుకుంటున్న పొరుగుదేశం అధినేత చేసిన ఈ వ్యాఖ్య యుద్ధ తీవ్రతకు అద్దంపడుతున్నది. గత ఏడాది చివరి మాసాల్లో ఆరంభమైన ఈ తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకొని, అద్భుత విజయాలను సాధిస్తోందని మయన్మార్‌కు ఆవల, సైనిక జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రవాస ప్రభుత్వ ప్రతినిధులు చాలాకాలంగా అంటున్నారు. అది నిజమేనని ఇప్పుడు దేశంలోపల ఉంటున్న పాత్రికేయులు, పౌరసమాజ ప్రతినిధులు కూడా ధైర్యంగా చెబుతున్నారు. సైనిక ప్రభుత్వం రోజులు లెక్కబెట్టుకుంటోందని, అది పతనమైన అనంతరం దేశంలో ఎటువంటి వ్యవస్థ ఏర్పడాలనే విషయంమీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

సైనిక ప్రభుత్వంమీద పోరాడుతున్న సకల శక్తులూ భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయన్న మాటలో అతిశయోక్తి ఉండవచ్చును గానీ, మయన్మార్‌లో దాదాపు అరవైశాతం భూభాగం సైన్యం ఏలుబడిలో లేదన్నది మాత్రం నిజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సైనిక ప్రభుత్వం తన ఆధిపత్యం కోసం ఏర్పాటు చేసుకున్న అన్ని వ్యవస్థలనూ తిరుగుబాటుదారులు దెబ్బతీసి, తమ అధీనంలోకి తెచ్చుకున్నారని, కొన్ని ముఖ్యపట్టణాలు మాత్రమే సైన్యం నియంత్రణలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చాలా మిలటరీ స్థావరాలు, ఔట్‌పోస్టులు సైన్యం చేతుల్లోనుంచి జారిపోయాయి. మయన్మార్‌–థాయ్‌లాండ్‌ సరిహద్దుల్లోని కీలకనగరాలు తిరుగుబాటుదారుల వశమవుతున్నందువల్లనే థాయ్‌ ప్రధాని ఆ వ్యాఖ్య చేసివుండవచ్చు. పెద్దసంఖ్యలో సైనికులు మరణించడం, యుద్ధభూమినుంచి పారిపోవడం, శత్రువులకు లొంగిపోవడం లేదా వారితో చేరిపోవడం ఇత్యాదివి సైనిక ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. కొత్తవారితో సైన్యాన్ని భర్తీచేసుకొనేందుకు మయన్మార్‌ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఏసి) లేదా జుంటా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాన్నివ్వడం లేదు. విధిగా సైన్యంలో చేరాల్సిందేనని ప్రత్యేక ఆదేశాలు యువతను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.


ప్రజలు ఎన్నుకున్న ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలటరీ ఈ అతిపెద్ద తిరుగుబాటును తట్టుకోలేకపోతున్నది. త్రీ బ్రదర్‌ హుడ్‌ అలయెన్స్‌ పేరిట మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య ఆర్మీ, అరాకన్‌ ఆర్మీ, తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ కలసికట్టుగా ఆరంభించిన ఈ పోరాటం అనంతరకాలంలో మరిన్ని జాతులు, గ్రూపుల చేరికతో ఇంకా బలపడింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేసినందుకు సైనికప్రభుత్వంపై ఆగ్రహించి ఆయుధాలు చేపట్టినవారు కూడా అనేకమంది. గతంలో మిలటరీతో సయోధ్యగా ఉన్న వివిధ జాతులు, తెగలు కూడా ఈ యుద్ధకాలంలో ప్రత్యర్థులతో కలిసిపోవడంతో మిలటరీ పాలకులు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బలు తింటున్నారు. అనాదిగా వేర్వేరు లక్ష్యాలతో పోరాటాలు చేస్తున్న గ్రూపులన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి మిలటరీని దించాలన్న లక్ష్యంతో ఒక్కటైనాయి. వ్యాపార వాణిజ్యమార్గాలు కూడా తిరుగుబాటుదారుల అధీనంలోకి పోతున్నందున పొరుగుదేశాలతో సాగే వాణిజ్యం కూడా ప్రభావితమవుతున్నది.


మయన్మార్‌ సైనిక ప్రభుత్వంతో లోపాయికారీగా సయోధ్యతో వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం ఈ పరిణామాలపై బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు. తిరుగుబాటుదారుల ధాటీని తట్టుకోలేక భారతదేశంలోకి పారిపోయివస్తున్న మయన్మార్‌ సైనికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వారికి తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చి, తిరిగి సరిహద్దులు దాటిస్తున్నప్పటికీ, ఆంగ్‌సాన్‌ సూకీని అష్టకష్టాలూ పెడుతున్న మిలటరీ ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తప్పడం లేదు. భారత ప్రభుత్వం ఈ కష్టకాలంలో తమకు అండగా నిలవడం లేదని మిలటరీ పాలకులకు కూడా ఆగ్రహం కలుగుతున్నదట. మరోపక్క, ఈ సైనిక ప్రభుత్వం పని అయిపోయిందనీ, తమను అధికారికంగా గుర్తించాలని ప్రవాస యూనిటీ గవర్నమెంట్‌ ప్రతినిధులు భారత్‌ సహా చాలాదేశాలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. దేశరాజధానిలోని సైనికస్థావరాలమీదే డ్రోన్‌దాడులు చేయగలిగేస్థా‌యికి పోరాటం చేరుకున్న తరుణంలో, పొరుగుదేశం పరిణామాలు కచ్చితంగా భారత్‌కు ఇబ్బంది కలిగించేవే.

Updated Date - May 03 , 2024 | 04:51 AM