Share News

మధ్యతరగతీ ఎక్కడికి నీ ప్రయాణం!

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:13 AM

పుర్రెకో బుద్ధి–జిహ్వకో రుచి అనేది మనిషి విశిష్టతను చెప్పే ఒక సామెత. అన్ని సంస్కృతుల్లోనూ ఇలాంటి సామెతలు కచ్చితంగా ఉంటాయి. విశిష్టతతో పాటు మనిషికి సాధారణ ప్రవర్తనా ఉంటుంది

మధ్యతరగతీ ఎక్కడికి నీ ప్రయాణం!

పుర్రెకో బుద్ధి–జిహ్వకో రుచి అనేది మనిషి విశిష్టతను చెప్పే ఒక సామెత. అన్ని సంస్కృతుల్లోనూ ఇలాంటి సామెతలు కచ్చితంగా ఉంటాయి. విశిష్టతతో పాటు మనిషికి సాధారణ ప్రవర్తనా ఉంటుంది. సాధారణ ఆలోచనా రీతీ ఉంటుంది. సమాజ మనుగడకు ఇదే కీలకం. సాధారణ ప్రవర్తన లోపిస్తే మనుషుల మధ్య బంధమే ఏర్పడదు. ప్రతి విషయంలోనూ మనుషులు పరస్పరం పొసగని రీతిలో వ్యవహరిస్తే సామాజిక జీవితం సాధ్యంకాదు. కాలక్రమంలో మనుషుల మధ్య విపరీత అంతరాలు ఏర్పడి అసమానతలు తలెత్తిన తర్వాత వర్గాలు, తరగతులుగా మనుషుల స్వభావాలను అంచనా వేయటం మొదలైంది. కార్మికులు, రైతులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, భూస్వాములు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు, మధ్య తరగతి... ఇలా సమాజంలో ఎన్నో సమూహాలు ఉంటాయి. సామాజిక, ఆర్థిక, విద్యా స్థాయిలో కాస్త అటుఇటుగా సమానస్థాయి ఉన్న ప్రజలను భిన్న వర్గాలుగా, తరగతులుగా పరిగణిస్తారు.


అన్ని దేశాల్లోలాగే మన సమాజంలోనూ ఈ వర్గాలు ఉన్నా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నది మధ్యతరగతి గురించే. మధ్యతరగతి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆర్థిక విధానాలు ఎక్కువగా వారిని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయి. వార్తా, వినోద మాధ్యమాల గురీ మధ్యతరగతి పైనే. విదేశీ విలువల అనుకరణలో ముందున్నదీ ఈ తరగతే. కొత్త వస్తువులు, పరికరాల కోసం పరుగులెత్తేది ఈ వర్గమే. సోషల్‌ మీడియాను విపరీతంగా ఉపయోగించేది వీరే. అంతెందుకు 2014 నుంచి రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నదీ ఈ వర్గమే. ఇన్ని విధాలుగా ప్రాధాన్యం కలిగిన ఈ వర్గం స్వభావం గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. హిందూత్వ ప్రభావానికి బలంగా లోనవుతున్నది ఈ వర్గమే. మత అసహనమూ ఈ వర్గం నుంచే ప్రధానంగా వ్యక్తమవుతోంది. లౌకిక విధానం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధపాలన భవిష్యత్తు ప్రధానంగా ఈ వర్గం ప్రవర్తన, ఆలోచనా ధోరణులపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి ఈ వర్గం గురించి సమతూక దృష్టితో పరిశీలనలు చేసిన వారిలో సురీందర్‌ ఎస్‌. జోధ్క ఒకరు. అసీం ప్రకాష్‌తో కలిసి రాసిన ‘ద ఇండియన్‌ మిడిల్‌ క్లాస్‌’ అనే పుస్తకంలో మధ్యతరగతి స్వభావాన్ని లోతుగానే విశ్లేషించారు. ఆర్థికంగా పైకి ఎదగటానికి ఈ వర్గం చేస్తున్న ప్రయత్నాలు, ఆదాయాన్ని ఖర్చుపెడుతున్న తీరు, కొత్త విషయాలకు ఆహ్వానం పలకటం, నాయకత్వ లక్షణాలు, అవకాశాల కోసం దేశం లోపలా వెలుపలా చేసే అన్వేషణలు, పాలనా సంస్కరణల కోసం పట్టుపట్టటం, అవినీతిపై ప్రదర్శించే వైఖరి... ఇలా మధ్యతరగతికి మక్కువైన విషయాలపై చాలామంది రాశారు. ఏ తరగతీ శూన్యం నుంచి ఊడిపడదు. ప్రతిదానికీ నేపథ్యం ఉంటుంది. చరిత్రా ఉంటుంది. వీటిపై దృష్టిపెడితే మధ్యతరగతి అసలు సంగతులూ తెలుస్తాయి.


