Share News

RK KothaPaluku: ఇక తేల్చుకోవాల్సింది జనమే!

ABN , Publish Date - May 05 , 2024 | 08:06 AM

‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్‌ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...

RK KothaPaluku: ఇక తేల్చుకోవాల్సింది జనమే!

‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్‌ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్ర్తి అనే రచయిత ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆవేదన చెందాడు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి మనవడు. ఇప్పుడు మన దేశంలోని పరిస్థితులను గమనించిన వారికి ఈ మాటలు అక్షర సత్యాలని అనిపించకమానదు. శాస్త్రవేత్తలు జ్యోతిష్యం గురించి మాట్లాడడం, బాబాలు సైన్స్‌ గురించి చెప్పడం చూస్తున్నాం కదా! ప్రవాస భారతీయులు దేశాన్ని ప్రేమించడం ఎలాగో చెప్పడంతోపాటు ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారు. నేరగాళ్లు, రాజకీయ నాయకుల విషయానికి వద్దాం! ఈ ఇరువురి మధ్య పెద్ద తేడా ఉండడంలేదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా నేరగాళ్లే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే, ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు. రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తును, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రం ఏమిటంటే, సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు. మనల్ని దోచుకొనే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాము. సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు. రాజకీయ దొంగకు ఆ పోలీసులే రక్షణ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏమంటే సాధారణ దొంగను మనం అసహ్యించుకుంటాం! దొరికితే చావగొడతాం. రాజకీయ దొంగకు మాత్రం భజన చేస్తాం. వాడికోసం మనం పరస్పరం కొట్టుకు చస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో సార్వత్రక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ మాటలు గుర్తుకు వస్తున్నాయి. శాస్త్రవేత్తలు, బాబాలు, సినీనటులు, ధనవంతుల విషయం పక్కనపెట్టి... నేరగాళ్లు, రాజకీయ నాయకుల విషయానికి వద్దాం! ఇటీవలి కాలంలో నేరగాళ్లు బాబాలుగా కూడా అవతరిస్తుండగా ఆర్థిక నేరస్తులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందుతున్నారు. రాజకీయ నాయకులకు దేవుడు ముడి సరుకుగా మారిపోయాడు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని బాబాలుగా అవతరించిన వాళ్లు ప్రజలను ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదే ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం ఇప్పుడు నిత్యకృత్యం అయింది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకోసం దేవుడితోపాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు. కులం కూడు పెట్టదని తెలిసినా ఆ కులం కోసమే కొట్టుకు చస్తున్నారు. ఎన్నికల్లో ఫలానా కులం వాళ్లకు అన్ని టికెట్లు ఇచ్చాం, ఇన్ని టికెట్లు ఇచ్చాం అని ప్రకటించుకోవడం చూస్తున్నాం. మెజారిటీ కులాల వాళ్లకు మైనారిటీ కులం వాళ్లు టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని ఒక్కరూ ఆలోచించరు. సామాజిక న్యాయం అంటే ఏమిటి? అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆర్థిక, సహజ వనరులన్నింటినీ చెరబట్టిన వాళ్లు ఏ అధికారం లేని పదవులకు టికెట్లు కేటాయించడం సామాజిక న్యాయం అవుతుందా? కులం కాదు గుణం ముఖ్యం అని ఒకప్పుడు చెప్పేవాళ్లు. ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నాయకులకు ప్రజలను కులాల వారీగా విడగొట్టడం అవసరంగా మారింది.


అయినా... పదవికి దూరమైన కేసీఆర్‌!

తెలుగు రాష్ర్టాల విషయానికి వద్దాం! మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుల బలం లేదు. అందుకే ఆయన ప్రాంతీయ వాదం అందుకొని అందలం ఎక్కారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణను పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ కూడా అధికారంలో ఉన్నప్పుడు యజ్ఞయాగాదులు నిర్వహించారు. యాదాద్రిని పునర్నిర్మించారు. అయినా దేవుడు కనికరించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫలితంగా కేసీఆర్‌ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పుకొంటున్న మనమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే ప్రజలను విస్మరిస్తాం. కేసీఆర్‌ కూడా ప్రజలను విస్మరించారు. అందుకే ఆయన అధికారం కోల్పోయారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్నికల్లో పదే పదే ఉపయోగపడవు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌కు ఉపయోగపడిన ప్రాంతీయ వాదం 2023 ఎన్నికల్లో పనిచేయలేదు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్దిష్టమైన లక్ష్యంతో కేసీఆర్‌ చర్యలను టార్గెట్‌గా చేసుకొని అందలాన్ని అందుకున్నారు. కేసీఆర్‌నుగానీ, రేవంత్‌నుగానీ ఎన్నుకున్నదీ, ఎంచుకున్నదీ ప్రజలే. వ్యవస్థలు పతనమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది. అందుకే ఎంత అధికారం, ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్‌ తప్పించుకోలేకపోయారు. తెలంగాణలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ జరుగుతోంది.

ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్యే కేంద్రీకృతమైనట్టు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్దో గొప్పో పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ బలపడేకొద్దీ ఆ ప్రభావం బీజేపీపైన పడుతుంది. అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌ బలం తగ్గే అవకాశాలు తక్కువ. మనది కర్మభూమి. ఈసడించుకున్న ప్రజలే కొంతసేపటికి అయ్యో పాపం అనవచ్చు. ఈ ప్రభావం రాజకీయాల్లో కూడా కనిపిస్తుంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల సానుభూతి పొందగలరా? లేదా? అన్నది తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైతేగానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మతం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుండగా తెలంగాణలో ముస్లింలు ప్రభావం చూపుతారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాట్లాడుతూ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోనని ప్రకటించారు. దీంతో ముస్లింలు అంతా కాంగ్రెస్‌ పార్టీకి అండగా సంఘటితం అయ్యారు. అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితం అవుతారా? అంటే చెప్పలేం. తెలంగాణ సమాజాన్ని కూడా కులాల వారీగా విడదీసినందున హిందువులలో ఐకమత్యం రావడం కష్టం. ప్రధాని మోదీ మాటలు బీజేపీకి నష్టం చేస్తాయా? లాభం చేకూరుస్తాయా? అన్నది వేచిచూడాలి.


ఏపీలో ఇలా...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం! అక్కడి రాజకీయాలను పరిశీలిస్తే పైన చెప్పిన ఫేస్‌బుక్‌ సూక్తి మళ్లీ గుర్తుకొస్తుంది. ఆర్థిక నేరగాళ్లు విలువలను బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డినే తీసుకుందాం. ఆయన అనేక ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. అయినా విలువలు బోధిస్తున్నారు. రాజకీయాలు ఇంతగా కలుషితమయ్యాయా? అని ఈసడించుకుంటున్నారు. రాజకీయాలే కాదు సమాజం కూడా కలుషితమైనందునే తాను ముఖ్యమంత్రిని కాగలిగానని ఆయన విస్మరిస్తున్నారు. దేవుడి ప్రస్తావనను కూడా జగన్మోహన్‌ రెడ్డి తరచుగా తీసుకువస్తారు. ఆ దేవుడి చల్లని దీవెనలతో అని అంటూ ఉంటారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మరింత గొప్ప స్ర్కిప్ట్‌ రాసే పనిలో దేవుడు బిజీగా ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. ఆ స్ర్కిప్ట్‌ ఎలా ఉండబోతున్నదో మరో నెల రోజుల్లో తేలిపోనుంది. ధనవంతులు నిరాడంబర జీవనం గురించి పాఠాలు చెబుతారు అన్న మాటలు కూడా జగన్మోహన్‌ రెడ్డికి వర్తిస్తాయి. దేశంలోకెల్లా ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన ఆయన క్లాస్‌వార్‌లో భాగంగా తాను పేదలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకొంటున్నారు. రాజకీయ నాయకులకు భజన చేసేవాళ్లు ఉండనే ఉంటారు కనుక జగన్మోహన్‌ రెడ్డిని పేదల ప్రతినిధిగా అభివర్ణించడానికి కొంతమంది సిద్ధమయ్యారు. సామాజిక న్యాయం గురించి జగన్మోహన్‌ రెడ్డి తరచుగా ప్రవచిస్తున్నారు. అతగాడి పాలనలో సామాజిక న్యాయానికి నిర్వచనమే మారిపోయింది. అయితే, ‘ఆహా ఓహో’ అని కీర్తించేవారికి ఆయన రోత మీడియాలో స్థానం లభిస్తోంది. దేశ రాజకీయాల్లోనే ఏ నాయకుడూ చేయని విధంగా జగన్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కొంత మందికి కొన్ని టికెట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగినట్టేనా? ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలూ’ అని జగన్‌ రాగాలు తీసి పాడుతున్నారు సరే, ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించాయా? అంటే లేదనే చెప్పుకోవాలి.

