Share News

అరాచకమా, అభివృద్ధా.. తేల్చుకోవాలి

ABN , Publish Date - May 04 , 2024 | 04:53 AM

విశాలమైన సముద్రతీరం, పుష్కలమైన వనరులు, అపారమైన మేధోసంపత్తి, కష్టపడే తత్వం ఆంధ్రప్రదేశ్ సొంతం. అయినా అడుగడుగునా వెనుకబాటుతనం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది...

అరాచకమా, అభివృద్ధా.. తేల్చుకోవాలి

విశాలమైన సముద్రతీరం, పుష్కలమైన వనరులు, అపారమైన మేధోసంపత్తి, కష్టపడే తత్వం ఆంధ్రప్రదేశ్ సొంతం. అయినా అడుగడుగునా వెనుకబాటుతనం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది. రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి, ఉద్యోగాల కోసం, పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాల్సిన దీనస్థితి. కేంద్రప్రభుత్వం చూపే సవతితల్లి వైఖరి దీనికి కొంత కారణమయితే రాష్ట్ర ప్రజలుగా మనకు మనం చేసుకున్న ద్రోహమే అన్నింటికన్నా ఎక్కువని చెప్పాలి. కులాలకుళ్లు, మతాలమత్తులో తూగుతూ ఎంతకాలం వంచన చేసుకుంటూ గడుపుదాం? దుర్మార్గపాలకులు పడేసే ముష్టి కోసం, వాళ్ళిచ్చే చిన్నాచితక ఉద్యోగాల కోసం ఎంతకాలం మనస్సాక్షిని మోసం చేసుకుందాం? ఎంతకాలం వాళ్లు చెప్పే కట్టుకథలు నమ్ముతూ వత్తాసు పలుకుదాం? కుల, మత, ప్రాంతపరమైన భావనలను పక్కనపెట్టి ప్రస్తుత కీలకదశలో, ఇప్పటిదాకా జరిగిన కుట్రలను, తప్పిదాలను అందరం ఆత్మావలోకనం చేసుకోవాలి.


నిజంగా సదుద్దేశంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకునే నాయకుడు అమరావతిలో వేలకోట్లు ఖర్చు చేసి కట్టిన కట్టడాలను, రోడ్లను ఎందుకు గాలికి వదిలేస్తాడు? తాను వల్లించే మూడు రాజధానుల్లో ఒకటైన అమరావతిని అడవిలా ఎందుకు మారుస్తాడు? అసలు రాష్ట్రాభివృద్ధిని కోరుకునే నేతే అయితే శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఒక మహానగరాన్ని ఎందుకంత నిర్దాక్షిణ్యంగా నామరూపాలు లేకుండా చేయాలని చూస్తాడు? కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రజావేదిక లాంటి ప్రభుత్వ భవనాల్ని కుంటిసాకులతో ఎందుకు కూలుస్తాడు? అమరరాజా, లూలూ లాంటి కంపెనీలను రాష్ట్రం నుంచి ఎందుకు తరిమేస్తాడు? యువతకు ఉద్యోగాలు రాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు దక్కకుండా ఎందుకు అడ్డుకుంటాడు? ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజకీయకక్షతో చేసిన విధ్వంసం, అరాచకాలు ఎన్నో. రాజకీయ ప్రత్యర్థి మీద అక్కసుతో కోట్లు వెచ్చించి కట్టిన టిడ్కో ఇళ్లను పేదలకు కేటాయించకుండా పాడుచేయడం వాస్తవం కాదా? పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మూసేయడం నిజం కాదా? పంతం పట్టి వాటిని మరుగుదొడ్లుగా మార్చడం నిజం కాదా? నాయకులు అహంకారంతో ప్రజాధనాన్ని, రాష్ట్రవనరులను చిత్తం వచ్చినట్లు నాశనం చేస్తుంటే, మన కులస్థుడని, మన మతస్థుడని, మనకు తాయిలాలు ఇచ్చాడని చూస్తూ ఊరుకుందామా?


