Share News

రాజభోగం

ABN , Publish Date - May 05 , 2024 | 12:21 AM

రాజులను చారచక్షువులంటారు. అంటే రాజుకు గూఢచారులే కళ్ళు అన్నమాట. రాజుకు గూఢచారులే చూసి పెడతారు. మంత్రులే ఆలోచించి పెడతారు. సైన్యాధిపతులే యుద్ధాలు చేసి పెడతారు...

రాజభోగం

అన్ని పనులూ స్వయంగా చేసుకునేవాడు రాజెందుకవుతాడు?

రాజులను చారచక్షువులంటారు. అంటే రాజుకు గూఢచారులే కళ్ళు అన్నమాట. రాజుకు గూఢచారులే చూసి పెడతారు. మంత్రులే ఆలోచించి పెడతారు. సైన్యాధిపతులే యుద్ధాలు చేసి పెడతారు. మంత్రులు, సైన్యాధిపతులు కలిసి రాజ్యాలు జయించి పెడతారు. కవులు కావ్యాలు రాసి పెడతారు. వందిమాగధులు కీర్తిని సంపాదించి పెడతారు. అంటే కీర్తిని కూడా స్వయంగా సంపాదించుకోనక్కరలేదు.

విచిత్ర వీర్యుడి లాంటి వ్యసనపరుడికి భీష్ముడి లాంటి నమ్మిన బంటులు స్వయంవరాలకి వెళ్లి అందమైన రాకుమార్తెలను లాక్కొచ్చి పెళ్ళి చేస్తారు. వాడు చస్తే సంతానాన్ని కూడా సప్లై చేస్తారు చచ్చినోడి ఎకౌంట్‌లో. గుడ్డి పెళ్ళికొడుకుని చూపించకుండా, గుడ్డివాడని చెప్పకుండా గాంధార దేశం లాంటి దూరదేశం నుంచి గాంధారి లాంటి అందమైన రెడీమేడ్‌ అమాయక పతివ్రతను తెచ్చి పెళ్ళి చేస్తారు. అనుభవించడమే గుడ్డి రాజు పని. రాజ్యమును భోగించడమే అతడి పని. దుర్యోధనుడి లాంటి ఆశబోతు తన భోగం కోసం పదిహేను అక్షౌహిణుల జనాన్ని చంపి, ఆ తర్వాత చిట్టచివరికి తను చచ్చాడు.


రాజుకు పిండివంటలన్నీ రుచి చూసి పెట్టే వాళ్ళు ఉంటారు. ఏమో ఎవరైనా విషం కలిపారేమో... డేంజరు కదా! టేస్టర్లు టేస్ట్‌ చేసి ఓకే అన్న తర్వాతే రాజు తింటాడు. రాజు బతికుండగా స్వయంగా చేసుకునేవి ఆహార నిద్రా మైథునాలే. అన్నీ అయ్యాక చివరికి చావడం మాత్రం స్వయంగా చేయక తప్పదు. అయినా రాచపీనుగు ఒంటిగా పోదు. తోడుగా ఇంకొక బంటు శవాన్ని శ్మశానానికి పంపుతారు.

నేనేదో వేళాకోళంగా అంటున్నాననుకోకండి. ఇప్పుడూ అటువంటి ‘పాలకులు’ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కనుక రాజులకు బదులు మంత్రులున్నారు. వీళ్ళల్లో కూడా చాలామందికి భోగించడమే పని. అన్ని పనులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళ తరపున సంతకాలు చేసి, సాక్ష్యాలు చెప్పి, జైళ్ళకి పోయేవాళ్ళు ఉంటారు. పరిహారంగా ఎంగిలి చేయి విదిలిస్తారు. హత్యలైతే యావజ్జీవ కారాగార శిక్షలు కూడా అనుభవిస్తారు.

స్వయంగా యుద్ధం చేసేవారు, స్వయంగా కవిత్వం రాసేవారు, స్వయంగా పాలన చేసేవారు కృష్ణదేవరాయల్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు.


మనం చేసుకోలేని పనిని డబ్బిచ్చి ఎవరి చేతనో చేయించుకుంటాం. వండుకోలేకపోతే వండిపెట్టే వాళ్ళని, గిన్నెలు తోమిపెట్టే వాళ్ళని, ఇల్లూడ్చిపెట్టే వాళ్ళని కిరాయికి తెచ్చుకుంటాం. రాజస్థాన్‌లో అయితే ఏడ్చేవాళ్ళు కూడా దొరుకుతారట. రాజులు, జమీందార్ల ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తాము ఏడవకుండా తమ బదులు ఏడ్చేవాళ్ళని కిరాయికి తెచ్చుకుంటారు. అలా ఏడ్చేవాళ్ళని (ఆడ వాళ్ళని) ‘రుదాలీ’ అంటారు. రోగమొచ్చి, ఓపికలేక మూలుగు వస్తే మూలిగేవాళ్ళని కూడా కిరాయికి తెచ్చుకుంటారేమో అక్కడ! ‘రుదాలీ’ల గురించి కల్పనా లాజ్మి అనే ఆవిడ హిందీలో సినిమా తీసింది. 1992లో ఆ చిత్రం విడుదలైయింది.