అభివృద్ధి చెందిన దేశాల్లో మధ్యతరగతి సంఖ్య చాలా ఎక్కువ. మన దగ్గరా దీని సంఖ్య 1990ల తర్వాత బాగా పెరిగింది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల తర్వాత మధ్యతరగతి విస్తరించింది. పెద్ద యూరపు దేశాల మొత్తం జనాభాని మించి ఇక్కడ మధ్యతరగతి ఉంది. జనాభాలో 30శాతం వరకూ మధ్యతరగతి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం మన జనాభా 144 కోట్లు. ఇందులో 30 శాతం అంటే 48 కోట్లు. ఈ సంఖ్యను చూసి భారత్‌లో మధ్యతరగతి మహాయుగం వచ్చేస్తుందనే వ్యాఖ్యానాలు ఊపందుకున్నాయి. గణాంకాలపై ఏకాభిప్రాయం మనకు చాలా అరుదు. అందుకే మధ్యతరగతి ఇంత ఉందంటే అంగీకరించలేని వాళ్లూ ఉన్నారు. జనాభాలో 10 నుంచి 25 శాతంలోపే ఈ వర్గం సంఖ్య ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. ఎంత ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతిగా పరిగణించొచ్చు అన్నదానిపైన కూడా ఏకాభిప్రాయం లేదు. ఏడాదికి రెండు లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకూ ఆదాయం ఉన్న వారిని మధ్య తరగతిగా పరగణించవచ్చనీ ఆర్థిక నిపుణులు సూచించారు.

ఆదాయ–వ్యయాల ప్రకారం మొత్తంగా ప్రజలను అయిదు విభాగాలుగా విభజించొచ్చు. అట్టడుగున ఉన్న 20 శాతాన్ని నిరుపేదలుగానూ, ఆ తర్వాత ఉన్న 20 శాతాన్ని పేదలుగానూ పరిగణించి పరిశీలన చేసే పద్ధతి ఉంది. మరో 20 శాతాన్ని కింది మధ్యతరగతిగా భావించొచ్చు. ఆ తర్వాతి 20 శాతాన్ని మధ్య ఆదాయ మధ్యతరగతిగా పరిగణించొచ్చు. అందరికంటే పైనున్న 20 శాతాన్ని ఎగువ మధ్యతరగతి–ధనిక వర్గంగా లెక్కించొచ్చు.