గత ప్రభుత్వ హయాంలో 70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సారథ్యంలో కొంచెం కూడా ముందుకు కదలకపోవడం ఆయన అసమర్థత అనుకోవాలా లేక చంద్రబాబు మీద అక్కసుతో తొక్కిపెట్టాడనుకోవాలా? ఆయన తీరు చూస్తుంటే, మూడు రాజధానుల బిల్లు మాదిరిగానే ఆ ప్రాజెక్టును కూడా మట్టుపెట్టే అవకాశం ఉంది. మూడు పోలవరాల బిల్లో, మరొకటో తెచ్చి మూడుప్రాంతాల్లో మూడు పిల్ల కాలువలు తవ్వి పోలవరం ప్రాజెక్ట్ వికేంద్రీకరణ అంటూ తన అనుయాయులతో ఉద్యమాలు చేయించినా చేయించొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాజకీయ ప్రత్యర్ధుల మీద కక్ష సాధించడం కోసం రాష్ట్రప్రయోజనాలను ఇంతగా పణం పెట్టడం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఒక వ్యక్తి చర్యల వల్ల ఈ రాష్ట్రం ఎంత సంపద కోల్పోయింది? ఎందరు విద్యావంతులు ఉద్యోగాలు లేక పరాయిప్రాంతాలకు వలసవెళ్లారు? ఎంతమంది కార్మికులు ఇక్కడ పనులు దొరక్క పొట్టకూటి కోసం పరాయిపంచన చేరారు? అనే అంశాల గురించి ప్రజలందరూ చిత్తశుద్ధితో ఆలోచించాలి. ముఖ్యమంత్రి నిర్హేతుకచర్యల వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఎవరు జరిమానా కట్టాలి? ఇంత విధ్వంసం చేసి కూడా ‘వై నాట్ 175’ అంటుండడం విస్మయం కలిగిస్తోంది.

ఇక పథకాల విషయానికి వస్తే... నిత్యావసరాల రేట్లు పెంచి, అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి తాయిలాలు ఇవ్వడం సరైన పనేనా? సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమపథకాలు అమలు చేస్తే అదికదా సమర్థత, గొప్పతనం. ఉచితాలను, సంక్షేమపథకాలను ఆశించేవారు ఈ నిజాన్ని గ్రహించకపోతే తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నవాళ్ళవుతారు.


ప్రభుత్వభవనాల పేర్లు మార్చి, రంగులు వేసినంత మాత్రాన అది అభివృద్ధి కాబోదు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి, కోడెల శివప్రసాదరావు చొరవతో కట్టిన ఆసుపత్రికి తండ్రిపేరు పెట్టుకోవడం, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడం వగైరా చర్యలను అభివృద్ధి అనగలమా? విజ్ఞులు ఆలోచించాలి. పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు వెల్లువెత్తితే, ఉద్యోగాలు లభిస్తే, ఆదాయం పెరిగితే, మౌలిక సదుపాయాలు మెరుగుపడితే... అదీ అసలైన అభివృద్ధి.

కులం ఉచ్చులో, మతం ఉచ్చులో పడి మళ్ళీ మోసపోయి అరాచకనేతలను తిరిగి అందలం ఎక్కిస్తే రాష్ట్రం పతనం అంచుకు చేరుతుంది. అభివృద్ధికాముకలకు అధికారం అప్పగిస్తే రాష్ట్రానికి మళ్ళీ ప్రపంచపటంలో స్థానం లభిస్తుంది. రాష్ట్రప్రజానీకమంతా మళ్ళీ తలెత్తుకుని తిరగగలుగుతుంది.

డా. గోనుగుంట్ల శ్రీనివాసరావు

నరసరావుపేట

Updated Date - May 04 , 2024 | 04:53 AM