అధికారం, ధనం, వనరులు అన్నీ జగన్మోహన్‌ రెడ్డి వద్ద కేంద్రీకృతమైనప్పుడు సామాజిక న్యాయం ఎలా సాధ్యం? ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారే కదా ఉన్నారు? చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే బడుగులకు చట్టసభలు, ఇతర పదవుల్లో వాటా లభిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని గొప్పలు చెప్పుకొంటున్నారు గానీ ఆ ఐదుగురూ ఎవరో, వారికి ఉన్న అధికారం ఏ పాటిదో సదరు ఉప ముఖ్యమంత్రులకు కూడా తెలియదు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్‌ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యం ఏలుతున్నప్పుడు సామాజిక న్యాయం పాటించినట్టు ఎలా అవుతుంది? అధికారంలో వాటా దక్కనీయకుండా సామాజిక న్యాయం సాధించామని అనడం నేతి బీరకాయలో నెయ్యి చందంగానే ఉంటుంది.


అటూ... ఇటూ!

తాము దగా పడుతున్నామా, లాభపడుతున్నామా అన్నది తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే. జగన్మోహన్‌ రెడ్డి వంటి వారు అధికారంలో కొనసాగడానికి అర్హులా? కాదా? అన్నది కూడా ఈ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించుకోవాలి. తల్లిని, చెల్లిని సైతం విసిరికొట్టిన వ్యక్తి నైజం తెలుసుకోవడం అవసరం. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట... అని దివంగత రాజశేఖర రెడ్డి తరచూ అంటూ ఉండేవారు. తన మాటలు తన కుమారుడికే వర్తించబోతున్నాయని ఆనాడు ఆయనకు తెలియదు పాపం. తల్లినీ చెల్లినీ దూరం చేసుకున్న జగన్‌ బహిరంగ సభల్లో మాత్రం అక్కచెల్లెమ్మలు అని మహిళలను ఉద్దేశించి అంటూ ఉంటారు. రక్తం పంచుకు పుట్టిన వాళ్లకే న్యాయం చేయడానికి నిరాకరిస్తున్న జగన్‌, పరాయి మహిళలకు న్యాయం చేస్తారా? ఆయనకు రక్త సంబంధాలు ముఖ్యం కాదు– తాను అధికారంలో కొనసాగడమే ప్రధానం. అందుకోసమే క్లాస్‌ వార్‌, కులం, మతం వంటి మాటలను తరచుగా వాడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులను నీచులుగా అభివర్ణిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకమైనవి. జగన్‌రెడ్డి కేంద్ర బిందువుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్‌ కావాలనుకొనేవారు ఒకవైపు, వద్దనుకొనేవారు మరొకవైపు మోహరించారు. సమాజం రెండుగా విడిపోయింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రధానం కాదు. జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపాలనుకొనేవారు మరేమీ చూడటంలేదు! కులాలకు అతీతంగా కూటమినే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ప్రజలను ఆకర్షించడానికి పోటీపడి ప్రకటిస్తున్న పథకాల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉండదు. రాష్ట్రంలో నాగరిక పాలన, అభివృద్ధి ఉండాలని కోరుకొనే వారందరూ జగన్మోహన్‌ రెడ్డిని ఈసారి ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. కులం, మతం ప్రాతిపదికన ఆలోచిస్తున్నవారు మాత్రం జగన్‌ వైపు ఉన్నారు. ఈ ఐదేళ్ల అరాచకాలను గమనిస్తున్నవాళ్లు బటన్ల నొక్కుడుకు పడిపోవడం లేదు.