కేవలం ఆదాయాన్నే తీసుకుని ఈ విభాగాలను పరిశీలించటం వల్ల సామాజిక వాస్తవాలు కనపడవు. ఏ విభాగంలో ఏ కులాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు? హరిజనులు, గిరిజనులు, బీసీలు, ఓసీలు ఏ విభాగంలో ఎంతెంత శాతంగా ఉన్నారు? అన్ని కులాలకు మధ్యతరగతిలో చోటు లభించటం వల్ల కుల దృష్టి తగ్గుతోందా? తామంతా ఒకటేనన్న భావన మధ్యతరగతిలో పెరుగుతోందా? సమాన ఆర్థికస్థాయి సామాజిక హెచ్చుతగ్గులను చెరిపేస్తోందా? లేక కుల పక్షపాతం మామూలుగానే కొనసాగుతూ ఆధునిక రంగాల్లో కూడా అది ప్రభావాన్ని చూపిస్తోందా? అన్నవి కీలకమైన ప్రశ్నలు. వీటికి జవాబులు వెతికితేనే వాస్తవ చిత్రం ఎంతో కొంత అర్థం అవుతుంది. జాతీయ నమూనా సర్వే (2011–12) వెల్లడించిన తలసరి నెలవారీ వ్యయం లెక్కల ఆధారంగా చూస్తే ఎవరు ఎక్కడున్నారో స్పష్టంగా తెలుస్తుంది.

ఎస్టీల సంగతే చూద్దాం. నిరుపేదల్లో 36శాతం, పేదల్లో 23శాతం, దిగువ మధ్యతరగతిలో 17శాతం, మధ్య ఆదాయ మధ్యతరగతిలో 14శాతం, ఎగువ మధ్యతరగతిలో 10శాతం చొప్పున ఉన్నారు. ఎస్సీల్లో ఈ శాతాలు వరుసగా 25, 23, 20, 18, 13 చొప్పున ఉన్నట్లు తేలింది.

బీసీల్లో 18, 20, 21, 21, 20 శాతం చొప్పున ఉన్నారు. ఓసీల్లో 11, 16, 20, 22, 31 శాతంగా ఉన్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతానికి చెందినవి. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికీ శాతాల్లో కొంత తేడాలున్నా పరిస్థితిలో పెద్ద తేడాలేదు.


ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సామాజికంగా దిగువ స్థాయిని, అగ్రకులాలకు ఉన్నతస్థాయిని ఇవ్వటం మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. సామాజిక స్థాయికి తగ్గట్లుగానే ఆర్థికస్థాయీ ఒకప్పుడు ఉండేది. అనేక పరిణామాల వల్ల కులాల్లోపలా ఆర్థికపరమైన తేడాలు వచ్చేశాయి. 1990ల తర్వాత అవింకా వేగాన్ని పుంజుకున్నాయి. ఎస్సీల్లో కూడా ఎగువ మధ్యతరగతి ప్రజలు 13 శాతం ఉండటమే దీనికి నిదర్శనం. మధ్యఆదాయ వర్గంలోనూ 18 శాతం ఉన్నారు. ఇంకో ఆసక్తికర పరిణామం ఏమిటంటే దిగువ, మధ్యస్థ తరగతులనే తీసుకుంటే బీసీ, ఓసీల మధ్య పెద్ద తేడాలేదు. ఎగువమధ్య తరగతి వచ్చే సరికి మాత్రం ఈ తేడా 11 శాతం వరకూ ఉంది.

