Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

ABN , Publish Date - May 04 , 2024 | 04:35 AM

భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి, దున్నేవానికి భూమి పంచినప్పుడు, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు...

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి, దున్నేవానికి భూమి పంచినప్పుడు, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు గ్యారంటీ చేసినప్పుడు, అమెరికా అగ్రరాజ్య ప్రభావం నుంచి బయటపడి, స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. అంటే భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటం ద్వారా మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యుసిసిఆర్‌ఐ–ఎం.ఎల్‌) విప్లవ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నది.

భారతదేశం ‘క్వాడ్‌’ నుంచి బయటకు రావాలి. ఇండో–పసిఫిక్‌ వ్యూహాన్ని తిరస్కరించాలి. అమెరికా అనుకూల విదేశాంగ విధానం నుంచి బయటపడి, మనదేశ నిజమైన జాతీయ ప్రయోజనాలకు, శాంతికి, అభివృద్ధికి తోడ్పడే స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించాలి. యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలి. అమెరికా వ్యూహానికి సేవచేసేది కాకుండా స్వతంత్ర ఆర్థిక విధానం అనుసరించాలి.

జాతీయ పరిశ్రమలకు, ప్రత్యేకించి తెలుగు జాతీయ పరిశ్రమలకు రక్షణ కల్పించాలి. కార్మికుల, మధ్యతరగతి వర్గాల పని పరిస్థితులను మెరుగుపరచాలి, వారి జీతాలను పెంచాలి. భూస్వామ్య విధానం రద్దు చేయాలి, దున్నేవానికి భూమిని పంచాలి. ఫ్యూడల్‌ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక విద్యా సంస్కృతులను అభివృద్ధి చేయాలి. ప్రత్యేకించి తెలుగు ప్రజల జాతీయ ఐక్యతను, తెలుగు సంస్కృతి, భాషల సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. అన్ని నిర్బంధాలను రద్దు చేయాలి. జాతీయ, ప్రజాస్వామిక, విప్లవ శక్తులందరికీ సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని గ్యారంటీ చేయాలి.

ఈ నినాదాలతో తెలంగాణలో 11 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో 4 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో యుసిసిఆర్‌ఐ (ఎం.ఎల్‌) పోటీ చేస్తూ పాలకవర్గాల ప్రజావ్యతిరేక, అభివృద్ధి నిరోధక విధానాలను ఎండగడుతుంది.

జి. వినోద్‌

కార్యదర్శి, యుసిసిఆర్‌ఐ(ఎం.ఎల్‌)

Updated Date - May 04 , 2024 | 04:35 AM