Share News

హంతకుల వెనుక జగన్‌ ఎందుకున్నాడు

ABN , Publish Date - May 04 , 2024 | 03:38 AM

సొంత బాబాయి వివేకానందరెడ్డిని చంపించింది అవినాశ్‌రెడ్డి అని సీబీఐ అన్ని ఆధారాలతో చెప్పింది. అన్ని వేళ్లూ అవినాశ్‌రెడ్డి వైపు చూపిస్తున్నాయి.

హంతకుల వెనుక జగన్‌ ఎందుకున్నాడు

కడప ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి

అన్ని వేళ్లూ అవినాశ్‌ వైపే..

హంతకులు చట్టసభలకు పోకూడదనే పోటీ: పీసీసీ చీఫ్‌ షర్మిల

కడప, మే 3(ఆంధ్రజ్యోతి): ‘‘సొంత బాబాయి వివేకానందరెడ్డిని చంపించింది అవినాశ్‌రెడ్డి అని సీబీఐ అన్ని ఆధారాలతో చెప్పింది. అన్ని వేళ్లూ అవినాశ్‌రెడ్డి వైపు చూపిస్తున్నాయి. సొంత బాబాయిని దారుణంగా హత్య చేస్తే స్వయంగా సీఎం జగన్‌ తన పదవి అడ్డుపెట్టుకుని నిందితుడు అరెస్టు కాకుండా కాపాడుతున్నారు. కర్నూలులో అరెస్టు చేయడానకి వెళితే పోలీసులను అడ్డుపెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. ఇది అన్యాయం, అక్రమం. సొంత చిన్నాన్నను హత్య చేస్తే ఎందుకు మీరు నిందితుల వెనుక ఉన్నారు. కడప ప్రజలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి’’ అని పీసీసీ చీఫ్‌, జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలారెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతతో కలసి మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మైదుకూరులో జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ.. నేను పులిబిడ్డను.. అన్యాయాన్ని ఎదిరించేందుకే పోటీ చేస్తున్నా. ప్రజాకోర్టులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నా. నేను కడప బిడ్డను.. ఇక్కడే పుట్టాను. హంతకులు చట్టసభలకు పోకూడదనే నేను పోటీ చేస్తున్నా. నన్ను ఆశీర్వదించండి.. అవినాశ్‌ రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉన్నా ఢిల్లీలో కడప సమస్యలపై కొట్లాడలేదు. కడప స్టీలు ప్లాంటు కోసం ఏనాడైనా మాట్లాడారా?’ అని ప్రశ్నించారు.

అవినీతి సొమ్ము ఎంతైనా పంచుతారు!

జగన్‌ సీఎం అయిన తరువాత రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. కనీసం రాజధాని కూడా లేదు. ఈ ఎన్నికల్లో అవినీతి సొమ్ము ఎంతైనా పంచుతారు. పంచడానికి నా వద్ద ఏమీ లేదు. ప్రేమ ఆప్యాయత తప్ప. వైసీపీ ఎమ్మెల్యేలు బాగా ఇస్తారంట.. ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రె్‌సకు వేయండి. జగన్‌ 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. మెగా డీఎస్సీ అని 6వేలతో దగా డీఎస్సీ వేశారు. వైఎస్సార్‌ కొడుకు అయి ఉండి ఐదేళ్లూ నిద్రపోయాడు. ఇప్పుడు ఏదో ఉద్ధరించినట్లు సిద్ధం అంటూ బయల్దేరారు. దేనికి సిద్ధం సార్‌...?’ అంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు.

వైఎస్‌ ఫొటో పెట్టుకునే హక్కు వైసీపీకి లేదు: సునీత

వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత మాట్లాడుతూ.. ‘వైసీపీకి వైఎస్సార్‌ ఫొటో పెట్టుకునే హక్కు లేదు. ఆ హక్కు షర్మిలాకు మాత్రమే ఉంది. రాజశేఖర్‌రెడ్డి వారసురాలు షర్మిలనే. రాజశేఖర్‌రెడ్డి ఉన్నది కాంగ్రె్‌సలోనే. షర్మిలను భారీ మెజార్టీతో గెలపించాలి. అప్పుడే వివేకాకు ఘననివాళి. చనిపోయే వరకు తన జీవితం ప్రజలకు అంకితం చేశారు. ఇప్పుడు ఎంపీ జనాలతో కలుస్తున్నాడా.? వైఎస్‌ వివేకాను దారుణంగా నరికి చంపారు. అలాంటి వారికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి షర్మిలను ఎంపీగా గెలిపించి హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పాలి’ అని కోరారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మరచిపోవడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ.22వేల కోట్ల బకాయిలుపెట్టిందని, ఆఖరికి మెడికల్‌ బిల్లులు సైతం బకాయిలు పెట్టిన ఘనత వైసీపీదని షర్మిలారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కడపలో ఆమె మీడియాతో మాట్లాడారు. అందరితో పాటు ఉద్యోగులకు కూడా అండగా ఉండేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.

ఉద్యోగులకు ఏదీ గౌరవం?

నవ సందేహాలతో జగన్‌కు షర్మిల మూడో లేఖ

అమరావతి, కడప, మే 3(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానంటూ ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడమే కాకుండా, ఐదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలపై ఆయనకు రాస్తున్న లేఖల పరంపరలో భాగంగా శుక్రవారం షర్మిల మూడో లేఖాస్త్రం సంధించారు. ఉద్యోగుల విషయంలో అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పి, ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ని గెలిపిస్తే రాష్ట్రంలో ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

నవ సందేహాలివే..

1)అధికారంలోకొచ్చిన వారంలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామన్నారు. ఓపీఎస్‌ అమలు చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదు?

2) ఒకటో తేదీన జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల 15 నుంచి 25 దాకా ఆగాల్సి రావడం ఏమిటి? అసమర్థ పాలనకు ఇది నిదర్శనం కాదా?

3) 11వ పీఆర్‌సీ కమిషన్‌లో ప్రభుత్వం ప్రకటన చేసిన ఐఆర్‌ 27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చిన ఘనత జగన్‌ది కాదా?

4) 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం సిఫారసులు ఎందుకు అమలు చేయలేదు?

5) రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను 30 శాతం నుంచి 24శాతానికి, జిల్లాస్థాయి ఉద్యోగులకు హెచ్‌ ఆర్‌ఏ 20శాతం నుంచి 16శాతానికి ఎందుకు కుదించారు?

6) ఉద్యోగులకు చెల్లించాల్సిన 22వేల కోట్ల పాత బకాయిల సంగతి ఏమిటి?

7) 2022 నుంచి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు రూ.270 కోట్లను 2027లో చెల్లిస్తామని చెప్పడం ఏమిటి ?

8) ఉద్యోగుల సరెండర్‌ లీవుల బకాయిలు రూ.2,500 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు?

9) ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంగతేంటి?

Updated Date - May 04 , 2024 | 03:38 AM