Share News

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్‌రెడ్డి కన్నెర్ర..!

ABN , Publish Date - May 04 , 2024 | 04:48 AM

హుద్‌హుద్ తుపానుతో విశాఖ నగరం చివురుటాకులా వణికిపోయినప్పుడు ప్రజలు తిండికీ, తాగునీటికీ అవస్థలు పడ్డారు. వారం రోజుల పాటు బస్సులో ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి...

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్‌రెడ్డి కన్నెర్ర..!

హుద్‌హుద్ తుపానుతో విశాఖ నగరం చివురుటాకులా వణికిపోయినప్పుడు ప్రజలు తిండికీ, తాగునీటికీ అవస్థలు పడ్డారు. వారం రోజుల పాటు బస్సులో ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని చక్కదిద్దారు. చివరి బాధితుడికి కూడా సహాయం అందించిన తర్వాతే తిరిగి వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం నా తల్లిని ఓడించినందుకే విశాఖకు ఈ పరిస్థితి దాపురించిందని హేళన చేశారు. అలాంటి వ్యక్తి ఉత్తరాంధ్రకు, విశాఖ నగరానికి మేలు చేస్తాడంటే ఇక్కడి ప్రజలు ఎందుకు నమ్ముతారు? 2019 ఎన్నికల సమయంలో ఇక్కడ వచ్చిన ఫలితాలు అందుకు నిలువెత్తు సాక్ష్యం. రాష్ట్రమంతా వైసీపీ హవా ఉన్నా కూడా నగరంలోని నాలుగు స్థానాల్లో జనం టీడీపీకి అండగా నిలిచారు. తర్వాత కాలంలో విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. పెట్టుబడి సదస్సులు పెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఐటీ హిల్స్, డేటా సెంటర్, ప్రపంచంలోనే టాప్ 5 సాఫ్ట్‌వేర్ కంపెనీలుగా పిలుచుకునే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థల్ని విశాఖలో స్థాపించేందుకు సన్నాహాలు చేశారు.


2024లో ప్రభుత్వం మారాక విశాఖలో పరిస్థితులు కూడా మారిపోయాయి. పాలకుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మూడు రాజధానుల్లో ఒక రాజధానిని విశాఖలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు విశాఖ అభివృద్ధి కోసం గానీ, రాజధాని కోసం గానీ ఇటుక రాయి కూడా వేయలేదు. పైగా ఉత్తరాంధ్రకు తలమానికమైన రుషికొండకు బోడిగుండు కొట్టారు. రూ.5వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని వైసీపీలో నెం.2గా ఉండే ఒక ఎంపీ తన బినామీలతో కబ్జా చేశారు. రుషికొండ ఐటి హిల్ దగ్గర ఎన్‌సీసీకి ఇచ్చిన 65 ఎకరాలు అదే ఎంపీ తన అల్లుడి సంస్థకి కట్టబెట్టారు. బీచ్ రోడ్డులోని బే పార్కులో 9 ఎకరాలు హెటిరోకి సమర్పించారు. రుషికొండ ఐటి హిల్ వద్ద రేడియంట్ డెవలపర్‌కి ఇచ్చిన 52 ఎకరాలు సిండికేట్ అయ్యి లాక్కున్నారు. ఆర్.కె. బీచ్ రోడ్డులో లులూ కోసం సేకరించిన 5 ఎకరాల ప్రైవేటు భూమి, ఏపీఐఐసీకి సంబంధించిన 8 ఎకరాలూ వెనక్కి లాక్కుని అమ్ముకున్నారు. షీలానగర్ వద్ద వైసీపీ ఎంపీకి 28 ఎకరాలు కారు చౌకగా కట్టబెడితే అక్కడ 800 అపార్ట్‌మెంట్లు, 100 విల్లాలు నిర్మించారు. కార్తీక వనాన్ని వాటాలు వేసి పంచుకున్నారు. గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టి కమిషన్లు పొందారు. చివరికి విశాఖకు తలమానికంగా నిలిచిన విశాఖ ఉక్కు భూముల్ని కూడా దోచేసేందుకు ప్రైవేటీకరణకు తలూపారు.

