Share News

బీజేపీ అబద్ధాలు... కాంగ్రెస్ సత్యాలు

ABN , Publish Date - May 04 , 2024 | 04:59 AM

గత ఐదేళ్ల నుంచీ రూపకల్పనలో ఉన్న ఉత్కృష్ట సంకల్ప పత్రమే 2024 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ గాంధీ చరిత్రాత్మక పాదయాత్ర నిర్వహించారు...

బీజేపీ అబద్ధాలు... కాంగ్రెస్ సత్యాలు

గత ఐదేళ్ల నుంచీ రూపకల్పనలో ఉన్న ఉత్కృష్ట సంకల్ప పత్రమే 2024 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ గాంధీ చరిత్రాత్మక పాదయాత్ర నిర్వహించారు. యాత్ర పొడుగునా ప్రజల చింతలు, కలతలు, ఆందోళనలను ఆయన తెలుసుకున్నారు. ప్రజలు ఎటువంటి పరిస్థితులలో నివసిస్తున్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. వివిధ సమస్యలపై వారితో సంభాషించారు. సామాన్యుల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉదయ్‌పూర్‌లో సమావేశమై దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి సంభావ్య పరిష్కారాల గురించి మూడు రోజుల పాటు విపులంగా సమాలోచనలు చేశారు. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ వివిధ అంశాలపై అనుసరించవలసిన విధానాలను ఆమోదించింది. అవి సమగ్రమైనవి, విశ్వసనీయమైనవి. రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో బీజేపీని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఆ విధానాలను రూపొందించారు. ‘నవ్ సంకల్ప్ ఎకనామిక్ పాలసీ’ని ఉదయ్‌పూర్ సమావేశంలో రూపొందించగా రాయ్‌పూర్‌లో దానిని విస్తృతంగా చర్చించి ఆమోదించారు.


కాంగ్రెస్ మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ను ఏప్రిల్ 5న విడుదల చేశారు. 46 పేజీల ఆ మేనిఫెస్టోను ‘జస్టిస్’ (న్యాయం) అనే భావన ప్రాతిపదికన రూపొందించారు. దండలో దారం ఆ భావన, న్యాయ్ పత్రలోని అన్ని అంశాలకు ప్రాతిపదికగా ఉన్నది. దేశంలోని అత్యధిక ప్రజలకు నిరాకరిస్తున్న ‘న్యాయ్’ను అందరికీ సమకూర్చేందుకు కాంగ్రెస్ సంకల్పించింది. ‘జస్టిస్’ అనే భావనలో సోషల్ జస్టిస్, జస్టిస్ ఫర్ యూత్, జస్టిస్ ఫర్ ఉమెన్, జస్టిస్ ఫర్ ఫార్మర్స్, జస్టిస్ ఫర్ వర్కర్స్ అనే భావాలన్నీ మిళితమై ఉన్నాయి. కోట్లాది ప్రజలు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ (శీఘ్ర లేదా మందకొడి) అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశాన్ని కోట్లాది ప్రజలకు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు అనేవి మాటలుగానే మిగిలిపోయాయి. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే మాటల వెనుక ఉన్న కపటత్వాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టో ఎండగట్టింది. దేశ పాలకులు వల్లిస్తున్న ఆదర్శాలు డొల్లమాటలు మాత్రమేనని స్పష్టం చేసింది ప్రత్యామ్నాయ అభివృద్ధి దార్శనికతను ప్రజలకు నివేదించింది. కనుకనే కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 సార్వత్రక ఎన్నికల హీరో అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ ప్రస్తుతించారు.

నరేంద్ర మోదీ, బీజేపీ తొలుత కాంగ్రెస్ మేనిఫెస్టోను నిర్లక్ష్యం చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియా సైతం ‘న్యాయ్ పత్ర’ను పూర్తిగా ఉపేక్షించింది. అయితే దేశ భాషలలోకి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను అనువదించి రాష్ట్రాలలోని అభ్యర్థులు, ప్రచారకర్తలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఫలితంగా ‘న్యాయ్ పత్ర’ మారుమూల గ్రామాలలోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అందులోని అంశాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ హామీలను వారు విశ్వసించారు. కాంగ్రెస్ సందేశం అందరికీ చేరింది. దేశవ్యాప్తంగా ప్రజల మాటా మంతీ, పిచ్చా పాటీలో కాంగ్రెస్ న్యాయ్ పత్ర ఒక ప్రధాన భాగమయింది. విద్యాధికులతో పాటు నిరక్షరాస్యులు కూడా న్యాయ్ పత్రలోని అంశాలను చర్చించుకోసాగారు.


ఏప్రిల్ 5 తరువాత తొమ్మిది రోజులకు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఎవరూ దానిని పట్టించుకోనేలేదు. ‘మోదీకి గ్యారంటీ’ పేరుతో ఉన్న ఆ మేనిఫెస్టోలోని గుణ విశేషాలను నరేంద్ర మోదీ సైతం మెచ్చుకోలేదు. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగ్ జరిగింది. గూఢచార నివేదికలు బీజేపికి చేదు సత్యాలను నివేదించాయి. కాంగ్రెస్‌కు దాని మిత్రపక్షాలకు ఓటు వేసినవారు ‘న్యాయ్ పత్ర’లోని హామీలకు వేశారన్న విషయం బీజేపీకి స్పష్టమయింది. కర్ణాటక, తెలంగాణలలో ‘గ్యారంటీ’లకు ఓటు వేసినట్టుగానే లోక్‌సభ ఎన్నికలలో ‘న్యాయ్ పత్ర’లోని హామీను విశ్వసించి కాంగ్రెస్‌కు, ‘ఇండియా’ కూటమికి ఓటు వేశారని స్పష్టమయింది. ఈ సత్యం నరేంద్ర మోదీకి కోపం తెప్పించింది. చిరాకు కలిగించింది. ఏప్రిల్ 21నే ఆయన ప్రచార సరళి మారిపోయింది. కొత్త ప్రచార సరళిపై భారతీయ జనతా పార్టీ తన నాయకులకు, కార్యకర్తలకు చేసిన నిర్దేశాలను చూసి నాజీ నాయకుడు గోబెల్స్ సైతం గర్వించి ఉండేవాడు ప్రచారమంతా అబద్ధాలు, మరిన్ని అబద్ధాలు, ఇంకా అబద్ధాలతో నిండిపోవాలని బీజేపీ నాయకులకు నిర్దేశించారు. సత్యం అబద్ధాన్ని ఖండిస్తే ఆ సత్యాన్ని పూర్తిగా ఉపేక్షించాలి.