ఈ వ్యాసంలో ఇంతవరకు చెప్పినవి చాలామందికి తెలిసిన విషయాలే. కాని, మన సంగీత సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు, పండితులు చెప్పిన మాటలన్నీ నిజాలేనని నమ్మవలసి వస్తే మన దేశంలోనే కాదు యావత్‌ ప్రపంచంలోనే కంఠీరవ రాజు వంటి అసాధారణ ప్రజ్ఞావంతుడు ఇంతకు ముందు పుట్టలేదు, ఇకముందు పుట్టబోడు. అంతటి అదృష్టవంతులు కూడా ఉండరు. ఇంతకీ ఎవరా ‘మహా’ పురుషుడు? అతడి పూర్తి పేరు కంఠీరవ నరసరాజు. క్రీస్తు శకం 1704 నుంచి 1713 వరకు మైసూరును పరిపాలించిన రాజు. అతడి గురించి ప్రత్యేకంగా మహాద్భుత విశేషంగా చెప్పుకోవలసినదేమిటంటే అతడు పుట్టు మూగవాడు, పుట్టు చెవిటివాడు. మూకరసు (మూగ రాజు) అనేది అతడి నామాంతరం. మాతృభాష కన్నడం అయినప్పటికీ సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తెలుగు, తమిళం భాషలలో యక్షగానాలు ఇతర కవితా రచనలు చేశాడట. అంతేకాదు సంగీత నాట్యాలలో విశారదుడట. ‘వినికిడి’, ‘పలుకుబడి’ అసలే లేని ఈ రాజు కేవలం హస్తసంజ్ఞలతోనే పదేళ్లు ప్రజారకంగా రాజ్యపాలన చేశాడట.

పుట్టుకతోనే మూగవాడు, చెవిటివాడు అయిన తాను సంగీత సాహిత్య నృత్య కళల సమాహారమైన యక్షగానాలు రచించాడు అని చెప్పుకుంటే జనం తన మొహం మీద కాకపోయినా చాటుగానైనా నవ్వుకుంటారేమోనన్న అనుమానం అతడికి రాలేదు. వచ్చినా ‘డోంట్‌ కేర్‌. అయితే ఏంటంటా’ అనుకున్నాడు. ఈ రాజు మీద సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు నిడదవోలు వెంకటరావు గారు ఏడు దశాబ్దాల క్రిందట 1952లో ‘భారతి’ సాహిత్య పత్రిక రెండు వరుస సంచికలలో సుదీర్ఘ వ్యాసం రచించారు. ఆ వ్యాసాన్ని ‘స్వరార్ణవం’ మొదటి సంపుటంలో ప్రచురించాం. నిడదవోలు వారి వ్యాసంలో కొద్ది వాక్యాలు మచ్చుకు–


‘‘....సాహిత్య పథకము యొక్క పరిణామమును సంగీత సాహిత్యములకు గల పరస్పర సంబంధమును వ్యక్తము సేయుచు, నంధ్రతాముద్రను ప్రదర్శించు నీయక్షగానములు మిక్కిలి సూక్ష్మముగా పరిశీలింపదగినవి. అట్టివానిలో నీవఱకు పరిశోధకుల కెఱుగ రాకుండ కాల గర్భము నణగియున్న కంఠీరవ రాజు యక్షగానకృతులను గూర్చి, పదములను గూర్చి నేడు తెలుపుచున్నాను’’.

‘‘.... ఇతడు పుట్టుకచే మూగవాడును, చెవిటి వాడునై యుండెను. అందుచే నీతనికి ‘మూకరసు’ అను నామాంతరము. కేవలము హస్తసంజ్ఞల తోడనే రాజ్య కార్యములను నిర్వహించెడివాడు. అయితే భగవంతుడేదేని యంగవైకల్యమును గలిగించినప్పుడా వ్యక్తికేదేనొక విలక్షణమైన శక్తిని ప్రసాదించును. కంఠీరవ రాజునకు కమనీయమగు కవన శక్తియేగాక బహుభాషా వేతృత్వమును పరమేశ్వరుడు ప్రసాదించినాడు. ఇతని యక్షగాన రచనముల మూలమున నితడు సంగీత సాహిత్య నాట్య విద్యలందు నేర్పరియగుటతో పాటు సంస్కృతమున, ప్రాకృతమున, మాతృభాషయగు కన్నడమున, తెనుగున, తమిళమున కవితారచన చేయగలవాడని విశదమగుచున్నది. ఈతని విద్యా విశేషము మైసూరు చరిత్రకారులెవ్వరును నీవఱకు గుర్తించియుండలేదు.

‘‘ఈ యక్షగాన రచనల వలన నీతడు దక్షిణాంధ్ర వాఙ్మయముననేకాక యాంధ్ర వాఙ్మయమున గల రాజకవులలోనొక ‘ప్రశస్తకవిగా నెన్నదగినవాడు’’.

అదీ సంగతి –

కంఠీరవ రాజుతోపాటు నిడదవోలు వారి ‘ప్రతిభ’ను మెచ్చుకోవాల్సిందే.

నం.పా.సా

Updated Date - May 05 , 2024 | 12:21 AM