Share News

వైసీపీ మేనిఫెస్టో చిత్తు కాగితం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:37 AM

యువతకు ఉద్యోగాలు లేవు. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదు.

వైసీపీ మేనిఫెస్టో చిత్తు కాగితం

పాత హామీలు అమలు చేయకుండా.. కొత్త మేనిఫెస్టో విడుదల ఎందుకు..?

బీజేపీతో బాబు పొత్తు.. బీజేపీకి జగన్‌ తొత్తు

కాంగ్రెస్‌ వస్తే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ, ప్రత్యేక హోదా

ఉత్తరాంధ్ర సభల్లో వైఎస్‌ షర్మిల

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి), టెక్కలి, పలాస, ఏప్రిల్‌ 28: ‘యువతకు ఉద్యోగాలు లేవు. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదు. ఈ ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రానికి చేసింది గుండు సున్నా’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి విమర్శించారు. ఆదివారం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, టెక్కలిలో నిర్వహించిన ఏపీ న్యాయయాత్రలో షర్మిల పాల్గొన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను చిత్తుకాగితంలా అభివర్ణించారు. సీఎం జగన్‌ మళ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని, పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కొత్త మేనిఫెస్టో ఎందుకని ప్రశ్నించారు. పైగా పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

స్టీల్‌ప్లాంటుపై ప్రభుత్వ వైఖరి దారుణం

విశాఖ స్టీల్‌ప్లాంటును విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనా.. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమని షర్మిల పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటును అమ్మేందుకు కేంద్రం సిద్ధమైనా వైసీపీ ఎంపీలు కనీసం పోరాటం చేయలేదని విమర్శించారు. ప్లాంటు పరిరక్షణకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలే పోరాడుతున్నాయన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను రూ.600 కోట్లకు అమ్మేశారని, 30 ఏళ్లపాటు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా వైఎ్‌సఆర్‌ ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారని, కానీ.. జగన్‌ అధికారంలోకి వచ్చిన దానిని వెంటనే అమ్మేశారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంటును అంబానీ, అదానీలకు అమ్మేందుకు సిద్ధపడుతున్నారన్నారు. ప్లాంటుకు అవసరమైన సరుకు, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తద్వారా ప్లాంటు నష్టాల్లోకి వెళ్లేలా చేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, పేదింటి మహిళకు ఐదేళ్లలో ఐదు లక్షల ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. పెన్షన్‌ నాలుగు వేలు కావాలన్నా, పక్కా ఇల్లు కావాలన్నా కాంగ్రెస్‌ గెలవాలన్నారు. ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంటు సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను జగన్‌ అమలు చేయలేకపోయారని, ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో వల్ల ఉపయోగం ఏమీ లేదని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలో చిత్తు కాగితంలా ఉందని విమర్శించారు.


కేంద్రానికి అమ్ముడుపోయిన టీడీపీ, వైసీపీ

రాష్ట్ర ప్రయోజనాలు కాదని స్వప్రయోజనాల కోసం చంద్రబాబు మోదీ నేతృత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. జగన్‌రెడ్డి కూడా బీజేపీకి తొత్తుగా మారారని ఫర్మిల ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో ఆదివారం ఏపీ న్యాయయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడారు. చంద్రబాబు, జగన్‌రెడ్డి ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేంద్రానికి అమ్ముడు పోయారన్నారు. పది సంవత్సరాల చంద్రబాబు, జగన్‌రెడ్డి పాలనలో పది పరిశ్రమలు కూడా రాలేదని, వారివి స్వప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు కావని అన్నారు. ప్రజలు ఆలోచన చేయాలని, ప్రత్యేక హోదా, అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కాంగ్రె్‌సను ఆశీర్వదించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

చేసిన పాపాలకు శిక్ష తప్పదు క్రైస్తవ మత బోధకుడు బ్రదర్‌ అనిల్‌

కడప, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): తమ కుటుంబంలో జరిగిన ఘటనలకు కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భర్త... బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. న్యాయం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో జరిగిన మతప్రార్థనల్లో ఆయన పాల్గొని, బోధనలు చేశారు. పాపులను తొక్కిపడేయాలంటే ధైర్యంగా నిలబడాలని, పాపులను విశ్వసించవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎవరూ భయపడొద్దని, పాపాలు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడపలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రానున్నారని సమాచారం. వీలైతే రాహుల్‌ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి.

Updated Date - Apr 29 , 2024 | 04:38 AM