Share News

7 అదానీ కంపెనీలకు సెబీ షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - May 04 , 2024 | 05:52 AM

అదానీ గ్రూప్‌లోని 7 లిస్టెడ్‌ కంపెనీలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నుంచి షోకాజ్‌ నోటీసులు అందాయి. లిస్టింగ్‌ నిబంధనలను పాటించకపోవడంతో పాటు...

7 అదానీ కంపెనీలకు సెబీ షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లోని 7 లిస్టెడ్‌ కంపెనీలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నుంచి షోకాజ్‌ నోటీసులు అందాయి. లిస్టింగ్‌ నిబంధనలను పాటించకపోవడంతో పాటు రిలేటెడ్‌ పార్టీ ట్రాన్సాక్షన్‌ నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జనవరి-మార్చి త్రైమాసికంలో సెబీ ఈ నోటీసులు జారీ చేసిందని అదానీ గ్రూప్‌ కంపెనీలు విడివిడిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం, 2023-24 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలతో పాటు ఈ విషయాన్ని తెలిపాయి. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజె్‌స సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదానీ పవర్‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ విల్మర్‌ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, తామెలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, సెబీ నోటీసులతో ఎలాంటి ప్రభావం ఉండబోదంటూ అన్ని కంపెనీలూ ఒకే తీరుగా స్పందించాయి. కానీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్మర్‌ మినహా మిగతా నాలుగు కంపెనీల ఆడిటర్లు మాత్రం సెబీ దర్యాప్తు ఫలితం భవిష్యత్‌లో కంపెనీలపై ఆర్థికంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, సెబీ నుంచి తమకెలాంటి నోటీసులందలేదని అదానీ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ సిమెంట్‌ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌ స్పష్టం చేశాయి.

గ్రూప్‌ మీడియా సంస్థ ఎన్‌డీటీవీ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. కాగా, హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమిత కమిటీ క్లీన్‌చిట్‌ ఇచ్చిందంటూ అదానీ గ్రూప్‌తో పాటు బీజేపీ చేసిన తప్పుడు దావాను సెబీ షోకాజ్‌ నోటీసులు తేటతెల్లం చేశాయని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.


అదానీ గ్రూప్‌ చాలాకాలంగా అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడటంతోపాటు అనుచిత పద్ధతుల్లో గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌, షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ 2023 జనవరి 24న ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో అదానీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీతో పాటు చిన్న మదుపరులు భారీగా నష్టపోయారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించడంతోపాటు గత ఏడాది మార్చి 2న సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగానే అదానీ కంపెనీలకు సెబీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై కంపెనీలిచ్చే వివరణ ఆధారంగా సెబీ వాటిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలా..? వద్దా..? అనే విషయంపై ఓ నిర్ణయానికి రానుంది. సాధారణంగా ఈ ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా జరిమానా విధింపు లేదా సంస్థ యాజమాన్యాన్ని క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి కొంత కాలం పాటు నిషేధించే అవకాశాలుంటాయి.

Updated Date - May 04 , 2024 | 06:09 AM