పరాకాష్ఠకు ఫొటోల పిచ్చి

ప్రజల గుండెల్లో తాను పదిలంగా ఉండేలా తన పాలన ఉంటుందని అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌ చెప్పారు. ఐదేళ్లు గడిచే సరికి ప్రజల గుండెల్లో ఉండే విషయం అలా ఉంచితే, ప్రజలు తనను గుర్తుపెట్టుకుంటారా అన్న అనుమానం ఆయనకు వచ్చినట్టుంది! అందుకే, ప్రతిచోటా తన ఫొటో ముద్రిస్తున్నారు. రైతుల వ్యక్తిగత ఆస్తి పత్రాలైన పట్టాదారు పాసు పుస్తకాలలో ప్రతి పేజీలో ఆయన తన ఫొటోను ముద్రింపజేస్తున్నారు. పరిమిత కాలం మాత్రమే అధికారంలో ఉండే ముఖ్యమంత్రికి శాశ్వతంగా ఉండే ఆస్తి పత్రాలపై తన ఫొటోలు ముద్రించుకొనే అధికారం ఉంటుందా? బలహీనవర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన స్టాంప్‌ పేపర్లపై కూడా ఆయన ఫొటోను ముద్రించుకోవడం పరాకాష్ఠ. స్టాంప్‌ పేపర్‌పై ఇలా ఫొటోలు ముద్రించడాన్ని చట్టం అనుమతించదు. అందుకే బ్యాంకులు సదరు స్టాంప్‌ పేపర్‌ డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి ముచ్చటపడుతున్నారే అనుకుందాం– చట్టం సమర్థించని విధంగా స్టాంప్‌ పేపర్లపై ఆయన ఫొటో ముద్రింపజేసిన అధికారిని సన్నాసి అంటే కూడా తప్పులేదు. నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలిగానీ ఆస్తి పత్రాలపై కాదు. ఈ చిన్న లాజిక్‌ను మరచిపోయిన జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన ఆజ్ఞలను అమలు చేస్తున్న అధికారులకు భారతదేశ చట్టాలపై శిక్షణ ఇప్పిస్తే మంచిది. గతంలో కూడా రంగుల పిచ్చితో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు వేసి వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, తీరా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వదేశీయుడి చేతిలో హత్యకు గురైన మహాత్మా గాంధీ తనను జాతిపితగా గుర్తించి గౌరవించాలని కోరలేదే! దేశం ఆయనకు ఇచ్చిన గౌరవం అది. అధికారంలో ఒక్కరోజు కూడా లేని నాయకులను కూడా మనం గుర్తించి గౌరవించుకున్నాం. ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ జనాభా నియంత్రణ కోసం ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించారు. ఇప్పుడు మళ్లీ ఇంత కాలానికి జగన్‌రెడ్డి ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫొటో ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తే ప్రజల గుండెలపై బలవంతంగా తన బొమ్మను పచ్చబొట్లుగా వేయించినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. నేరగాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అధికారం అందుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులే నిదర్శనం.


రూల్‌ ఆఫ్‌ లా... ఏదీ?

జగన్‌ పాలనలో ఏ వ్యవస్థకు కూడా గౌరవం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలు కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదంటే పాలనా యంత్రాంగం ఎంత భ్రష్టుపట్టి పోయిందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానాలు ఆదేశాలు మాత్రమే ఇవ్వగలవు. వాటిని అమలుచేసే యంత్రాంగం న్యాయస్థానాల వద్ద ఉండదు. అందుకే జగన్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయడం లేదు. ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట పడని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో రూల్‌ ఆఫ్‌ లా కుప్పకూలిపోతుంది. ఇదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అన్న సందేహం కలగక మానదు. ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో ప్రజల వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత ఉండదు. వివాదాలు సృష్టించి కబ్జాలకు పాల్పడతారు. దేవుడిని, మతాన్ని విశ్వసించే జగన్మోహన్‌ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారంతో న్యాయపాలన చేయాలన్న సూత్రాన్ని ఎలా విస్మరిస్తున్నారో తెలియదు. కృష్ణశాస్ర్తి చెప్పిన అద్భుతలోకం జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. అధర్మం పెచ్చరిల్లినప్పుడు ప్రకృతి విధిగా కల్పించుకుంటుంది. గుంటూరు జిల్లాలో జన సేనాని పవన్‌ కల్యాణ్‌ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను దుండగులు ధ్వంసం చేయడం వంటి దురాగతాలు జగన్‌ పాలనలోనే సాధ్యం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. అయినా దుండగులు బరితెగించి మరీ హెలిప్యాడ్‌ను ధ్వంసం చేయగలిగారంటే రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడం లేదని భావించాల్సిందే. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి ప్రకృతి రంగ ప్రవేశం చేయవలసిందే. చూద్దాం! ఏం జరుగనుందో! జగన్‌ చెబుతున్నట్టు దేవుడు రాయబోతున్న స్ర్కిప్ట్‌ ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - May 05 , 2024 | 08:09 AM