తెలుగుదేశం ప్రభుత్వం మూడు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సదస్సులను నిర్వహించి రూ.15.45 లక్షల కోట్ల పెట్టుబడులు, 32 లక్షల ఉద్యోగాలు కల్పించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రూ.5 లక్షల కోట్లు విలువైన 39,450 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటై 5,13,351 ఉద్యోగాలు కల్పించినట్లు అసెంబ్లీ సాక్షిగా నాటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు. కానీ జగన్‌రెడ్డి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. విదేశీ పెట్టుబడులు లేక, స్వదేశీ పెట్టుబడుల రాక, ఉద్యోగాలు లేక చదువుకున్న యువత రోడ్డున పడ్డారు. పక్కనున్న తెలంగాణకు రూ.46 వేల కోట్ల పెట్టుబడులొస్తే.. ఏపీకి వచ్చింది కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమేనంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేశారు. శ్రీకాకుళంలో ఐఐటి, భావనపాడు ఓడరేవు, డయాలసిస్‌ కేంద్రాలు, కిడ్నీ ఆస్పత్రి, వంశధార–బాహుదా అనుసంధానం, వంశధార రిజర్వాయర్ పూర్తి, ఆఫ్‌షోర్ రిజర్వాయర్, విజయనగరంలో ట్రైబల్‌ యూనివర్సిటీ, బోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, తోటపల్లి రిజర్వాయర్‌, పతంజలి ఫుడ్‌ పార్క్‌, ఐఐయం, పెట్రోలియం యూనివర్సిటీ, ఫిన్‌టెక్‌ వ్యాలీ, మిలీనియం ఐటీ టవర్స్‌ ప్రణాళికలు రచించారు. యన్‌ఏడి ఫ్లై ఓవర్‌ పూర్తి చేశారు. మూడు సీఐఐ సదస్సులతో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు, 30 లక్షల ఉద్యోగాలకు ఎంవోయు కుదుర్చుకున్నారు. హుద్‌హుద్‌ తుపాను వల్ల దెబ్బతిన్న విశాఖ పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీఐఐ సదస్సులు, పెట్టుబడిదారుల రాకపోకలతో కళకళలాడుతున్న విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని జగన్‌రెడ్డి వచ్చాక ఉన్మాదానికి, వికృత చేష్టలకు నిలయంగా మార్చారు. ఆ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు బయటపెట్టారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు.

మరోవైపు పులివెందుల పంచాయతీలు, గంజాయి, డ్రగ్స్‌కు ఈ ప్రాంతం కేంద్రంగా మారిపోయింది. విశాఖ అభివృద్ధిలో కీలకమైన రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే పనులు జరగడం లేదని కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెట్రో ఏమైందో తెలియదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రశ్నించిన దాఖలాలే లేవు. భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబల్‌ యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, లులూ సంస్థలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయాలతో కలుషితం చేశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు రూ.1,590 కోట్లు ఖర్చు చేయగా, జగన్‌రెడ్డి ఖర్చు చేసింది రూ.498 కోట్లేనని ఆ పార్టీ వారే అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు.


ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి నిత్యం మాట్లాడే జగన్‌రెడ్డి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా నిలుస్తున్నారు. మరో నాలుగేళ్లలో ప్రభుత్వం చేతుల్లోకి రావాల్సిన గంగవరం పోర్టు ప్రైవేటుపరం చేశారు. రైల్వే జోన్ గాలికొదిలేశారు. విశాఖ–చెన్నై పెట్రోలియం కారిడార్ పూర్తి చేయలేదు. రూ.80 వేల కోట్ల పెట్టుబడితో వచ్చిన అదానీ డేటా సెంటర్‌ను తెలంగాణకు తరిమేశారు. మిలీనియం టవర్స్ ఖాళీ చేయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులు, సంస్థల్ని తరిమేసి ఈ ప్రాంతాన్ని ఉద్ధరిస్తాను, ఇక్కడే మకాం వేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం. అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గానీ, ఇక్కడి ప్రజల ఆత్మాభిమానం కాపాడడానికి గానీ ఏనాడూ చొరవ చూపని వ్యక్తిని నమ్మేదే లేదని ప్రజలు తేల్చి చెబుతున్నారు.

ఎం.శ్రీభరత్

విశాఖపట్నం, పార్లమెంటు అభ్యర్థి

Updated Date - May 04 , 2024 | 04:48 AM