ఈ శాతాలను బట్టి కులాల్లో ఆర్థిక అంతరాలను విస్మరించలేని పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు ఇంకో వాస్తవం కూడా మనముందుకు వస్తుంది. మధ్యతరగతికి చేరుకున్న తర్వాత కూడా కుల, జాతి భావనలు ప్రజల్లో పూర్తిగా తగ్గలేదని చెప్పటానికి సురీందర్‌ పలు పరిశీలనలను ప్రస్తావించారు. వీలున్నచోట్ల మధ్యతరగతి కుల పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులోనూ అగ్రకులాల వాటానే పెద్దది. సమాజంలో బాగా పరపతిని కలిగి ఉండి అవసరమైన చోట కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటంలో అగ్రకులాలకు చాకచక్యం ఉంది. దీన్నే సోషల్‌ క్యాపిటల్‌ అంటారు. ఇతర కులాలకు అవకాశాలు దక్కకుండా పలు సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు. అందుకే కుల సంఘీభావం పనిచేయని రంగం ఉందని చెప్పుకోలేం. పాశ్చాత్య దేశాల్లో జాతి ఆధిక్యతా భావాలు ఉన్నప్పటికీ కులం నుంచి ఉత్పన్నమయ్యే ఇన్ని పక్షపాతాల్లేవు. ఈ పక్షపాతమే చాలా సందర్భాల్లో సమస్యలపై సంఘటితం కాలేని దుస్థితిని తెచ్చిపెడుతోంది. అయితే అందరూ ఈ దారిలోనే లేరు. స్వేచ్ఛ, సామాజిక సమానత్వ భావాల నుంచి ప్రేరణపొందిన వ్యక్తులు, నాయకులు కూడా మధ్యతరగతి నుంచే వచ్చారు. సంస్కరణ, ప్రగతిశీల ఉద్యమాలకు వారే నేతృత్వం వహించారు. కానీ వీటితో నేరుగా ప్రభావితమైన మధ్యతరగతి సంఖ్య గణనీయమైందని చెప్పలేం. దీనికి గట్టి కారణాలే ఉన్నాయి. మన మధ్యతరగతి బ్రిటిషు పాలకుల అవసరాల కోసం పుట్టింది. అధికారాన్ని చలాయించిన వర్గాలతో సంఘర్షించి ఉనికిలోకి రాలేదు. 1947 వరకూ మధ్యతరగతి అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు, వైద్యులు, గుమాస్తాలు, అకౌంటెంట్లు, ఉపాధ్యాయులే. ఈ తరగతి ఎప్పుడూ సమాజంలో సమూల మార్పులు కోరుకోలేదు. పెద్దగా ఇబ్బంది కలిగించని సంస్కరణల కోసమే పట్టుబట్టింది. రాజకీయ అధికారాన్ని కూడా మెట్టుమెట్టుగా సాధించటానికే ప్రాధాన్యం ఇచ్చింది. మధ్యతరగతిలో అత్యధికులు అగ్రకులాల నుంచి రావటం వల్ల తరతరాలుగా తమకు పెద్దపీట వేసిన సామాజిక వ్యవస్థను మార్చటానికి ఇష్టపడలేదు. ఈ పరిమితి వల్లే ఎన్నో ప్రగతిశీల చట్టాలు ఆచరణలో పేలవంగా అమలయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, బహుళ సంస్కృతుల పరిరక్షణ, సంక్షేమరాజ్య భావన, రిజర్వేషన్ల కల్పన లాంటి వాటికి మధ్యతరగతి రాజకీయ నాయకత్వం ఆమోదించినా అవన్నీ సవ్యంగా అమలయ్యాయని చెప్పలేం.


ఎన్ని పరిమితులు, పక్షపాతాలు ఉన్నప్పటికీ మంచికైనా చెడుకైనా మధ్యతరగతి ఇప్పడు మహాచోదక శక్తిగా మారింది. ఆర్థిక రథాన్ని తన వినియోగ శక్తితో పరుగుపెట్టిస్తోంది. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవటంలో దూసుకుపోతోంది. నవకల్పనలలోనూ ముందుంటోంది. ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా కాపాడుతూ వస్తోంది. అదే సమయంలో అసహన ధోరణులకు ఆహ్వానం పలుకుతోంది. ఆధిపత్య భావజాలాల ప్రభావాలకు అనుచితంగా లోనవుతోంది. గతమంతా గొప్పదనే ఆభిజాత్యాన్ని ప్రదర్శిస్తోంది. కుల నిర్దేశిత పెద్దాచిన్నా దృష్టిని పూర్తిగా వదుల్చుకోలేకపోతోంది. వీటిని త్యజించి వివేచనను ప్రదర్శిస్తే దేశాన్ని మేలిమలుపు తిప్పుతుంది. నియంతృత్వాలన్నీ ముందు చూపులేని మధ్యతరగతి మద్దతుతోనే వచ్చాయి. చరిత్ర చెప్పే పాఠం అదే!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Apr 26 , 2024 | 06:13 AM