గత 14 రోజలుగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్తున్న అబద్ధాలు ఏమిటో చూడండి :

అబద్ధం: కాంగ్రెస్ మేనిఫెస్టో అంతటా ముస్లిం లీగ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సత్యమేమిటి? ‘46 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా ‘ముస్లిం’ అనే పదం లేనే లేదు. మైనారిటీలను భాషాపరమైన, మతపరమైన మైనారిటీలుగా కాంగ్రెస్ మేనిఫెస్టో నిర్వచించింది. భాషాపరమైన, మతపరమైన మైనారిటీలకు మానవ హక్కులు, పౌర హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ఆ హక్కులు పూర్తిగా సమర్ధిస్తోంది మైనారిటీలకు ఆ హక్కులు సంపూర్ణంగా దక్కేందుకు కాంగ్రెస్ హామీ పడుతోంది’. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ఏ మత సమూహానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు.


అబద్ధం: కాంగ్రెస్ అధికారానికి వస్తే షరియా చట్టాన్ని మళ్లీ తీసుకువస్తుంది. సత్యమేమిటి? కాంగ్రెస్ మేనిఫెస్టో ఇలా పేర్కొంది. ‘మత చట్టాలను సంస్కరించడాన్ని మేము ప్రోత్సహిస్తాం. అటువంటి సంస్కరణలను, సంబంధిత మత సమూహపు సంపూర్ణ అంగీకారం, క్రియాశీల భాగస్వామ్యంతో మాత్రమే తీసుకురావాలి’.

అబద్ధం: కాంగ్రెస్ మేనిఫెస్టో మార్క్సిస్ట్, మావోయిస్ట్ ఆర్థిక సిద్ధాంతాలను సమర్థిస్తుంది. సత్యమేమిటి? పది పేజీల ‘ఆర్థిక వ్యవస్థ’ భాగానికి రాసిన పరిచయంలో కాంగ్రెస్ ఇలా పేర్కొంది : ‘కాంగ్రెస్ ఆర్థిక విధానం దేశ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తోంది. 1991లో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి, శీఘ్రగతిన ఆర్థిక పురోగతికి కాంగ్రెస్ విశేషంగా దోహదం చేసింది. ఆ విధానాల కారణంగానే ఇతోధికంగా సంపద సృష్టి జరిగింది. మధ్యతరగతి వర్గం అభివృద్ధి చెందింది. లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది, విద్యారంగం, ఆరోగ్య, భద్రత రంగాలలో పెను మార్పులు సంభవించాయి. ఎగుమతులు బాగా పెరిగాయి. కోట్లాది ప్రజలు పేదరికం నుంచి విముక్తమయ్యారు స్వేచ్ఛా విపణి వ్యవస్థకు మేము కట్టుబడి ఉన్నాము. ప్రైవేట్ రంగం ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా ఉంటుంది. ప్రైవేట్ రంగానికి సంపూరకంగా ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధిపరుస్తాము’.

అబద్ధం: కాంగ్రెస్ అధికారానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు స్వస్తి చెబుతుంది. సత్యమేమిటి? కాంగ్రెస్ మేనిఫెస్టో ఇలా పేర్కొంది: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పరిమితిని 50 శాతానికి మించి పెంచేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాలలో కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను అన్ని కులాల వారికీ ఎటువంటి వివక్ష లేకుండా అమలుపరుస్తాము. కేంద్ర ప్రభుత్వంలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఉద్యోగ ఖాళీలను అధికారానికి వచ్చిన ఏడాదిలోగా భర్తీ చేస్తాము’. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యున్నతికి కాంగ్రెస్ ఇంకా పలు హామీల నిచ్చింది.

అబద్ధం: కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ సంపదపై పన్ను విధిస్తుంది. సత్యమేమిటి? పన్నుల విధానం, పన్నుల సంస్కరణలకు సంబంధించిన 12 అంశాలలో భాగంగా ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను తీసుకువస్తామని, వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను ఐదేళ్ల పాటు నిలకడగా ఉంచుతామని, సెస్‌లను 5 శాతానికి మించి పెంచమని, రెండో జీఎస్టీని రూపొందించి అమలుపరస్తామని, ఎంఎస్‌ఎంఈలు, కిరాణా వ్యాపారాలపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. న్యాయ్ పత్రలో ఎక్కడా వారసత్వ పన్ను గురించిన ఊసే లేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్పారు; కాంగ్రెస్ మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’లోని సత్యాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశాలు కావడానికి దోహదం చేశారు; ఈ వాద ప్రతివాదాలలో బీజేపీ మేనిఫెస్టో ‘మోదీకి గ్యారంటీ’ని ప్రస్తావించనే లేదు... తద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టోపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ ప్రశంసాపూర్వక వ్యాఖ్యను మోదీ సమర్థించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 లోక్‌సభ ఎన్నికల నిజమైన హీరో అని నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - May 04 , 2024 | 05:00 AM